నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
కాలుష్య రహిత ఇంధన కార్యాచరణ వేగం పెంచాలి
• ‘బీఆర్ఈ సమ్మిట్-2026’ రోడ్‌షో హైదరాబాద్ చేరిన నేపథ్యంలో ప్రభుత్వం పిలుపు
• న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నవంబరు 2 నుంచి 5 వరకు ‘భారత పునరుత్పాదక ఇంధన సదస్సు-ప్రదర్శన’ (బీఆర్‌ఈ)
• ఈ సన్నాహకాల్లో భాగంగా కాలుష్య రహిత ఇంధన రంగ భాగస్వాములను ఒక వేదికపైకి తెస్తూ జాతీయ స్థాయిలో మూడోదిగా హైదరాబాద్ రోడ్‌షో
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 7:23PM by PIB Hyderabad
జాతీయ స్థాయిలో అత్యంత భారీదైనా “భారత పునరుత్పాదక ఇంధన సమ్మిట్ అండ్ ఎక్స్‌పో-2026” (బీఆర్‌ఈ సమ్మిట్)లో భాగంగా తొలి రెండో రోడ్‌షోలను జైపూర్, ముంబయి నగరాల్లో నిర్వహించారు. ఈ ప్రాంతీయ రోడ్‌షోల పరంపర ఉత్తేజాన్ని హైదరాబాద్‌లో కొనసాగిస్తూ ప్రభుత్వ, పారిశ్రామిక, పునరుత్పాదక ఇంధన రంగ ప్రముఖులు ఈ రోజు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. దేశం 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యం సాధించాలనే లక్ష్యం దిశగా భారత్ శరవేగంగా పురోగమిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర శక్తియుత కాలుష్య రహిత ఇంధనావరణ వ్యవస్థను జాతీయ స్థాయిలో ప్రస్ఫుటం చేసింది. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల విభిన్న కాలుష్య రహిత ఇంధన సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలను కూడా వెల్లడించింది.
పునరుత్పాదక ఇంధన విస్తరణ, సాంకేతికత, తయారీ, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు-పెట్టుబడులు తదితర రంగాల రీత్యా జాతీయ ఇంధన రూపాంతరీకరణలో దక్షిణాదిలోని ఈ మూడు రాష్ట్రాలకూ కీలక, పరస్పర పూరక సామర్థ్యం ఉంది. ప్రగతిశీల విధానాలు, పెరుగుతున్న ఇంధన ప్రాజెక్టుల సంఖ్య, అవకాశాలతో జాతీయ పునరుత్పాదక ఇంధన రంగ వృద్ధిలో తదుపరి దశకు ఈ మూడు రాష్ట్రాలూ శక్తివంచన లేకుండా దోహదం చేయగలవు. ఈ నేపథ్యంలో నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఈ రోడ్‌షోను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాల నాయకులు, సస్టెయినబుల్ ప్రాజెక్ట్స్ డెవలపర్స్ అసోసియేషన్, ఇండియన్ సోలార్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌ల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారు.
అంతర్జాతీయ సౌర కూటమి 9వ సమావేశం, గ్రీన్ హైడ్రోజన్‌పై 4వ అంతర్జాతీయ సదస్సుతోపాటు బీఆర్‌ఈ సమ్మిట్-2026ను నిర్వహిస్తున్నారు. ప్రపంచ అగ్రగాములు, విధాన రూపకర్తలు సహా పారిశ్రామికులు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు తదితరులందరూ ఈ సదస్సు ద్వారా ఒకే వేదికపైకి వచ్చారు.

ఈ సందర్భంగా సస్టెయినబుల్ ప్రాజెక్ట్స్ డెవలపర్స్ అసోసియేషన్ పాలక మండలి సభ్యుడు శ్రీ రవివర్మ తొలుత ఆహూతులకు స్వాగతం పలకడంతోపాటు రోడ్‌షో నేపథ్యాన్ని వివరించారు.
ఈ మేరకు పారిశ్రామిక సహకార బలోపేతం లక్ష్యంగా వాటాదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, బీఆర్‌ఈ సమ్మిట్-2026 వ్యూహాత్మక బృహత్ప్రణాళికను విశదీకరిస్తూ హైదరాబాద్ రోడ్‌షో ఒక సమగ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా కాలుష్య రహిత ఇంధన రూపాంతరీకరణ వైపు భారత్ ప్రస్థానాన్ని వివరిస్తూ, న్యూఢిల్లీ సమ్మిట్ స్థాయిని ఆవిష్కరిస్తూ- ‘ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ జర్నీ’, ‘బీఆర్‌ఈ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో-2026’ పేరిట రెండు చిత్రాలను ప్రదర్శించారు.
అటుపైన నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ సీనియర్ ప్రతినిధి ఒకరు వివిధ అంశాలను విశదీకరించారు. ఈ మేరకు జాతీయ-అంతర్జాతీయ భాగస్వాముల కోసం వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రధానాంశాలు, ప్రతిపాదిత భాగస్వామ్య చట్రం తదితరాల గురించి వివరించారు. అనంతరం ‘ఓఈఎం’లు, ప్రాజెక్ట్ డెవలపర్లు, పెట్టుబడిదారులకుగల వ్యాపార అవకాశాలు, వాణిజ్య భాగస్వామ్య నమూనాలపై ఒక ప్రత్యేక గోష్ఠి కూడా నిర్వహించారు. దీంతోపాటు అధికారిక బీఆర్‌ఈ సమ్మిట్ డిజిటల్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌పై ప్రత్యక్ష ప్రదర్శన-వివరణ కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) వైస్ ఛాన్సలర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కమలాకర్ బాబు మెరుపు మాట్లాడుతూ... 2029 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత పరిశుద్ధ ఇంధన విధానం-2024 కింద రాష్ట్రం రూపొందించిన ప్రతిష్ఠాత్మక పరిశుద్ధ ఇంధన రోడ్‌మ్యాప్‌ను ఆయన వివరించారు. పునరుత్పాదక ఇంధనం, నిల్వ, గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్, పరిశుద్ధ ఇంధన తయారీ, పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ (ఆర్ఈఎమ్‌జెడ్) వంటి ప్రాజెక్టులతో రాష్ట్ర బలమైన పెట్టుబడి ప్రతిపాదననూ ఆయన వివరించారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌ను పరిశుద్ధ ఇంధన పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలుపుతాయని శ్రీ కమలాకర్ బాబు తెలిపారు. పరిశుద్ధ ఇంధన అవకాశాలను ప్రదర్శించడానికి, పెట్టుబడిదారులు, పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు జరపడం లక్ష్యంగా భారత పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్‌పో-2026లో క్రియాశీల భాగస్వామ్యం కోసం రాష్ట్రం ఆసక్తిగా ఉందనీ ఆయన తెలిపారు.
తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీమతి బి. రాజేశ్వరి మాట్లాడుతూ... పునరుత్పాదక ఇంధన రంగంలో, ముఖ్యంగా పవన, సౌర విద్యుత్ రంగాల్లో తమిళనాడు సుదీర్ఘకాల నాయకత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో సమీకృత పునరుత్పాదక ఇంధన వ్యవస్థ బలోపేతం కోసం రూపొందించిన ప్రణాళికలను ఆమె వివరించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించడంలో, గరిష్ట విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఇంధన నిల్వ, పంప్డ్-స్టోరేజ్ ప్రాజెక్టుల ప్రాముఖ్యత పెరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. సరళీకృత, ఆన్‌లైన్ ఆమోద ప్రక్రియల ద్వారా పెట్టుబడిదారులకు మరింత అనువైన వాతావరణాన్ని కల్పించడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలనూ శ్రీమతి రాజేశ్వరి ప్రముఖంగా ప్రస్తావించారు.
తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ అలీ ఫరూఖీ మాట్లాడుతూ... పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పరిశుద్ధ ఇంధన తయారీ కోసం ప్రోత్సాహకాలను అందించే పరిశుద్ధ, హరిత ఇంధన విధానం-2025 మద్దతుతో తెలంగాణలో పెరుగుతున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ప్రముఖంగా ప్రస్తావించారు. వేగంగా పెరుగుతున్న రాష్ట్ర ఇంధన అవసరాలను పరిశుద్ధ ఇంధనం ద్వారా తీర్చాలనే రాష్ట్ర దార్శనికతనూ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించాల్సిందిగా పెట్టుబడిదారులు, తయారీదారులు, పరిశ్రమలను ఆహ్వానిస్తూ... భారత పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్‌పో-2026లో క్రియాశీల భాగస్వామ్యానికి తెలంగాణ కట్టుబడి ఉందని శ్రీ ముషారఫ్ అలీ పునరుద్ఘాటించారు.

నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) సంయుక్త కార్యదర్శి శ్రీ అనుపమ్ కుమార్ హైదరాబాద్ రోడ్‌షోలో ప్రసంగించారు. భారత పునరుత్పాదక ఇంధన ప్రస్థానం నూతన దశలోకి ప్రవేశించిందని ఆయన పేర్కొన్నారు. శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం 300 గిగావాట్లను దాటిందనీ, 2030 నాటికి 500 గిగావాట్ల ప్రతిష్ఠాత్మక లక్ష్యం దిశగా దేశం పురోగమిస్తోందని శ్రీ అనుపమ్ కుమార్ తెలిపారు. ఈ పరివర్తన తదుపరి దశ కేవలం పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడానికే పరిమితం కాదన్నారు. ప్రసారం, ఇంధన నిల్వ, తయారీ, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ టెక్నాలజీలు, ఫ్లెక్సిబుల్ పవర్, డిమాండ్‌ను కలుపుకొని... ఒక సమీకృత, విశ్వసనీయ, సౌకర్యవంతమైన పరిశుద్ధ ఇంధన వ్యవస్థను నిర్మించడంపై ఈ దశ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధనం ఇకపై కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదన్నారు. అది భారత ఇంధన భద్రత, ఆర్థిక సామర్థ్యం, పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా మారిందని శ్రీ అనుపమ్ కుమార్ పేర్కొన్నారు. సాంకేతికత, ఇంజనీరింగ్, తయారీ, పరిశోధన, వ్యవస్థాపనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల బలాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మూడు రాష్ట్రాలు పరిశుద్ధ ఇంధన సాంకేతికతల వినియోగదారులుగా మాత్రమే కాకుండా... భారత ఇంధన పరివర్తనలో ఉత్పత్తిదారులుగా, ఆవిష్కర్తలుగా, పెట్టుబడిదారులుగా, సాంకేతిక భాగస్వాములుగా ఎదిగే అవకాశం ఉందనీ శ్రీ అనుపమ్ కుమార్ తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పాదక రంగం, పవర్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ, ఇతర నిల్వ సాంకేతికతలు, ఎలక్ట్రోలైజర్లు, గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాలు, గ్రిడ్ సాంకేతికతలు, డిజిటల్ ఇంధన-నిర్వహణ వ్యవస్థలు, ఏఐ-ఆధారిత అంచనాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, బయోఎనర్జీ, అధునాతన పదార్థాల వంటి రంగాల్లో పెరుగుతున్న అవకాశాలనూ ఆయన ప్రస్తావించారు. తమ పునరుత్పాదక ఇంధన రోడ్‌మ్యాప్‌లు, పెట్టుబడి అవకాశాలు, గ్రీన్-హైడ్రోజన్, నిల్వ ప్రణాళికలు, పారిశ్రామిక సామర్థ్యాలు, ఆవిష్కరణల వ్యవస్థలను ప్రపంచానికి ప్రదర్శించడానికి భారత పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్‌పో-2026ను వేదికగా ఉపయోగించుకోవాలని మూడు రాష్ట్రాలకూ ఆయన సూచించారు. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా వాగ్దానాల నుంచి అమలు వైపు పయనించడం, భారత పరిశుద్ధ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడంపై స్పష్టమైన దృష్టితో... విధానాలను మూలధనంతో, మూలధనాన్ని ప్రాజెక్టులతో, సాంకేతికతను మార్కెట్లతో, రాష్ట్రాలను పెట్టుబడిదారులతో కలిపే ఒక వేదికగా బీఆర్ఈ సదస్సు-2026ను రూపొందించినట్లు శ్రీ అనుపమ్ కుమార్ వివరించారు.
అధికారిక కార్యక్రమాలను ముగిస్తూ, ఇండియన్ సోలార్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) సెక్రటరీ జనరల్ శ్రీ అమిత్ మనోహర్ కృతజ్ఞతలు తెలియజేశారు. సదస్సు ప్రతిపాదించిన సహకార దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సౌర తయారీ రంగం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
వరస రోడ్‌షోలు- దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం
దేశవ్యాప్త అవగాహన ప్రచారంలో హైదరాబాద్ రోడ్‌షో మూడో విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. నవంబర్‌లో జరిగే ప్రధాన సదస్సుకు ముందస్తుగా ప్రాంతీయ స్థాయిలో విస్తృత మద్దతును సమీకరించేందుకు ఈ ప్రచారాన్ని చేపట్టారు. ఆగస్టు 24న జైపూర్‌లో తొలి రోడ్‌షో, ఆగస్టు 27న ముంబయిలో రెండో రోడ్‌షో నిర్వహించారు. రాబోయే వారాల్లో అహ్మదాబాద్, లక్నో, బెంగళూరు, కోల్‌కతాలలో తదుపరి రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాబోయే ప్రాంతీయ సమావేశాలలో చురుగ్గా పాల్గొనాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను మంత్రిత్వశాఖ, నిర్వాహక భాగస్వాములు కోరారు.
భారత్ పునరుత్పాదక ఇంధన శిఖరాగ్ర (బీఆర్ఈ) సదస్సు - ప్రదర్శన 2026 గురించి:
ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రదర్శనలలో ఒకటైన భారత పునరుత్పాదక ఇంధన శిఖరాగ్ర సదస్సు - ప్రదర్శన 2026 స్వచ్ఛమైన ఇంధన రంగంలో భాగస్వామ్యాలను, పెట్టుబడులను పెంపొందించడానికి కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం. పెట్టుబడి - ఆవిష్కరణ - స్ఫూర్తి ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సదస్సు 2026 నవంబర్ 2 నుంచి 5 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన మార్పును వేగవంతం చేసేందుకు ప్రభుత్వాలు, విధాన రూపకర్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, బహుపాక్షిక సంస్థలు, అంతర్జాతీయ ప్రాధికారిక సంస్థలను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. రీ-ఇన్వెస్ట్ సాధించిన విజయవంతమైన పరంపరను పునాదిగా చేసుకుని, 'బిఆర్ఇ సమ్మిట్ 2026' తన పరిధిని కేవలం పెట్టుబడులకే పరిమితం చేయకుండా విధాన రూపకల్పన, సాంకేతికత, తయారీ రంగం, ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాల దిశగా మరింత విస్తరించింది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) తొమ్మిదో 9వ సమావేశం, గ్రీన్ హైడ్రోజన్‌పై 4వ అంతర్జాతీయ సదస్సుతో పాటు ఏకకాలంలో జరుగుతుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత నాయకత్వం, ప్రపంచ సౌర ఇంధన సహకారం, అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థ ప్రాధాన్యతను ఇది చాటిచెబుతుంది. ఈ సదస్సుకు 75కుపైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో 20పైగా రాష్ట్ర ప్రభుత్వాలు, 250మందికి పైగా ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారు. 80పైగా ప్రత్యేక చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. 500మందికి పైగా వక్తలు పాల్గొంటారు. గ్రీన్ హైడ్రోజన్ నెట్ వర్కింగ్, అంతర్జాతీయ సౌర ఇంధన సహకారం, 400 మందికి పైగా ప్రదర్శనదారులతో మెగా ఎక్స్‌పో, 25 మందికి పైగా నాలెడ్జ్ పార్ట్‌నర్లు ఈ సదస్సులో భాగం కానున్నారు.
మరిన్ని వివరాలు, తాజా సమాచారం కోసం www.bresummit.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
***
(రిలీజ్ ఐడి: 2305214)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12