ప్రధాన మంత్రి కార్యాలయం
ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
21 AUG 2026 9:51PM by PIB Hyderabad
వరల్డ్ లీడర్స్ ఫోరమ్ అనే ఈ ప్రతిష్ఠాత్మక వేదికలో భాగమైన ప్రపంచ వ్యాపార-పారిశ్రామిక రంగ సుప్రసిద్ధ దిగ్గజాలు, విధాన రూపకర్తలు, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులందరికీ నమస్కారం.
మీ అందరి మధ్యకు వచ్చినప్పుడు ఆనందం కలగడం చాలా సహజం. ఈ సంవత్సరం సదస్సు ప్రధానాంశం ఉమ్మడి భవిష్యత్తు. గత కొన్నేళ్లుగా ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఈ అనుభవాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ఇష్టపడినా, ఇష్టపడకపోయినా... ప్రతి దేశ భవిష్యత్తు మరో దేశంతో పరస్పరం ముడిపడి ఉంటుంది. ఒంటరిగా ఏదీ సాధ్యం కాదు. అందుకే ఈ ఉమ్మడి భవిష్యత్తు అనే అంశం ఈ రోజు మరింత ప్రాధాన్యం కలిగి ఉంది. భారత్ ఎల్లప్పుడూ ఈ స్ఫూర్తిని పాటిస్తూనే ఉంది. జీ20కి అధ్యక్షత వహించిన కాలంలో 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే దార్శనికత భారత్‌కు మార్గదర్శక మంత్రంగా ఉంది. ఉమ్మడి భవిష్యత్తు స్ఫూర్తి, దానితో లభించే బాధ్యతా భావం... 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి.
మిత్రులారా,
ప్రపంచంలో ప్రస్తుతం వృద్ధికి సంబంధించి అనేక ఆందోళనలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచం అత్యంత భయానక పరిస్థితులను చూసింది. వనరులను ఆయుధాలుగా వాడుతున్నారు. అపనమ్మకంతో కూడిన వాతావరణం ప్రపంచానికి అనేక కొత్త సవాళ్లను తెస్తోంది. ఇలాంటి సమయాల్లోనూ... ప్రపంచమంతా భారత్‌ను వృద్ధికీ, ఆశకూ ప్రధాన కేంద్రంగా చూస్తోంది. గత 10-12 ఏళ్ల కాలంలో, భారత్ 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చింది. రాబోయే రోజుల గురించి మాట్లాడితే... ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. భారత్ తన అభివృద్ధిని వేగవంతం చేసే చర్యలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది.
మిత్రులారా,
గత వారం, ఆగస్టు 15న, ఎర్రకోట నుంచి నేను తయారీ, సాంకేతికత-ఆవిష్కరణ, ఆహార శుద్ధి, గ్రీన్ – బ్లూ ఎకానమీ వంటి ఏడు శక్తి ప్రవాహాలను గురించి మాట్లాడాను. ఈ ఏడు రంగాలపై భారత్ ప్రస్తుతం అత్యధికంగా దృష్టి సారించిందని నేను చెప్పాను. మన భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి, భారత్ విధాన స్థాయిలో తదుపరి తరం సంస్కరణలను చేపడుతోంది. పరిపాలనలో సంస్కరణలు, జీవన సౌలభ్యం కోసం సంస్కరణలు కొనసాగుతున్నాయి. గతేడాది ఇదే వేదిక ద్వారా మీతో మాట్లాడినప్పుడూ - ఈ సంస్కరణలు మనకు తప్పనిసరి కాదని నేను చెప్పాను. అవి మన నిబద్ధత, అవి మన దృఢ విశ్వాసం.
మిత్రులారా,
2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి... సంస్కరణలు దేశ దిశనూ, దశనూ మార్చేశాయి. దీనికి నేను మీకు ఒక చాలా ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. బహుశా ఇక్కడున్న వారిలో చాలా తక్కువ మందికి పీఎల్‌పీ గురించి తెలిసి ఉంటుంది. పీఎల్‌పీ గురించి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? చేయి పైకెత్తండి. ఇక్కడ ఎంతో మంది మీడియా దిగ్గజాలు కూర్చున్నారు - మీకు పీఎల్‌పీ తెలుసా? అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. పీఎల్‌పీ అంటే ప్రొడక్షన్ లింక్డ్ పనిష్మెంట్. దీని గురించి ఎవరికీ తెలియదు. ఇక మీరు తప్పకుండా విని ఉండే మరో పదం - పీఎల్‌ఐ. ఇది చాలా మందికి తెలిసినదే. పీఎల్‌ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్.
