వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డులో రైతు ముఖాముఖి, మార్కెట్ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ తెలంగాణ గవర్నర్


ప్రకృతి వ్యవసాయం మరియు ఎగుమతి నాణ్యత గల విలువ ఆధారిత పసుపును ప్రోత్సహించడానికి 'సున్హరీ మిట్టీ అభియాన్' (బంగారు నేల ప్రచారం) ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 5:29PM by PIB Hyderabad

నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు (NTB) ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన భారీ 'రైతు ముఖాముఖి మరియు మార్కెట్ అనుసంధాన కార్యక్రమాన్ని' గౌరవ తెలంగాణ గవర్నర్ ప్రారంభించారు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ పసుపు బోర్డు నిర్వహించిన ఈ కార్యక్రమం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం మరియు అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ పసుపు స్థానాన్ని పదిలం చేయడం లక్ష్యంగా చేపట్టిన 'సున్హరీ మిట్టీ అభియాన్' లాంఛనప్రాయ ప్రారంభోత్సవంతో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

 

ప్రారంభోపన్యాసం చేస్తూ, నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు తెలంగాణ రైతుల చిరకాల కలను సాకారం చేసిన ఒక చారిత్రక ఘట్టమని గౌరవ గవర్నర్ కొనియాడారు. పసుపు బోర్డును సాకారం చేయడంలో పార్లమెంటు సభ్యులు (నిజామాబాద్) శ్రీ అరవింద్ ధర్మపురి చేసిన నిరంతర కృషిని ఆయన అభినందించారు. పసుపు కేవలం వ్యవసాయ పంట మాత్రమే కాదని, భారతదేశ సాంస్కృతిక మరియు ఆయుర్వేద వారసత్వానికి ('హరిద్ర మేహ నాశిని') ప్రతీక అని గవర్నర్ ఉద్ఘాటించారు. రైతాంగం 'సున్హరీ మిట్టీ అభియాన్' కింద ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని, కోతానంతర విలువ జోడింపును చేపట్టాలని మరియు ఆసియా, యూరప్, USA అంతటా ప్రీమియం ప్రపంచ మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అవశేష రహిత (residue-free) పసుపును ఉత్పత్తి చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన శ్రీ అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల రంగంలో పటిష్టమైన బ్యాక్ వర్డ్ ఇంటిగ్రేషన్ (వెనుకకు అనుసంధానం) అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ఎగుమతిదారులు మరియు వాణిజ్య ప్రాసెసర్‌లు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలతో (FPOలతో) నేరుగా కొనుగోలు భాగస్వామ్యాలు మరియు సంస్థాగత ఒప్పందాలను ఏర్పరచుకోవాలని, తద్వారా మధ్యవర్తులను తొలగించి రైతుల ఆదాయాన్ని పెంచాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, శ్రీ పైడి రాకేష్ రెడ్డిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. దాన కిషోర్ (ఐఏఎస్), జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా (ఐఏఎస్), పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య (ఐపీఎస్) చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పసుపు ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (FPCలు), వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు తెలంగాణ ప్రాంతం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పసుపు రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, ఒడిశా వంటి ప్రముఖ పసుపు పండించే రాష్ట్రాల నుండి వివిధ రకాల పసుపు వంగడాలను ప్రదర్శించే ఒక సమగ్ర ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పసుపు నూనె, ఓలియోరెసిన్స్, కర్కుమిన్ ఎక్స్‌ట్రాక్ట్‌లు, కర్కుమిన్ టాబ్లెట్‌లు మరియు పసుపు తేనె వంటి ప్రీమియం విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శన సందర్శక ప్రముఖులను, రైతాంగాన్ని విశేషంగా ఆకర్షించింది.

జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ (ఐఏఎస్) ప్రముఖులకు, ప్రతినిధులకు సాదర స్వాగతం పలికి, సున్హరీ మిట్టీ అభియాన్ ప్రాముఖ్యతను మరియు భారతీయ పసుపు పరిశ్రమ ప్రయోజనం కోసం జాతీయ పసుపు బోర్డు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి కీలక ఉపన్యాసం చేస్తూ నాణ్యత పెంపు శిక్షణ, కోతానంతర మౌలిక సదుపాయాల సబ్సిడీలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాలపై బోర్డు వ్యూహాత్మక మార్గదర్శక ప్రణాళికను వివరించారు. జాతీయ పసుపు బోర్డు డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రత్యూష్ టి.పి. అధికారిక వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2303167) సందర్శకుల సూచీ సంఖ్య : : 32
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English