జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యార్థులు అంతర్జాతీయ దృక్పథాన్ని ప్రోది చేసుకోవాలి

· మన మూలాలు.. సంస్కృతిలోని కీలక విలువలకూ దృఢంగా కట్టుబడాలి: న్యూఢిల్లీలోని ‘ఎన్‌ఐఎఫ్‌టీ’ సంయుక్త స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధ

· అత్యున్నత ప్రతిభకు.. నవ్యారంభానికి ప్రతీకగా సంయుక్త స్నాతకోత్సవం

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 6:04PM by PIB Hyderabad

   న్యూఢిల్లీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ-నిఫ్ట్‌) సంయుక్త స్నాతకోత్సవం-2026ను ఇవాళ నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ పరిధిలో దేశవ్యాప్తంగా గల ఈ ప్రతిష్టాత్మక సంస్థ ప్రాంగణాల్లో ఉత్తీర్ణత ద్వారా కీలక మలుపు చేరిన విద్యార్థులకు పట్టా ప్రదానం చేశారు. వివిధ ప్రాంతాల్లోని 18 ‘ఎన్‌ఐఎఫ్‌టీ’ల పట్టభద్రులందరూ ఈ వేదికపై ఒక్కటయ్యారు. విద్యాపరమైన విజయాలు, సృజనాత్మక కృషి సహా అభ్యసనం నుంచి వృత్తి జీవనం వైపు ప్రస్థానానికి ఈ సామూహిక వేడుక ఒక వేదికగా మారింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము నిఫ్ట్‌ ‘విజిటర్‌’ హోదాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు, నిఫ్ట్‌ డైరెక్టర్ జనరల్ శ్రీమతి తనూ కశ్యప్ సహా పలువురు ప్రముఖులు, పాలకమండలి సభ్యులు, సీనియర్ అధికారులు, అధ్యాపక బృందం, పీహెచ్‌డీ స్కాలర్లు, పట్టభద్రులైన విద్యార్థులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ- మన సాంస్కృతిక వారసత్వంలో భాగంగానే కాకుండా లక్షలాది ప్రజల జీవనోపాధికి వస్త్ర, దుస్తుల రంగం వెన్నెముకగా నిలిచిందని గుర్తుచేశారు. సంప్రదాయ కళాకారులకు చేయూత, మార్గనిర్దేశం లభిస్తే, తదుపరి తరాలకూ ఈ వృత్తిలో సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో కొనసాగేందుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల నేత కార్మికులకు, కళాకారులకు వస్త్ర-దుస్తుల రంగంలోని ఆధునిక మెలకువలను పరిచయం చేసేలా వారిని మార్కెట్లతో అనుసంధానించేందుకు వివిధ నిఫ్ట్  కేంద్రాలు ‘క్రాఫ్ట్ క్లస్టర్ ఇనిషియేటివ్’ వంటి కార్యక్రమాలను నిర్వహించడంపై ఆమె హర్షం ప్రకటించారు. మునుపటితో పోలిస్తే నేడు మన దేశం మరింత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై తన వంతు పాత్రను పోషిస్తున్నదని రాష్ట్రపతి అన్నారు. భారత్‌ ప్రాబల్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించగల అపార సామర్థ్యం ఫ్యాషన్ టెక్నాలజీకి ఉందని తెలిపారు. పట్టభద్రులుగా వృత్తి జీవనంలోకి ప్రవేశించే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ దిశగా వారు అంతర్జాతీయ దృక్పథాన్ని ప్రోదిచేసుకుంటూ, మన మూలాలతోపాటు సంస్కృతి ప్రధాన విలువలకు కట్టుబడాలని ఉద్బోధించారు. తద్వారా వారు అత్యుత్తమ నిపుణులుగా రూపొందడమే కాకుండా భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు, సుసంపన్నతకు దోహదపడగలరని ఆమె అన్నారు.

కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ- వికసిత భారత్‌కు సమగ్ర చోదక శక్తిగా మారడంపై విద్యార్థులు భారీ సంకల్పం పూనడమే కాకుండా కఠోరంగా శ్రమించాలని హితవు పలికారు. జౌళిశాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. నిరంతర అభ్యసనం సహా నైపుణ్యాల మెరుగుదల ద్వారా అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

‘నిఫ్ట్‌’లో విజయవంతంగా విద్యాభ్యాసం పూర్తిచేసిన విద్యార్థుల అంకితభావం, విజయాలకు గుర్తింపునిచ్చే వేదికగా ఈ స్నాతకోత్సవం నిలిచింది. ఫ్యాషన్, సృజనాత్మక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అన్వేషణ, సహకారం, అనుభవంతో సంస్థలో వారి అభ్యసన కాలం సాగింది.