మిత్రులారా,
ఈ రెండు పదాలు దేశంలోని రెండు వేర్వేరు కాలాలను నిర్వచిస్తాయి. ఈ రోజుల్లో వివరణల యుగం నడుస్తోంది, అందుకే నేనూ దీని గురించి మీకు వివరంగా చెబుతాను.
మిత్రులారా,
మన దేశంలో ఒకప్పుడు ఏ కంపెనీ అయినా నిర్ణీత పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే, దానికి శిక్ష విధించేవారని వింటే నేటి యువతరం దిగ్భ్రాంతికి గురవుతారు. ఇదే గత లైసెన్స్ రాజ్ ప్రభుత్వాల ఉత్పత్తి ఆధారిత శిక్షా విధానం (పీఎల్‌పీ). అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక ఫ్యాక్టరీ ఎక్కువ ఉత్పత్తి చేస్తే, దానికి నోటీసు పంపిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో ఒత్తిడికి గురైన ఆ కంపెనీ, తన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మడానికి బదులుగా స్వయంగా ఆ ఉత్పత్తులను నాశనం చేసేది.
మిత్రులారా,
ఈ రోజు 'మేక్ ఇన్ ఇండియా', 'స్వయం-సమృద్ధ భారత్' ఉద్యమాలను ఎగతాళి చేసేవారి పూర్వీకుల ఆలోచనా విధానం సరిగ్గా ఇదే - ఉత్పత్తి ఆధారిత శిక్ష (పీఎల్‌పీ). అటువంటి చర్యల వెనక ఒక ప్రత్యేకమైన వక్రీకరించిన మనస్తత్వం ఉండేది. అటువంటి మనస్తత్వం ఉన్నవారు నిత్యావసర వస్తువుల కొరత ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకునేవారు. పౌరులను లేమిలో ఉంచడమే వారి విధానం. ప్రజలు తమ ముందు చేతులు జోడించి, భిక్షాటన చేయాలని వారు కోరుకునేవారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతోంది కదా. ప్రజల చేతులు పట్టుకుని, తామేదో గొప్ప ఉపకారం చేస్తున్నట్లుగా వారు నటించేవారు. ఆ ప్రభుత్వాల పద్ధతి అదే, అందుకే వారు ఉత్పత్తి ఆధారిత శిక్ష నమూనాని అనుసరించారు. మీరు ఊహించగలరు... ఇలా చేయడం ద్వారా వారు ఉపాధి కల్పన అనే ప్రాథమిక సూత్రం గొంతు నొక్కేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - వారి ఆస్థానీయులు... మళ్ళీ చెబుతున్నాను వారి ఆస్థానీయులు... దీనికి వ్యతిరేకంగా ఎన్నడూ గళం విప్పలేదు.
మిత్రులారా,
ప్రతి సంస్కరణ మొదట మీ ఆలోచనా విధానాన్ని, మీ మానసిక విధానాన్ని, మీరు పనిచేసే పరిధిని సంస్కరించడంతోనే ప్రారంభమవుతుంది. గతంలో ఉత్పత్తిని పెంచితే శిక్ష పడేది... ప్రస్తుతం మన ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ప్రస్తుత పీఎల్ఐ పథకం విజయాన్ని ప్రపంచమంతా చూస్తోంది. కేవలం ఈ ఒక్క పథకం వల్ల... నేను అన్ని పథకాల గురించి మాట్లాడటం లేదు... కేవలం ఈ ఒక్క దాని గురించే చెబుతున్నాను... ఈ పథకం ద్వారా సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయల వాస్తవ పెట్టుబడి సాధ్యమైంది. 22 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఉత్పత్తి, అమ్మకాలు జరిగాయి. 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులూ జరిగాయి. 14 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను... ఈ గణాంకాలు కేవలం ఒక పథకానికి సంబంధించినవి మాత్రమే. దీని గురించి ఆలోచించండి... గత లైసెన్స్ రాజ్ ప్రభుత్వాల శిక్షా విధానం నిరుద్యోగాన్ని పెంచితే, ప్రస్తుతం మన ప్రోత్సాహక విధానం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది.
