గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టాక్‌హోమ్‌ ‘వరల్డ్ వాటర్ వీక్-2026’లో భారత్‌కు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రాతినిధ్యం


సామాజిక భాగస్వామ్యంతో చేపట్టిన జల భద్రత.. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను అంతర్జాతీయ వేదికపై విశదం చేసిన భారత్

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 6:12PM by PIB Hyderabad

   మాజ సారథ్యం, భాగస్వామ్యంతో గ్రామీణాభివృద్ధి, సాంకేతికతాధారిత పాలన, సహజ వనరుల సుస్థిర నిర్వహణ ద్వారా జల భద్రత బలోపేతంపై తన నిబద్ధతను భారత్‌ అంతర్జాతీయ వేదికపై పునరుద్ఘాటించింది. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో నిర్వహిస్తున్న ‘ప్రపంచ జల వారోత్సవం-2026’లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశానికి ప్రాతినిధ్యం వహించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల, సార్వజనీన, సమర్థ  జల నిర్వహణలో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల నుంచి జ్ఞాన సంగ్రహణ దిశగా భారత్‌కు ఈ వారోత్సవం ఓ కీలక వేదికగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా జల నిర్వహణపై చర్చలు సహా సహకారం, ఆవిష్కరణలకు తోడ్పడే ప్రముఖ అంతర్జాతీయ వేదికలలో ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్’ (ఎస్‌ఐడబ్ల్యూఐ) నిర్వహించిన ఈ కార్యక్రమం కూడా ఒకటి. దేశదేశాల ప్రభుత్వాలు, ప్రగతి భాస్వాములు, పరిశోధన సంస్థలు, నిపుణులు ఈ వార్షిక కార్యక్రమంలో ఏకతాటిపైకి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఎదురయ్యే జల సంబంధిత సవాళ్లపై చర్చించి, అనుభవాలు, విజ్ఞానం, పరిష్కారాలను ఈ వేదికపై పరస్పరం పంచుకుంటారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “జాతీయ జల భద్రత కార్యక్రమం: జల దార్శనికత సాకారం కావడంలో ఏది ఉత్తమం?” ఇతివృత్తంగా ఏర్పాటు చేసిన చర్చగోష్ఠిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తరఫున సంయుక్త కార్యదర్శి శ్రీమతి రోహిణి ఆర్.భజిభక్రే పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో జల భద్రత బలోపేతం, దీర్ఘకాలిక జల దార్శనికతను సంస్థాగత-కార్యాచరణ విధానాలుగా మలచడంలో భారత్‌ అనుభవాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. ఈ వారోత్సవాన్ని “డాయిష్ గెసెల్షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్బీట్, “ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్” సంయుక్తంగా నిర్వహించాయి.

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాలను శ్రీమతి భజిభక్రే వివరించారు. దేశ ప్రగతి ప్రస్థానంలో జల భద్రత ఓ కీలక మూలస్తంభంగా మారిందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘వికసిత భారత్‌-2047’ విస్తృత ఆకాంక్షకు అనుగుణంగా ‘జల దార్శనికత@2047’, సమీకృత ప్రణాళిక, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక భాగస్వామ్యంతో పౌరులందరికీ పునరుత్థాన, సమ్మిళిత, సుస్థిర జల భద్రత కల్పన తదితరాలపై భారత్‌ లక్ష్యనిర్దేశం చేసుకుంది. గ్రామీణ శ్రేయస్సు, ప్రజారోగ్యం, మహిళా సాధికారత, వాతావరణ మార్పులను తట్టుకోగల సామర్థ్యం సహా సుస్థిర పురోగమనానికి జల భద్రత కూడా ఒక పునాది.

ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్, జాతీయ జల భద్రత కార్యక్రమం (ఎన్‌ఐడబ్ల్యూఎస్‌), వంటి ప్రతిష్టాత్మక చర్యల సమ్మేళనంతో జాతీయ జల భద్రత వ్యవస్థ పురోగమిస్తున్నదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ వారోత్సవాల్లో వివరించింది. ముఖంగా జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి లభ్యత విస్తృతమైందని పేర్కొంది. మరోవైపు శాస్త్రీయ-డేటా ఆధారిత ప్రణాళికతో జల సంరక్షణ, భూగర్భ జలాల పునఃపూరణ, జల సమీకరణ, ఇతర జల భద్రత సంబంధ సదుపాయాలలో పెట్టుబడులను ‘ఎన్‌ఐడబ్ల్యూఎస్‌’ పటిష్టం చేస్తోంది.

ఈ సదస్సులో ‘ఎన్‌ఐడబ్ల్యూఎస్‌’ను తన కీలక విధానాంశాంగా భారత్‌ విశదీకరించింది. సమితుల వారీగా భూగర్భ జలాల స్థితిగతుల ప్రాతిపదికన జల సంబంధిత కార్యక్రమాలపై వ్యయానికి ఇది ప్రాధాన్యమిస్తుంది. లక్ష్యనిర్దేశిత, పారదర్శక ప్రణాళిక యంత్రాంగాల ద్వారా నీటి కొరత గల ప్రాంతాలకు పెట్టుబడులను మళ్లించడానికి, దీర్ఘకాలిక జల భద్రత ఫలితాల సాధనకు ఇదొక విస్పష్ట చట్రాన్ని సమకూరుస్తుంది.

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో జల భద్రతను వికసిత భారత్-రోజ్‌గార్ గ్యారంటీ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)-2025 (వీబీ-జీ రామ్ జీ చట్టం) కీలక ప్రాథమ్యాలలో ఒకటిగా నిలుపుతున్నదని మంత్రిత్వశాఖ ప్రస్ఫుటం చేసింది. భాగస్వామ్య ప్రణాళికల రూపల్పన- అమలు ద్వారా ఉపాధి సృష్టి సహా జీవనోపాధి పెంపు, సహజ వనరుల నిర్వహణ, శాశ్వత సామాజిక సదుపాయాల సృష్టి మధ్య సమన్వయాన్ని ఈ చట్రం ప్రోత్సహిస్తుంది.

జల భద్రత కోసం సాంకేతికత-సమాచారాధారిత ప్రణాళిక

జల భద్రత ఫలితాల విస్తృతి దిశగా సార్వజనీన డిజిటల్‌ మౌలిక సదుపాయాలతోపాటు  భూగోళ్ల ప్రాదేశిక సాంకేతికతల వినియోగం, సమాచారాధారిత నిర్ణయాల గురించి మంత్రిత్వశాఖ వివరించింది. ఈ మేరకు జీఐఎస్‌, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతలను వాడుకునే ‘యుక్తధార-జియోస్పేషియల్ ప్లానింగ్ ప్లాట్‌ఫామ్’ వంటి ఆధునిక ఉపకరణాలన్నీ గ్రామీణాభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ చర్యల కోసం సాక్ష్యాధారిత ప్రణాళికకు మద్దతిస్తున్నాయి. ‘ఇ-జల్ అప్లికేషన్’, జల వనరులు, వర్షపాతం, భూగర్భ జలాలు, జనాభా సంబంధిత సమాచార ఏకీకరణ ద్వారా పంచాయతీల స్థాయిలో డేటా ఆధారిత జల బడ్జెట్‌ సౌలభ్యం కలుగుతుంది.

‘ఇ-సక్షమ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్’ ద్వారా సామర్థ్య వికాసం, విజ్ఞాన వ్యాప్తిని విస్తృతం చేస్తున్నారు. మరోవైపు అదే సమయంలో, ‘వీబీ-జీ రామ్ జీ’ సాఫ్ట్, సెక్యూర్‌, భూగ్రామ్ వంటి డిజిటల్ డాష్‌బోర్డులు కూడా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ, ఆర్థిక నిర్వహణ-పర్యవేక్షణ, పారదర్శకతకు దోహదం చేస్తున్నాయి. ఈ సాంకేతికత ఆధారిత వ్యవస్థలు వికేంద్రీకృత ప్రణాళికను బలోపేతం చేస్తూ, గ్రామీణ భారతంలో జల భద్రత చర్యల ప్రభావం మెరుగుదలకు తోడ్పడుతున్నాయి.

