శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మొహాలీలోని నేషనల్ అగ్రి-ఫుడ్, బయోమాన్యుఫ్యాక్చరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ‘గ్రీన్ ఫోర్జ్’ సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
జన్యుమార్పిడి పంటల విప్లవంలో ఇదొక కీలక పరిణామంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి
జన్యుమార్పిడి పంటల సాగు, ప్రయోగాలకు నియంత్రిత వాతావరణాన్ని అందించనున్న ‘గ్రీన్ ఫోర్జ్’ సదుపాయం: డాక్టర్ జితేంద్ర సింగ్
వ్యవసాయ-బయోటెక్నాలజీ పరిశోధనలకు కొత్త దిశను అందించనున్న అధునాతన సిమ్యులేషన్, కృత్రిమ మేధ: డాక్టర్ జితేంద్ర సింగ్
అంకుర సంస్థలు, ఎస్‌ఎంఈలు, పరిశోధకులకు మద్దతుగా 22 తయారీ కేంద్రాలు, 8 ప్రత్యేక బయోఫౌండ్రీ సదుపాయాల అభివృద్ధి
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 5:12PM by PIB Hyderabad
మొహాలీలోని నేషనల్ అగ్రి-ఫుడ్ అండ్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ ఇనిస్టిట్యూట్ (జాతీయ వ్యవసాయ-ఆహార, జీవ తయారీ సంస్థ- బీఆర్‌ఐసీ ఎన్‌ఏబీఐ)లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘గ్రీన్ ఫోర్జ్’ సముదాయాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ, కేంద్ర భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వశాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. జన్యుమార్పిడి చేసిన పంటల విప్లవంలో ఇది ఒక కీలక పరిణామంగా ఆయన అభివర్ణించారు.
జాతీయ వ్యవసాయ-ఆహార, జీవ తయారీ సంస్థలో నిర్వహించిన బయోఈ3 (ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉపాధి కోసం బయోటెక్నాలజీ) జాతీయ సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. తాజాగా ప్రారంభించిన గ్రీన్ ఫోర్జ్ సదుపాయంలోని నియంత్రిత సిమ్యులేషన్ ఛాంబర్ల ద్వారా వివిధ పర్యావరణ పరిస్థితుల్లో జన్యుమార్పిడి పంటలను సాగు చేసి, వాటిపై ప్రయోగాలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. వివిధ ప్రాంతాలకు ఆయా పంటలు అనుకూలంగా ఉన్నాయా అన్న విషయాన్ని పరిశోధకులు అంచనా వేయడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.
గ్రీన్ ఫోర్జ్ సదుపాయం ప్రాధాన్యతను కేంద్ర మంత్రి వివరించారు. ఇందులోని సిమ్యులేషన్ ఛాంబర్లలో కాంతి పరిమాణం, కాంతి నాణ్యత, తేమ, ఉష్ణోగ్రతలను మార్చుతూ జన్యుమార్పిడి పంటల పెరుగుదలకు, ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని తెలిపారు. వివిధ పర్యావరణ పరిస్థితుల్లో ఒక నిర్దిష్ట పంట ఎలా పెరుగుతుందనే విషయాన్ని పరిశోధకులు అర్థం చేసుకోవడానికి ఈ సదుపాయం సహాయపడుతుందని, తద్వారా ఆ పంటను ఏయే ప్రాంతాల్లో సాగు చేయడం అనుకూలమో అంచనా వేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా జన్యు మార్పిడి ఒక పంట రకాన్ని అభివృద్ధి చేసినప్పుడు, దానిని అత్యంత సమర్థవంతంగా ఎక్కడ సాగు చేయవచ్చో నిర్ణయించడం ఒక ముఖ్యమైన సవాలని కేంద్ర మంత్రి తెలిపారు. వివిధ పర్యావరణ పరిస్థితులను నియంత్రిత వాతావరణంలో పునర్నిర్మించడం ద్వారా గ్రీన్ ఫోర్జ్ ఈ సమస్యను అధిగమించడంలో సహాయపడుతుందని చెప్పారు. దీని ద్వారా పంటలను సరైన సాగు ప్రాంతాలకు తీసుకెళ్లే ముందు, వివిధ పరిస్థితుల్లో అవి ఎలా స్పందిస్తాయో పరిశోధకులు అధ్యయనం చేయవచ్చని తెలిపారు.