మిత్రులారా,
సత్య ఇప్పుడే చెప్పినట్లుగా... భారత్‌లో రాజకీయ సుస్థిరత, నిరంతరాయంగా కొనసాగుతున్న మన విధానాల వల్లే ఈనాడు దేశంలో ఈ వేగవంతమైన అభివృద్ధి, వేగవంతమైన సంస్కరణలు కొనసాగుతున్నాయి. గతంలో, దేశంలో సంస్కరణల గురించి మాట్లాడిన వారు ప్రకటనలు మాత్రమే చేసేవారు. తర్వాత వాటిని మర్చిపోయేవారు. మేం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాం. పరిపాలన స్థాయిలో సంస్కరణలు తీసుకురావడమే ఈ రోడ్‌మ్యాప్ ప్రధాన లక్ష్యం! నేటి 21వ శతాబ్దపు భారత్‌లో, మేం కేవలం నిబంధనలను మార్చడం లేదు... నియంత్రణ తత్వాన్నే పూర్తిగా మారుస్తున్నాం. గతంలో నిబంధనల పట్ల వైఖరి ఇలా ఉండేది... “అనుమతి పొందే వరకూ పని నిషేధం.” అంటే, ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు మీరు ఆ పనిని చేయలేరు. “నిషేధిస్తే తప్ప అనుమతి కొనసాగుతూ ఉంటుంది”గా మేం ఈ వైఖరిని మారుస్తున్నాం. అంటే, చట్టం స్పష్టంగా నిషేధించని పని కోసం ప్రతి దశలోనూ అనుమతి అవసరం తప్పనిసరి కాదు. ఈ ఆలోచన వెనక చాలా సరళమైన విషయం ఉంది. ప్రభుత్వం-పౌరుల మధ్య సంబంధానికి ఆధారం నమ్మకం అయి ఉండాలి, అనుమానం కాదు.
మిత్రులారా,
ఈ ఆలోచనా విధానం జన్ విశ్వాస్ బిల్లులోనూ కనిపిస్తుంది. ప్రతి విధానపరమైన పొరపాటునూ నేరంగా పరిగణించడం సరికాదని నా నమ్మకం. అందుకే గతంలో నేరాలుగా పరిగణించిన అనేక అంశాలను నేరరహితం చేశాం. చాలా సందర్భాల్లో, వాటికి విధించే శిక్షనూ జైలు శిక్షకు బదులుగా కేవలం ఆర్థిక జరిమానాకు పరిమితం చేశాం. ప్రభుత్వం-సంస్థల మధ్య సంబంధంలోనూ మేం ఇదే సంస్కరణా దృక్పథాన్ని కొనసాగిస్తున్నాం. ఇటీవలి సంవత్సరాల్లో, 40,000కు పైగా నిబంధనలనూ తొలగించాం. 1,500కు పైగా పాత, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. ఈ సంస్కరణలన్నింటినీ కలిపి చూసినప్పుడు, మన పరిశ్రమలు, వ్యాపార సంస్థల భుజాల మీది భారం ఎంతగా తగ్గిపోయిందో మీకు అర్థమవుతుంది.
మిత్రులారా,
మేం ఈ పరిపాలనా సంస్కరణల ప్రక్రియపై నిరంతరం పనిచేస్తున్నాం. ఇటీవలే, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మేం బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లునూ ఆమోదించాం. ప్రతిపక్షం పార్లమెంటులో నిరంతర అంతరాయం కలిగిస్తున్న సమయంలోనూ విజయవంతంగా బిల్లు ఆమోదం పొందింది. దేశ సేవ చేసే పనిని మేం ఆగనివ్వలేదు. 19వ శతాబ్దపు బ్రిటీషు వారి చట్టం స్థానాన్ని ఇప్పుడు ఈ చట్టం భర్తీ చేసింది. ఇప్పుడు బ్యాంకుల డిజిటల్ రికార్డుల ఆమోదయోగ్యతకు చట్టపరమైన గుర్తింపు లభించింది. ఇది చట్టపరమైన చిక్కులను తగ్గిస్తుంది. వ్యవస్థలో పారదర్శకతను తీసుకువస్తుంది. వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్నీ మెరుగుపరుస్తుంది.
మిత్రులారా,
పాలనలో సంస్కరణల అర్థం ఏమిటంటే... వ్యవస్థల నిర్మాణం ప్రతి మానవ జీవితం, దాని సమయం పట్ల సున్నితత్వం ఆధారంగా జరగాలి. నేను రైల్వేలకు సంబంధించిన ఒక ఉదాహరణ చెబుతాను. మన రైల్వేలోనూ ఈ విధానంతో పనులు జరిగాయి. ప్రస్తుతం 6,500 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. 10,000కు పైగా లెవెల్ క్రాసింగ్ గేట్లను ఇంటర్‌లాకింగ్‌తో అనుసంధానించారు. దీంతో మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి.
మిత్రులారా,
2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికి, సుమారు 9,000 రైల్వే క్రాసింగ్‌లు ఎలాంటి కాపలా లేకుండా ఉండేవి. వాటిని తొలగించడం అంత కష్టమైన పనేమీ కాదు. ఈ కాపలా లేని క్రాసింగ్‌ల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మేం గత పదేళ్లుగా అత్యంత వేగంగా ఈ కాపలా లేని క్రాసింగ్‌లను తొలగించాం. రోడ్డు ఓవర్‌బ్రిడ్జ్‌లు, అండర్‌బ్రిడ్జ్‌ల నిర్మాణ వేగాన్నీ అనేక రెట్లు పెంచాం. దీని ఫలితంగా, 2014కు ముందుతో పోలిస్తే రైలు ప్రమాదాల సంఖ్య తొంభై శాతం వరకు తగ్గింది. పన్నెండేళ్ల కిందటి వరకు సంవత్సరానికి సుమారు 150 రైలు ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు వాటి సంఖ్య 15-20కి తగ్గింది. దీనిని మరింత తగ్గించడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం.
మిత్రులారా,
రైల్వేల్లో పరిశుభ్రత... పరిపాలనా సంస్కరణకు ఒక గొప్ప ఉదాహరణ. ఒకప్పుడు రైల్వే ట్రాక్‌లపై మురికి, మానవ వ్యర్థాలు పెద్ద సమస్యగా ఉండేవి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2014కు ముందు మన రైళ్లలో సుమారు 12,000 బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 2014 తర్వాత, రైళ్లలో 3,60,000కు పైగా బయో టాయిలెట్లను ఏర్పాటు చేశాం. అంటే, గత 12 ఏళ్లలోనే 97 శాతానికి పైగా బయో టాయిలెట్లను ఏర్పాటు చేశామన్నమాట. ఈ మార్పు కేవలం పరిశుభ్రతకు సంబంధించినది మాత్రమే కాదు... ఇది ప్రయాణికుల ఆత్మగౌరవం, పరిశుభ్రత, ఆధునిక భారత్ నిర్మాణం దిశగా సాగే ఒక నూతన పరిపాలనా నమూనా. ఇది కోట్లాది మంది ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించడం గురించిన ప్రచారమూ అవుతుంది.
