యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘‘ప్రతి చిన్నారికీ ఆడే అవకాశం ఉండాలి... ప్రతిభగలవారందరికీ రాణించే అవకాశం దక్కాలి’’: జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లోని ఇఫ్లూలో ‘ఖేలో ఇండియా సంవాద్’ను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్రమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 AUG 2026 2:42PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఈ రోజు నిర్వహించిన ‘ఖేలో ఇండియా సంవాద్–ఖేల్ కీ బాత్ పీఎం కే సాథ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో, దేశ నిర్మాణంలో యువత చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఖేలో ఇండియా సంవాద్’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. 21వ శతాబ్దానికి తగిన ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించడం, 2036 ఒలింపిక్ క్రీడలకు భారత యువతను సిద్ధం చేయడంపై ప్రధాన దృష్టితో ఆయన ప్రసంగం సాగింది. దేశవ్యాప్తంగా యువత తమ ఆలోచనలను పంచుకునేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పించింది.
‘‘ప్రతి చిన్నారికీ ఆడే అవకాశం ఉండాలి. ప్రతిభగలవారందరికీ రాణించే అవకాశం దక్కాలి. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడేందుకు ప్రతి అథ్లెట్‌కు అవసరమైన సహకారం లభించాలి’’ అని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం ఇస్తున్న సత్ఫలితాలు ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. భారత క్రీడాకారుల ప్రదర్శనలు ఒక తరం మొత్తానికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా 1,500కు పైగా విద్యాసంస్థలు ‘ఖేలో ఇండియా సంవాద్’లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమ విస్తృతి, పరిధికి ఇది నిదర్శనం. ఇంత భారీ స్థాయిలో ప్రధానమంత్రితో జరిగిన ఈ సంభాషణ కార్యక్రమం యువత తమ ఆలోచనలను పంచుకునేందుకు విలువైన వేదికను అందించిందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో, దేశాభివృద్ధిలో యువత క్రియాశీల భాగస్వాములుగా మారేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
క్రీడలపై భారత ప్రభుత్వ దృక్పథంలో మౌలిక మార్పు వచ్చిందని కేంద్ర మంత్రి అన్నారు. క్రీడలను ఇకపై పాఠ్యేతర కార్యకలాపంగా మాత్రమే చూడటం లేదన్నారు. యువజనాభివృద్ధి, ఆరోగ్యం, క్రమశిక్షణ, ఉపాధి, జాతీయ గౌరవం, దేశ నిర్మాణానికి కీలక సాధనంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.

భారత్ ఇటీవల సాధించిన క్రీడా విజయాలను ప్రస్తావిస్తూ... టోక్యో–2020 ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా సాధించిన చరిత్రాత్మక స్వర్ణ పతకం, 41 ఏళ్ల నిరీక్షణ అనంతరం టోక్యోలో భారత పురుషుల హాకీ జట్టు గెలుచుకున్న కాంస్య పతకం, పారిస్–2024లో మను భాకర్ సాధించిన రెండు చరిత్రాత్మక కాంస్య పతకాలను శ్రీ కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఒలింపిక్ పోడియంను చేరుకోవడం తమకూ సాధ్యమేనన్న విశ్వాసాన్ని ఈ విజయాలు కోట్లాది భారత యువతలో కలిగిస్తున్నాయని అన్నారు.
2014కు ముందుతో పోలిస్తే క్రీడా రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు, అథ్లెట్లకు అవకాశాలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు పెరిగిన పెట్టుబడులు నిదర్శనమని పేర్కొన్నారు.
టోక్యో, పారిస్ విజయాలతోనే భారత్ ఆగిపోకూడదని, మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 2036 ఒలింపిక్స్‌కు సన్నాహాలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అకాడమీలు, క్రీడా మైదానాలు, ఖేలో ఇండియా కేంద్రాల్లో ఇప్పటి నుంచే ప్రారంభం కావాలని అన్నారు.
విద్యాసంస్థల పాత్రను ప్రస్తావిస్తూ... యువత చదువుతోపాటు క్రీడల్లోనూ ముందుకు సాగే వాతావరణాన్ని రూపొందించడంలో ఇఫ్లూ వంటి విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించగలవని కేంద్ర మంత్రి అన్నారు. విద్యార్థులు కేవలం భారత భవిష్యత్తు మాత్రమే కాదని, దేశ ప్రస్తుత శక్తి కూడా వారేనని పేర్కొన్నారు.
క్రీడల ద్వారా అలవడే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమష్టి కృషి, నాయకత్వం, పట్టుదల, క్రీడాస్ఫూర్తి వంటి లక్షణాలే బలమైన, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి అవసరమని ఆయన అన్నారు.
యువ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, కఠోర శిక్షణ పొందాలని, క్రమశిక్షణతో మెలగాలని, తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలని శ్రీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒలింపిక్ పతకాలు మహానగరాల నుంచే రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాలు సహా దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ప్రతిభ వెలుగులోకి రాగలదని అన్నారు.

ప్రపంచ క్రీడా పోటీల్లో భారత్ ఇప్పుడు కేవలం పాల్గొనే దేశంగా ఉండిపోవడం లేదని, అంతర్జాతీయ వేదికపై తన పోటీ సామర్థ్యాన్ని మరింతగా చాటుతోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీల ఆతిథ్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా భారత్‌లో పెరుగుతున్న క్రీడా ఆకాంక్షలు... ప్రపంచ క్రీడా శక్తిగా దేశం ఎదుగుతున్న తీరును ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
భారత యువత సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన శ్రీ కిషన్ రెడ్డి... 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్ క్రీడల్లో దేశానికి గర్వకారణంగా నిలిచే ఛాంపియన్లు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న యువతలోనే ఉండవచ్చని అన్నారు.

‘దృఢమైన భారత్, ఆరోగ్యకరమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్, ఆత్మవిశ్వాసం గల భారత్, శక్తిమంతమైన భారత్, యువ భారత్, క్రీడా భారత్’ నిర్మాణానికి యువత సమష్టిగా కృషి చేయాలని తన ప్రసంగ ముగింపులో ఆయన పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఎన్. నాగరాజు; రిజిస్ట్రార్ సినీ మంచాల; పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్; అథ్లెట్ జె.జె. శోభ; బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీయాన్షి వలిశెట్టి; యువ కనెక్ట్ సమన్వయకర్త శ్రీజ జాధవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2303712)
సందర్శకుల సూచీ సంఖ్య : : 37