సహజంగా పునరుత్పత్తి కష్టమైన నిర్దిష్ట పర్యావరణ పరిస్థితులను కూడా గ్రీన్ ఫోర్జ్ సదుపాయం పునర్నిర్మించగలదని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. కాంతి నాణ్యత, కాంతి పరిమాణం, తేమ, ఉష్ణోగ్రతలను నియంత్రించడంతో పాటు, కృత్రిమ మేధ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానించే అవకాశం ఉండటం వల్ల పరిశోధకులకు ప్రయోగాలు నిర్వహించడంలో మరింత వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. వ్యవసాయ, వైద్య శాస్త్రాల్లో కీలకమైన పరిశోధనలకు గ్రీన్ ఫోర్జ్ ఒక వినూత్న సదుపాయంగా ఆయన అభివర్ణించారు.
ఇలాంటి సదుపాయాలు బయోటెక్నాలజీ, అధునాతన సిమ్యులేషన్, కృత్రిమ మేధల మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. గ్రీన్ ఫోర్జ్ సామర్థ్యాలను కృత్రిమ మేధతో అనుసంధానించడం ద్వారా పరిశోధనా ప్రక్రియలు మరింత సులభతరం కావడంతో పాటు, అధునాతన ప్రయోగాలకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు.
భారత్‌లోని బయోటెక్నాలజీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న విస్తృత మార్పులను ప్రస్తావిస్తూ .. భారత్ బయో ఎకానమీ (జీవ ఆర్థిక వ్యవస్థ) 10 బిలియన్ డాలర్ల నుంచి 200 బిలియన్ డాలర్లకు విస్తరించిందని తెలిపారు. ఈ వృద్ధిని భారీ స్థాయి పురోగతిగా అభివర్ణించిన డాక్టర్ జితేంద్ర సింగ్.. అనుకూలమైన విధానపరమైన వాతావరణం, ప్రైవేటు రంగంతో పెరిగిన భాగస్వామ్యం ఈ పురోగతికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
బయోఈ3 కార్యక్రమం దృష్టి... క్రమంగా పరిశ్రమలకు సిద్ధంగా ఉండే తయారీ వ్యవస్థల వైపు మళ్లుతోందని మంత్రి తెలిపారు. పరిశోధనలను ఉత్పత్తులు, సాంకేతికతలు, పరిష్కారాలుగా మలచడమే లక్ష్యమని పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధనలు చివరకు పరిశ్రమలు, ఇతర భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, తద్వారా పరిశోధనలపై పెట్టే కృషి అర్థవంతమైన ఫలితాలను అందించేలా చూడాలని ఆయన అన్నారు.
అంకుర సంస్థలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈలు), పరిశోధకుల అవసరాలను తీర్చేందుకు 22 తయారీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఎనిమిది ప్రత్యేక సదుపాయాలతో కూడిన జాతీయ బయో-ఫౌండ్రీ వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంకురాలు, ఔత్సాహికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఇది కీలక కార్యక్రమంగా పేర్కొన్నారు. ఇప్పటికే 50కి పైగా ప్రక్రియాపరమైన ఆవిష్కరణలను విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని, పరిశోధనలను ఆచరణాత్మక వినియోగం వైపు తీసుకెళ్లడంపై పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని అన్నారు.
కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ (సీసీయూ) రంగంలో జరుగుతున్న కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. ఈ రంగంలో బయోటెక్నాలజీ శాఖ సుమారు 38 ప్రాజెక్టులకు మద్దతు అందిస్తోందని తెలిపారు. సమీకృత బయో-మాన్యుఫ్యాక్చరింగ్ సీసీయూ విధానం ద్వారా కార్బన్‌ను సంగ్రహించడంతో పాటు, సిమెంట్, ఉక్కు వంటి పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు పరిష్కారాలను అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
సుస్థిర విమానయాన ఇంధనాలు, ఐ3 పీహెచ్డీ కార్యక్రమం, అంతరిక్ష బయోటెక్నాలజీ వంటి బయోటెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న రంగాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. జీవశాస్త్ర ప్రయోగాల్లో ఇస్రోతో కొనసాగుతున్న సహకారాన్ని వివరించడంతోపాటు మయోజెనెసిస్ (కండరాల కణజాల అభివృద్ధి), జ్ఞాన సంబంధిత ప్రభావాలు, సయనోబ్యాక్టీరియా వృద్ధి వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. జన్యుశాస్త్ర రంగంలోనూ భారత్ తన పరిశోధనా ప్రస్థానాన్ని ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ బయోటెక్నాలజీ రంగంలో బీఆర్‌ఐసీ-ఎన్‌ఏబీఐ చేస్తున్న కృషిని, ముఖ్యంగా బయోప్రాసెస్ ఇంజినీరింగ్‌తో దాని అనుసంధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. వ్యవసాయ వ్యర్థాలను న్యూట్రాస్యూటికల్స్, అధిక విలువ కలిగిన బయోమెటీరియల్స్‌గా మార్చడం ద్వారా వ్యవసాయ అవశేషాల నుంచి విలువను సృష్టించేందుకు ఈ కృషి దోహదపడుతుందని తెలిపారు.
సంస్థల మధ్య మరింత సహకారం, క్లస్టరింగ్ అవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. ఒకే నగరం లేదా ప్రాంతంలో ఉన్న సంస్థలు పరస్పరం మరింత సమన్వయంతో పనిచేసే అవకాశాలను అన్వేషించాలని అన్నారు. ఇటువంటి క్లస్టర్ల ద్వారా పరిశోధనా సహకారంతో పాటు విద్యా రంగంలోనూ పరస్పర సహకారం పెరుగుతుందని, ముఖ్యంగా విద్యార్థుల మధ్య పరస్పర భాగస్వామ్యం, వివిధ సంస్థల్లోని ప్రతిభను గుర్తించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల్లోని సంస్థల క్లస్టరింగ్‌కు సంబంధించిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. చండీగఢ్‌లోనూ ఇలాంటి సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. బయోటెక్నాలజీ, వైద్యం, వ్యవసాయం, ఔషధ రంగాలు, సంబంధిత ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావాలని అన్నారు. ఇటువంటి అనుసంధానం ఎన్‌ఐబీఐ పరిధిని విస్తరించడంతో పాటు కొత్త ఆలోచనలు, అంతర్శాఖల సహకారానికి అవకాశాలను పెంచుతుందని తెలిపారు.
భారత బయోటెక్నాలజీ రంగం ఇప్పుడు కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా... కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను అందించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనికితోడు తక్కువ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాల పునరావృత వినియోగంతో కూడిన సర్క్యూలర్ ఎకానమీ అందుబాటులోకి వస్తోందన్నారు. ఈ మార్పు మన దేశ ‘నెట్ జీరో 2070’ లక్ష్యానికి, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఎంతో తోడ్పడుతుందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఐసీ-ఎన్‌ఏబీఐ బృందాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ముఖ్యంగా వ్యవసాయ బయోటెక్నాలజీ రంగంలో భారత బయోటెక్నాలజీ విప్లవానికి మార్గదర్శక సంస్థల్లో ఒకటిగా ఎన్‌ఏబీఐ ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బయోటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే, ఎన్‌ఏబీఐ డైరెక్టర్ డాక్టర్ పరీఖ్, బీఐఆర్ఏసీ ఎండీ డాక్టర్ ధనంజయ్ తివారీ ప్రసంగించారు.
***
(రిలీజ్ ఐడి: 2305254)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23