మిత్రులారా,
పరిపాలన నాణ్యతకు మరో కొలమానం సమయం. ప్రారంభమైన ప్రాజెక్టులు సమయానికి పూర్తి కావాలి. ప్రజలకు అందే సేవల్లోనూ సమయపాలన పాటించాలి. ఢిల్లీ-మీరట్ నమో భారత్ రాపిడ్ రైల్ సిస్టమ్ దీనికి ఒక చక్కటి ఉదాహరణ. ఈ కారిడార్‌లో రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. మన దేశంలో ఇది మునుపెన్నడూ ఊహించనిది. ఇప్పటివరకు ఇందులో 4 కోట్ల మందికి పైగా ప్రయాణించారు. ఇంకా చర్చించని మరో ముఖ్యమైన అంశం ఉంది. ఢిల్లీ-మీరట్ నమో భారత్ రాపిడ్ రైల్ సమయపాలన 99.9 శాతం. గతంలో, ఆలస్యమైన ప్రతిదానికీ "ఇది భారతీయుల సమయపాలన" అని అనేవాళ్ళం. ఇప్పుడు కాలం మారింది. ఈ పని ఎంత విస్తృతమైనదో, ఎంత పెద్దదో మనం గ్రహించాలనే ఉద్దేశ్యంతో నేను ఈ చిన్న విషయాలను ప్రస్తావిస్తున్నాను. అదేవిధంగా, ఢిల్లీ మెట్రో సమయపాలన... ఢిల్లీ మెట్రో సమయపాలన 99.9 శాతం. ఈ సమయపాలన న్యూయార్క్, హాంగ్‌కాంగ్, పారిస్ వంటి నగరాల మెట్రోలకు దాదాపు సమానంగా మారింది. ఇది కేవలం మెట్రో, రాపిడ్ రైలు సమయానికి నడవడం గురించిన కథ మాత్రమే కాదు. ఇది కాలంతో పాటు మారుతున్న భారత అస్తిత్వం. నేను కేవలం ఇంతటితో సంతృప్తి చెందే వ్యక్తిని కాదు. ఈ దిశలో మనం ఇంకా చాలా చేయాల్సి ఉందనీ, ఇంకా ఎంతో మిగిలి ఉందని నాకు తెలుసు. మేం దానిని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. ఒక ఆరంభం జరిగింది... ఈ ఆరంభం అద్భుతంగా జరిగింది.
మిత్రులారా,
మా సంస్కరణల రోడ్‌మ్యాప్‌లోని మరో ప్రధాన కోణం విధానపరమైన సంస్కరణలు! ఈ రోజు మేం ప్రజలకు, వృద్ధికి, అభివృద్ధికి అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నాం! విధానాలు దేశం, దాని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అంతేగానీ విధానాలను రూపొందించి, వాటి ప్రకారం దేశాన్ని నడపమని బలవంతం చేయకూడదు! నేను మీకు మరో ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల కిందటి వరకు, దేశ పటాన్ని గీయడం కూడా చట్టవిరుద్ధం. మీరు పటం గీస్తే, అది చట్టవిరుద్ధం. మీరు జైలుకు వెళ్ళవలసి వచ్చేది. అనుమతి లేకుండా మీరు దేశంలో మ్యాపింగ్ పని కూడా చేయలేరు. దీని గురించి ఆలోచించండి - విదేశీ ఉపగ్రహ సాంకేతికత మన దేశంలోని ఏ మూలనైనా మ్యాప్ చేయగలదు. భారత్‌లో మాత్రం, భారతీయులు మన దేశ పటాన్ని గీయకుండా నిషేధం అమలు చేశారు.
మిత్రులారా,
ప్రస్తుత సాంకేతిక యుగంలో, కేవలం ఈ ఒక్క ఆంక్ష ఎన్నో అంకురసంస్థలను నాశనం చేసి ఉండేది! ఎన్నో ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా ఆగిపోయి ఉండేవి! మేం ఈ వ్యవస్థనూ మార్చాం. భౌగోళిక ప్రాదేశిక సమాచార సంబంధిత నియంత్రణలను తొలగించాం. ఈ సమాచరమే ప్రస్తుతం ఎన్నో అంకురసంస్థలకు పునాదిగా మారింది.
మిత్రులారా,
డ్రోన్‌ల వినియోగం నిరంతరం పెరుగుతూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. వ్యవసాయంలో, రక్షణ రంగంలో, డెలివరీలో, షూటింగ్‌లో, కంటెంట్ క్రియేషన్‌లో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వీటికి సంబంధించి గతంలో అమలులో ఉన్న నిబంధనల్లో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టకపోయి ఉంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. గతంలో, మన దేశంలో డ్రోన్ ఎగరవేయడం పూర్తిగా నిబంధనలు, ఆంక్షలకు లోబడి ఉండేది. మేం దానిని ఆ ఆంక్షల నుంచి విముక్తి చేశాం. ప్రస్తుతం భారత డ్రోన్ పరిశ్రమ అపూర్వ వేగంతో పురోగమిస్తోంది.
మిత్రులారా,
గతంలో, సరిహద్దు ప్రాంతాల విషయంలో ప్రభుత్వాల ఆలోచనా విధానం ఎలా ఉండేదంటే... సరిహద్దులో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగితే, దాని వల్ల శత్రువులూ ప్రయోజనం పొందవచ్చని వారు భావించేవారు. మేం ఈ ఆలోచనను మార్చాం. సరిహద్దు మౌలిక సదుపాయాలు బలహీనత కాదు... అవి దేశానికి బలం అని మేం నిరూపించాం. అందుకే ఈ రోజు సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, సొరంగాల నెట్‌వర్క్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కేవలం 2024, 2025 సంవత్సరాల్లోనే... బీఆర్‌వోకు చెందిన 250 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేసి దేశానికి అంకితం చేశాం. ఆలోచనా విధానంలో మార్పుతో, సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాల స్వరూపమూ మారింది.
మిత్రులారా,
అణు సంస్కరణలకు సంబంధించిన ఉదాహరణా ఉంది. అభివృద్ధి పూర్తిగా ఇంధనంపై ఆధారపడి ఉన్న సమయంలో... ఆంక్షలు, నిషేధాల కారణంగా దేశం తన అణు సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ‘శాంతి’ బిల్లు ద్వారా మేం ఇందులోనూ కీలక సంస్కరణలు చేపట్టాం. నేడు దేశ అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. అదేవిధంగా, మేం రక్షణ రంగంలోనూ ఒక పెద్ద విధానపరమైన సంస్కరణను చేపట్టాం. 40కి పైగా ఆయుధ కర్మాగారాలను 7 కర్మాగారాలుగా విలీనం చేయడం ద్వారా 200 సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవస్థనూ మేం మార్చాం. దాని ఫలితాలను మనమంతా చూస్తున్నాం. నేడు భారత్ తన రక్షణ అవసరాల విషయంలోనూ స్వయం-సమృద్ధి సాధిస్తోంది. 2014తో పోలిస్తే, మన రక్షణ ఎగుమతులు 55 రెట్లు పెరిగాయి. అందుకే, చాలాసార్లు సంస్కరణలు మన జీవితాల్లో మనం గమనించనంతగా కలిసిపోతాయి. ప్రస్తుతం మీ రోజువారీ జీవితం ఎలా గడుస్తుందో ఆలోచించండి. మీరు ఉదయం నిద్రలేస్తారు. మీ ఫోన్‌లో ఇంటికి అవసరమైన సరుకులను ఆర్డర్ చేస్తారు. మీరు ఆఫీసుకు సిద్ధమయ్యేలోపే, ఆ సరుకులన్నీ మీ ఇంటికి చేరుకుంటాయి. మీ వీధిలోని వ్యాపారి నుంచి మీ కారు షోరూం వరకూ, మీ చెల్లింపులన్నీ కేవలం ఒక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జరిగిపోతాయి. మీ కుమార్తె వేరే నగరంలో చదువుతుంటే, మీరు ఆమెకు ఫోన్ ద్వారా డబ్బు పంపవచ్చు. ఆ డబ్బు క్షణాల్లో ఆమెకు చేరుతుంది. చాలాసార్లు కుమార్తె కూడా, “నాన్నా, అమ్మా... నేను ఈ డ్రెస్ కొన్నాను, దయచేసి డబ్బు చెల్లించండి” అని చెబుతూ ఒక క్యూఆర్ కోడ్‌ను మీకు పంపిస్తుంది. మీరు ఇంట్లోనే కూర్చొని ఆమె షాపింగ్‌ను పూర్తి చేస్తారు. ఈ విషయాలు అద్భుతమైనవి. ఇప్పుడు అవి దేశ ప్రజలను ఆశ్చర్యపరచలేవు. బయటివారు వచ్చినప్పుడు, “ఓహో, ఇలా కూడా జరుగుతుందా” అని ఆశ్చర్యపోతారు. భారత ప్రజలకు ఇది ఒక దినచర్యగా మారిపోయింది. ఇది దేశంలోని సాధారణ పౌరుల జీవితంలో ఒక భాగమైపోయింది. ఆలోచించండి - 2014కు ముందు... ఇలాంటివి ఎన్ని సాధ్యమయ్యేవి?