జల సంబంధ మౌలిక సదుపాయాల ప్రణాళిక-అమలు-నిర్వహణ-పర్యవేక్షణలో పంచాయతీలు, గ్రామ జల-పారిశుధ్య కమిటీలు, స్థానిక సంఘాలకు సాధికారత కల్పన  ప్రాముఖ్యాన్ని కూడా మంత్రిత్వశాఖ ఈ వారోత్సవాల్లో స్పష్టం చేసింది. గ్రామీణ జల నిర్వహణ పెట్టుబడులలో పారదర్శకత, సుస్థిరత సాధన సహా దీర్ఘకాలిక ప్రభావానికి భరోసాలో సామాజిక భాగస్వామ్యం, జవాబుదారీ యంత్రాంగాలు, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు కీలక పునాదులుగా మారాయి.

ఈ వారోత్సవంలో భాగంగా 25వ తేదీన “ఐక్యరాజ్యసమితి 2026 జల సదస్సులోగా జల పునరుత్థానం-శ్రేయస్సుకు నిధుల సమీకరణ: హామీల అమలు-సుస్థిర ప్రభావం వైపు మలుపు” ఇతివృత్తంగా నిర్వహించిన ఉన్నత స్థాయి చర్చా గోష్ఠిలో కూడా శ్రీమతి భజిభక్రే పాల్గొన్నారు. జల పునరుత్థానంలో పెట్టుబడుల బలోపేతం, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు తగిన విధానాలపై చర్చించడం కోసం మంత్రులు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, వాతావరణ ఆర్థిక సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు ఈ సందర్భంగా ఒకే వేదికపైకి వచ్చారు.

జల భద్రతలో పెట్టుబడులు అటు పౌరులకు, ఇటు సమాజాలకు సుస్థిర ఫలితాలుగా రూపొందే విధంగా శ్రద్ధ వహించడంలో బలమైన రాజకీయ నిబద్ధత, సహకారాత్మక సమాఖ్యవాదం, పటిష్ట సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు, సమాజ-కేంద్రక ప్రణాళికల ప్రాధాన్యాన్ని భారత్‌ ప్రముఖంగా ప్రస్తావించింది.

ప్రపంచ జల వారోత్సవం-2026లో పాల్గొనడం ద్వారా గ్రామీణాభివృద్ధి, జీవనోపాధి, వాతావరణ మార్పులను తట్టుకోగల సామర్థ్యం, సహజ వనరుల సుస్థిర నిర్వహణలో జల భద్రతను అంతర్భాగం చేయడంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిరంతర నిబద్ధతను భారత్‌ చాటిచెప్పింది. స్థానిక ప్రణాళిక, సాంకేతికతాధారిత పాలన, సమాజ సారథ్యంలో చర్యల ద్వారా జల భద్రత బలోపేతంపై అంతర్జాతీయ చర్చకూ ఈ భాగస్వామ్యం దోహదపడింది.

ప్రపంచ జల వారోత్సవాల నేపథ్యం

అంతర్జాతీయ జల భద్రతపై చర్చలు, సహకారం, ఆవిష్కరణల దిశగా స్టాక్‌హోమ్ అంతర్జాతీయ జల సంస్థ ఏటా నిర్వహించే ఈ వారోత్సవం ఒక ప్రసిద్ధ వేదిక. ప్రపంచ జల సమస్యలను పరిష్కరించగల విజ్ఞానం, భాగస్వామ్యాలు, పరిష్కారాల దిశగా ముందడుగుకు ఇది దోహదం చేస్తుంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, ప్రగతి భాగస్వాములు, పరిశోధకులు, నిపుణులు, ఇతర వాటాదారులను ఒకేతాటిపైకి తెస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2303318) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English