జాతీయ మానవ హక్కుల కమిషన్
ఎన్‌హెచ్ఆర్‌సీ ఆగస్టు నెల ఆన్‌లైన్ స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ముగింపు
సమాజ శ్రేయస్సు కోసం విజ్ఞానం, నైపుణ్యాలను వినియోగించాలని ఇంటర్న్‌లకు సూచించిన ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలు శ్రీమతి విజయ భారతి సయాని
2,036 మంది దరఖాస్తుదారుల్లో ఎంపికైన వివిధ విద్యా విభాగాలకు చెందిన 96మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు శిక్షణ
प्रविष्टि तिथि:
14 AUG 2026 6:00PM by PIB Hyderabad
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు వారాల ఆన్‌లైన్ స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ కార్యక్రమం (ఓఎస్‌టీఐ) నేడు ముగిసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్న 2,036 మందిలో ఎంపికైన 96 మంది విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమం 2026 ఆగస్టు 3న ప్రారంభమైంది.
ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలు శ్రీమతి విజయ భారతి సయాని ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను అభినందించారు. భారతీయ సామాజిక, సాంస్కృతిక జీవన విధానంలో అంతర్భాగమైన సేవ ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు. సేవ అంటే కేవలం దాతృత్వం కాదని, సమాజ సమష్టి శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేయడమని ఆమె పేర్కొన్నారు. మానవ హక్కులు అంటే ప్రజలకు సంబంధించినవేనన్న విషయాన్ని ఇంటర్న్‌లు గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ఫైలు వెనుక, ప్రతి మానవ హక్కుల ఉల్లంఘన ఘటన వెనుక వినాల్సిన, అర్థం చేసుకోవాల్సిన మానవీయ గాథలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఇంటర్న్‌లకు పిలుపునిస్తూ, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ తమ విజ్ఞానం, నైపుణ్యాలను సమాజం సమష్టి శ్రేయస్సు కోసమే వినియోగించాలని ఆమె సూచించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను పాటించడం ప్రతి తరానికి ఉన్న బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. భగవద్గీతను, స్వామి వివేకానంద, డాక్టర్ ఏ.పి.జే. అబ్దుల్ కలాం బోధనలను ప్రస్తావిస్తూ, ఇంటర్న్‌లు తమ విజ్ఞానాన్ని ఇతరులకు విద్యను అందించేందుకు, వారికి అవకాశాలను కల్పించేందుకు వినియోగించాలని ఆమె పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి, మెరుగైన మౌలిక వసతులు మాత్రమే కాదని, మానవ గౌరవం, న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధిని పరిరక్షించడం కూడా అభివృద్ధిలో భాగమేనని ఆమె పేర్కొన్నారు.
అంతకుముందు, ఎన్‌హెచ్ఆర్‌సీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి సైదింగ్‌పుయి ఛక్చువాక్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహణపై సమగ్ర వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్న్‌లకు ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు, సీనియర్ అధికారులు, ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, కోర్ గ్రూప్ సభ్యులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో సంభాషించే అవకాశం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ఇంటర్న్‌లకు మానవ హక్కులపై అవగాహనను మరింత పెంపొందించిందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. పుస్తక సమీక్ష, గ్రూప్ పరిశోధనా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్, ఉపన్యాసం తదితర పోటీల విజేతలను కూడా ఆమె ప్రకటించారు. ఎన్‌హెహెచ్ఆర్‌సీ జాయింట్ సెక్రటరీ శ్రీ సమీర్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ శ్రీమతి వినీతా ఒట్టపురక్కల్ కల్లాడతో పాటు పలువురు సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2299643)
आगंतुक पटल : 8