మిత్రులారా,
గత 10-12 సంవత్సరాల్లో, జీవన సౌలభ్యానికి సంబంధించి భారత్ చేపట్టిన సంస్కరణలు ప్రజల జీవితాలను... ముఖ్యంగా మన మధ్యతరగతి ప్రజల జీవితాలను... ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయిన రీతిలో మార్చివేశాయి.
మిత్రులారా,
ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత చవకగా డేటా భారత్‌లో అందుబాటులో ఉంది. చవకగా, నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లను మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడే సత్య దీని గురించి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ విస్తరణను చేపడుతున్న దేశాల్లో భారత్ ఒకటి. మేం ఆధార్‌ను బ్యాంకింగ్, మొబైల్ కనెక్టివిటీ, సేవలతో అనుసంధానించాం. తద్వారా ఇ-కేవైసీ, డిజిటల్ ప్రామాణీకరణ వంటి సేవలనూ సాధ్యం చేశాం. ఈ రోజు మీరు బ్యాంకు ఖాతా తెరవాలనుకుంటే, బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం బ్యాంకును మీ వద్దకే తీసుకువచ్చింది. ఈ రోజు ఏ బిల్లు చెల్లించడానికైనా, టిక్కెట్ బుక్ చేసుకోవడానికైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతాయి. ఆదాయపు పన్ను దాఖలు చేయడం సులభమైంది. ఫారంలో గరిష్ట సమాచారం ముందే నింపి ఉండే వ్యవస్థను రూపొందించాం. మీరు ఈ సమాచారాన్ని సరిచూసుకుని, మీకు అవసరమైనవి జోడించి, సమర్పిస్తే చాలు... మీ పని పూర్తయినట్లే. గతంలో రీఫండ్‌లు రావడానికి నెలలు పట్టేవి... ఇప్పుడు అవి కేవలం కొన్ని రోజుల్లోనే జమ అవుతున్నాయి.
మిత్రులారా,
ఈ రోజు ఇ-సంజీవని సహాయంతో... బహుశా ఇప్పటికీ దీని గురించి చాలా తక్కువ చర్చజరిగి ఉండవచ్చు. ఈ ఇ-సంజీవని సహాయంతో సుదూర గ్రామాల ప్రజలు ఎక్కడి నుంచైనా నేరుగా వైద్యులను సంప్రదించి, చికిత్స సంబంధిత సూచనలు పొందవచ్చు. గతంలో ఆసుపత్రికి చేరుకోవడానికి చాలా కిలోమీటర్లు ప్రయాణించాల్సిన వారికి వారి ఇంట్లో, వారి స్క్రీన్‌పైనే వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఈ సంఖ్య కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భారత్ సాంకేతికతను ఎలా స్వీకరించిందో, సాధారణ వ్యక్తి జీవితాన్ని ఎలా సులభతరం చేసిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తాయి. ఇప్పటివరకు, ఇ-సంజీవని కింద, దాదాపు 500 మిలియన్ల టెలీ-సంప్రదింపులు జరిగాయి.
మిత్రులారా,
దేశంలో ప్రయాణ అనుభవం మెరుగవుతోంది. భారత పౌరుల ప్రయాణాలు పూర్తిగా మారిపోయాయి. విమానాశ్రయంలో డిజియాత్రను ఉపయోగించని వ్యక్తిని ఈ హాలులో కనుగొనడం కష్టం. అదేవిధంగా, ఈ రోజుల్లో చాలా పనులు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. హైవేలపై ఫాస్ట్‌ట్యాగ్‌లు నడుస్తున్నాయి. తద్వారా మీరు ఆగకుండా టోల్ చెల్లించి ముందుకు సాగవచ్చు. ఇదే జీవన సౌలభ్యానికి నిజమైన అర్థం. సమయం ఆదా అవుతోంది. జీవితం సులభతరం అవుతోంది. కోట్లాది మంది ప్రజలు తమ పురోగతిపై దృష్టి పెట్టగలుగుతున్నారు.