స్నాతకోత్సవంలో భాగంగా పట్టభద్రులైన విద్యార్థులతో నిఫ్ట్ డైరెక్టర్ జనరల్ ప్రతిజ్ఞ చేయించి, అధికారికంగా పట్టా ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా నిఫ్ట్ విద్యా కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి స్వర్ణ పతకాలను బహూకరించడం ఈ కార్యక్రమంలో కీలక ఘట్టంగా నిలిచింది. విద్యార్థులు సాధించిన సీజీపీఏ, సెమిస్టర్ వారీ ‘ఎస్‌జీపీఏ’లను పరిగణనలోకి తీసుకుంటూ అత్యుత్తమ విద్యా ప్రతిభ ఆధారంగా ఎంపికైన ఈ 10 మంది రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణ పతకాలను అందుకున్నారు.

కేంద్రీయ స్నాతకోత్సవ వేడుక అనంతరం ఆయా ప్రాంగణాల వారీగా పట్టా ప్రదానం చేశారు. తద్వారా వారందరూ లాంఛనంగా డిగ్రీలను స్వీకరించి, తమ సమకాలికులతో కలసి ఆనందోత్సాహాలతో ఈ వేడుకలో నిమగ్నమయ్యారు.

కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘ఎన్‌ఐఎఫ్‌టీ చట్టం-2006’ కింద 1986లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్‌) ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటైంది. డిజైన్, టెక్నాలజీ, హస్తకళ, పరిశోధన, ఆవిష్కరణ-పరిశ్రమ దృక్కోణాలన్నీ ఏకమయ్యే అంతర్విషయక అభ్యసన వాతావరణ సృష్టి ద్వారా భారత ఫ్యాషన్ విద్యా రంగాన్ని తీర్చిదిద్దడంలో ఈ సంస్థ మార్గదర్శక పాత్ర పోషించింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వృత్తిగతంగా నిర్వహిస్తున్న 20 ప్రాంగణాల ద్వారా నిఫ్ట్‌ విభిన్న ప్రతిభను ప్రోదిచేస్తూనే ఉంది. అలాగే, విద్యార్థులలో కొత్త ఆలోచనలను రేకెత్తించడానికి, సంప్రదాయ పద్ధతులను సవాలు చేసేలా వేగంగా మారుతున్న సృజనార్థిక వ్యవస్థ సంబంధిత పరిష్కారాల రూపకల్పనను ప్రోత్సహిస్తోంది. సమకాలీన అభ్యాసాన్ని, భారతీయ సుసంపన్న హస్తకళను సాంస్కృతిక, రూపకల్పన సంప్రదాయాలపైగల గౌరవంతో ఈ సంస్థ విద్యా విధానం సమ్మిళితం చేస్తుంది.

పట్టభద్రుల బృందం సన్నద్ధత నుంచి అవకాశాల వైపు మళ్లే మార్గాన్ని ఈ స్నాతకోత్సవం సూచించింది. నిఫ్ట్‌లో ఉండగా వారు పొందిన జ్ఞానం, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పరచుకున్న సహకారం, అధిగమించిన సవాళ్లు వంటివి నేడు వారి వృత్తికి, సృజనాత్మక కృషికి పునాదులుగా ఉపయోగపడతాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడీ పట్టభద్రులందరూ ఫ్యాషన్, వస్త్రాలు, డిజైన్, టెక్నాలజీ, వ్యవస్థాపకన, కమ్యూనికేషన్, అనుబంధ సృజనాత్మక రంగాలలో సేవలందిస్తున్న నిఫ్ట్‌ పూర్వ విద్యార్థుల సమూహంలో భాగమయ్యారు. భారత సాంస్కృతిక వారసత్వం, సమకాలీన ప్రపంచ పోకడలు రెండింటిపైనా అవగాహనతో తాము సేవలందించే పరిశ్రమలకు, సంస్థలకు సరికొత్త దృక్కోణాన్ని జోడించడానికి సంసిద్ధులయ్యారు.

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ సహా మొత్తం 3793 మంది విద్యార్థులు ఈ సంయుక్త స్నాతకోత్సవంలో పట్టాలు స్వీకరించారు. విజయం, ఆకాంక్ష, భవిష్యత్తు తదితరాలపై ఈ వేడుక వారిలో భరోసా నింపింది. విభిన్న వృత్తిగత, సృజనాత్మక రంగాల్లో ప్రవేశించే వేళ ‘నిఫ్ట్‌’లో వారిని తీర్చిదిద్దిన అభ్యసనం, విలువలు, అనుభవాలను వారు తమతో తీసుకెళ్తారు. ఆ విధంగా వారి భవిష్యత్ ప్రస్థానం భారత ఫ్యాషన్, డిజైన్, సృజనాత్మక రంగాలకు కొత్త కోణాలను జోడిస్తుంది. సృజనాత్మకత, కల్పనా చాతుర్యం తదితరాలతో కొత్త సృష్టికి నాయకత్వం వహించగల, వికసిత భారత్ రూపకల్పనకు తోడ్పడగల నవ తరం ప్రతిభను, సామర్థ్యాన్ని చాటుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2305256) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी