రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఊపందుకున్న పరివర్తన్ పథకం
ఢిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా 1,300 మందికి పైగా లబ్ధిదారులు నమోదు
పథకంలో చేరిన 42 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, 15 ఆటో ఓఈఎంలు
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 6:58PM by PIB Hyderabad
కేంద్ర మంత్రివర్గం 'పరివర్తన్' (రవాణా వాయు కాలుష్యం, నెట్‌వర్క్ ఉద్గారాలను తగ్గించడానికి వాహన ఆస్తుల వేగవంతమైన పునరుద్ధరణ, ప్రోత్సాహక కార్యక్రమం) పథకాన్ని 2026 జూన్ 3వ తేదీన ఆమోదించింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ఎన్‌సీఆర్ జిల్లాల్లో నమోదైన, భారత్ స్టేజ్ (బీఎస్)-IV లేదా అంతకు ముందరి ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న 2 లక్షలకు పైగా ట్రక్కులు, బస్సుల స్థానంలో... ఈ పథకం కింద బిఎస్-VI లేదా మరింత కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రాజధాని ప్రాంత ప్రణాళికా బోర్డు ద్వారా ఈ పథకానికి నిధులు సమకూరుతున్నాయి. దీనిని రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.
ఈ పథకం మొత్తం ఆర్థిక వ్యయం రూ. 9,585 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే రూ. 5,041 కోట్ల బడ్జెట్ మద్దతు ఇందులో భాగంగా ఉంది. బిఎస్-VI లేదా అంతకంటే కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఉండే కొత్త డీజిల్ లేదా సీఎన్‌జీ వాహనాలను లేదా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే అర్హులైన లబ్ధిదారులు ఈ పథకం కింద కింది ప్రోత్సాహక ప్యాకేజీని పొందేందుకు అర్హులు:
అర్హత కలిగిన వాహన రుణాలపై 5 సంవత్సరాల పాటు 5 శాతం వడ్డీ ఆదా.
10 సంవత్సరాల పాటు 100 శాతం రహదారి పన్ను మినహాయింపు. రిజిస్ట్రేషన్ రుసుముల పూర్తి మినహాయింపు. (ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే దీనికి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశాయి).
దీనిలో భాగంగా ఉన్న ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎంల) ద్వారా ఎక్స్-షోరూమ్ ధరపై కనీసం 8 శాతం తగ్గింపు.
బిఎస్-VI డీజిల్ లేదా సీఎన్‌జీ వాహనాల కొనుగోలుదారులకు వాహన రకాన్ని బట్టి ఐదేళ్లపాటు నెలకు రూ. 1,200 నుంచి రూ. 4,800 వరకు విలువైన ఇంధన వోచర్లు అందిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు రూ. 64,000 నుంచి రూ. 2.56 లక్షల వరకు ప్రోత్సాహకం ఏకమొత్తంగా అందిస్తారు.
ఈ పథకాన్ని 14 జూలై 2026న ప్రారంభించారు. 27 ఆగస్టు 2026 నాటికి పరివర్తన్ పోర్టల్‌లో 1,300 మందికి పైగా లబ్ధిదారులు నమోదు చేసుకున్నారు. ఆర్థిక సహాయాన్ని అందించడానికి, వాహన రుణాల వడ్డీపై రాయితీనివ్వడం కోసం 42 బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ పథకంలో భాగమయ్యాయి. పరిశ్రమ తరపున, అర్హులైన లబ్ధిదారులకు రాయితీని అందించడానికి 15 ఆటో ఓఈఎంలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ పథకం కింద లభించే ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి ఢిల్లీ-ఎన్‌సిఆర్ వ్యాప్తంగా గల అర్హులైన వాహన యజమానులకు తెలియజేయడానికి బహుముఖ అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, భాగస్వామ్యాన్ని విస్తృతం చేసే లక్ష్యంతో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు... ఢిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా ఉన్న ఇంధన స్టేషన్లు, ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లు, టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాల వద్ద బహిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2304460)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10