మిత్రులారా,
ఏ నిర్ణయాల ప్రభావం అయితే ఈ రోజే కనిపిస్తుందో... అంటే వాటి ప్రభావం 24 గంటలే నిలిచి ఉంటుందో... అవే రాజకీయాల్లో తరచుగా ముఖ్యాంశాలుగా మారతాయి. గతంలో ప్రభుత్వాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటనలు చేసే పద్ధతిని అనుసరించాయి. అలాంటి ప్రకటనలేవీ దేశాన్ని మార్చలేదు. వర్తమానాన్నీ, భవిష్యత్తునూ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. అవే దేశాన్ని మార్చేస్తాయి.
మిత్రులారా,
పీఎం కుసుమ్ పథకం, పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం దీనికి చాలా ప్రత్యేకమైన ఉదాహరణలు. కుసుమ్ పథకం ద్వారా రైతులు విద్యుత్ చింత నుంచి విముక్తి పొందారు. సూర్యఘర్ పథకం ద్వారా మధ్యతరగతి ప్రజలు ఎంతగానో లబ్ధి పొందారు.
మిత్రులారా,
ఈ రోజు నుంచి లక్షలాది కుటుంబాలకు విద్యుత్ ఉచితం అని నేను ప్రకటించి ఉంటే... అన్ని మీడియా సంస్థలు, అన్ని తెరలు, అన్ని వార్తాపత్రికలు "మోదీజీ ఈ రోజు ఉచిత విద్యుత్ ప్రకటించారు" అని పెద్ద శీర్షికలతో ప్రచురించి ఉండేవని నాకు తెలుసు. కానీ మేం ఒక విభిన్నమైన విధానంతో ఈ పనిని ప్రారంభించాం. ప్రతి ఇంటి పైకప్పుపై ఒక సూర్యుడిని వెలిగించాలని మేం సంకల్పించుకున్నాం. ఈ రోజు దేశంలో 50 లక్షలకు పైగా కుటుంబాలు పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకంతో అనుసంధానమయ్యాయి. సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం వారి పైకప్పులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు వీలుగా, ఈ కుటుంబాలకు ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చింది. ఇప్పుడు ఈ కుటుంబాలు అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు అమ్మి డబ్బు సంపాదిస్తున్నాయి. వారి కరెంటు బిల్లు సున్నా అయిపోయింది. పైగా దీని ద్వారా వారు ఆదాయం సంపాదించుకోవడం ప్రారంభించారు. ఈ పథకం ప్రజల కలలనూ విస్తరింపజేస్తోంది. విద్యుత్ బిల్లులు లేకపోవడంతో... ప్రజలు ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీల వంటి వస్తువులను కొని వాడుకుంటున్నారు. ఇప్పుడు కరెంట్ కోతల వల్ల పాలు పాడైపోతాయనే భయం లేదు... ఎలాంటి చింతా లేదు. ఇప్పుడు బడికి వెళ్లే పిల్లలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలరు. నేను మళ్ళీ చెబుతున్నాను... ఎన్నికలు జరిగినా, జరగకపోయినా... ఈ సూర్యఘర్, దాని వెలుగులూ ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనం రాబోయే సంవత్సరాల్లో దేశంలోని కుటుంబాలకు చేరుతూనే ఉంటుంది.
మిత్రులారా,
రాబోయే కాలంలో జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం మరింతగా విస్తరిస్తాయి. దేశ యువత కోసం, మహిళా శక్తి కోసం, రైతుల కోసం, పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. మా సంస్కరణల రథం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, మేం పూర్తి నిబద్ధతతో పని చేస్తూనే ఉంటాం. భారత భవిష్యత్తు సురక్షితమైతే, ప్రపంచ భవిష్యత్తుకూ స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఈ గడ్డ నుంచే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఈ విశ్వాసంతో... భారత్ ఎంత స్థిరంగా ఉంటే, భారత భవిష్యత్తు అంత సురక్షితంగా ఉంటుంది. ప్రపంచానికి భద్రతా భావాన్ని కలిగించే శక్తి ఇక్కడి నుంచే ఉద్భవిస్తుంది. ఈ సామర్థ్యంతో... ఈ సంకల్పంతో... నేటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎకనామిక్ టైమ్స్ బృందానికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందేమాతరం!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
(रिलीज़ आईडी: 2302311)
आगंतुक पटल : 4