సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘ఆరోగ్యవంతమైన చిన్నారుల‌తోనే ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం’’: డాక్టర్ కె. లక్ష్మణ్


సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌ ఆధ్వర్యంలో పోషణ మాసోత్స‌వం–2026పై ఇంటిగ్రేటెడ్ క‌మ్యూనికేష‌న్ ఆండ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌(ఐకాప్‌)ను ప్రారంభించిన ఎంపీ డాక్ట‌ర్ కె. ల‌క్ష్మ‌ణ్‌

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 4:03PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌ (సీబీసీ) ఆధ్వర్యంలో పోషణ మాసోత్స‌వం–2026పై ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మ్యూనికేష‌న్ ఆండ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌(ఐకాప్‌)ను రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్‌ గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజ్ ప్రాంగ‌ణంలో ఈ కార్యక్రమం జరిగింది.

పోషకాహారంపై అవగాహన క‌ల్పించేలా ఈ ప్రదర్శనను ఏర్పాటుచేసిన‌ సీబీసీని డాక్టర్ లక్ష్మణ్ అభినందించారు. ఈ ప్రదర్శన.. సమాచారాన్ని అందించ‌డంతో పాటు ఆలోచనలను రేకెత్తించే అంశాలతో ఆకట్టుకుందని అన్నారు. ఇది తనకూ కొత్త విషయాలను నేర్చుకునే అవ‌కాశాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో పోషకాహార ప్రాధాన్యాన్ని ఆయ‌న వివరించారు. ‘‘దేశ నిర్మాణమంటే ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రితో కట్టడాలు నిర్మించడం మాత్రమే కాదు. చిన్నారులను ఆరోగ్యవంతులుగా, దృఢంగా తీర్చిదిద్దడమే నిజమైన దేశ నిర్మాణం. దృఢమైన చిన్నారుల‌తోనే దృఢమైన భారత్‌, ఆరోగ్యవంతమైన భారత్‌ రూపుదిద్దుకుంటుంది’’ అని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

పోషకాహార అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, యువత క్రియాశీల కార్యకర్తలుగా, భాగస్వాములుగా మారాల‌ని ఆయన పిలుపునిచ్చారు. సరైన పోషకాహారంపై తల్లిదండ్రులు, చిన్నారులు, ముఖ్యంగా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు అవగాహన కల్పించాలని కోరారు. ఇలాంటి ప్రజా సంబంధాల కార్యక్రమాలను విద్యార్థులు ప్రాజెక్టుగా చేపట్టేలా కళాశాల యాజమాన్యం ప్రోత్సహించాలని సూచించారు. రక్తహీనత, తక్కువ బరువు, అధిక బరువు, ఊబకాయం, ఎదుగుదల లోపం వంటి సవాళ్లపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.

కేంద్ర ప్ర‌భుత్వం నిత్యం డిజిట‌ల్ ప‌ద్ధతుల ద్వారా దాదాపు 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు, సుమారు 9 కోట్ల మంది చిన్నారులను ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని ఆయ‌న‌ తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలో 11 లక్షలకు పైగా పాఠశాలల్లో దాదాపు 12 కోట్ల మంది చిన్నారులకు ప్రతిరోజూ వేడిగా వండిన భోజనం అందుతోందని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని కూడా ప్రస్తావించారు.

తెలంగాణలో వ‌య‌స్సుకు త‌గ్గ శారీర‌క‌ ఎదుగుదల లేని చిన్నారుల నిష్పత్తి 33 శాతం నుంచి 27 శాతానికి తగ్గిందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తల కృషి, ప్రభుత్వ సహకారంతోనే ఈ మెరుగుదల సాధ్యమైందని పేర్కొన్నారు.

చిరుధాన్యాలు, సంప్రదాయ ఆహార పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని డాక్టర్ లక్ష్మణ్ నొక్కిచెప్పారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. చిరుధాన్యాల‌ పోషక విలువలు, చిన్న, వర్షాధార రైతులకు వాటితో కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రదర్శించిన చిరుధాన్య ఆధారిత పోషకాహార ఉత్పత్తుల త‌యారీదారుల‌ను అభినందించారు. ఆవిష్కరణలు, ఔత్సాహిక అవకాశాలను అన్వేషించాలని విద్యార్థులకు సూచించారు.

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న అంకుర సంస్థల వ్యవస్థను ప్రస్తావిస్తూ యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాల‌ను సృష్టించే దిశగా కూడా ఆలోచించాలని డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

పోషకాహారంతోపాటు శారీరక దృఢత్వం కూడా అవసరమని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. విద్యార్థులు క్రీడలు, శారీరక కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరారు. ఇదే సంక‌ల్పంతో కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలను చేప‌ట్టింద‌ని గుర్తుచేశారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ప్రాధాన్యాన్ని కూడా వివరించారు. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు, శారీరక వ్యాయామం, యోగాను యువత రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

పీఐబీ/సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. పోషకాహారమంటే కేవలం ఆహారం మాత్రమే కాదని, అది ఆరోగ్యం, ఉత్పాదకత, అభ్యాసం, జీవన నాణ్యతకు కూడా సంబంధించిన‌ద‌ని అన్నారు. ప్రదర్శనలు, ఒగ్గుకథ, యక్షగానం వంటి సంప్రదాయ జానపద కళారూపాల ద్వారా విశ్వసనీయ పోషకాహార సందేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్ (సీబీసీ) పోషిస్తున్న పాత్రను వివరించారు. పోష‌కాహారంపై అవగాహనను ఆరోగ్యకరమైన అలవాట్లుగా మార్చి, మరింత ఆరోగ్యవంతమైన, బలమైన భారతదేశ‌ నిర్మాణానికి తోడ్పడటం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.

ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి శ్రీ అచ్యుత్ ప్రసాద్ రెడ్డి, ఏవీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ, పీఐబీ, సీబీసీ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 40 పోషకాహార సమాచార ప్యానెళ్ల‌తో ప్రదర్శన, నిపుణుల ప్రసంగాలు, ఐఈసీ స్టాళ్లు, ప్రదర్శనాత్మక కార్యక్రమాలు ఉన్నాయి. పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులపై సందేశాలను అందించే ఒగ్గుకథ, వీధి నాటకం/కోలాటం, యక్షగానం వంటి సంప్రదాయ జానపద కళా ప్రదర్శనలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2305488) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English