సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అవయవదానం కొత్త జీవితాన్ని ప్రసాదించే గొప్ప కార్యం: డాక్టర్ శ్రీ భూషణ్ రాజు
ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా ‘వార్త’ - మీడియా కార్యశాలను నిర్వహించిన పీఐబీ హైదరాబాద్
प्रविष्टि तिथि:
13 AUG 2026 6:50PM by PIB Hyderabad
ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్ కవాడిగూడలోని సిజీవో టవర్స్ వేదికగా 'అవయవ దానం: అపోహలు - వాస్తవాలు' అంశంపై 'వార్త' పేరుతో మీడియా కార్యశాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహించింది. నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్, అధిపతి... ఎస్‌వోటీటీవో (జీవన్‌దాన్) విభాగ అధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పీఐబీ, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ (ఐఐఎస్) ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ "దేశంలో అవయవ మార్పిడికి ఉన్న డిమాండ్, దాతల ద్వారా అందుబాటులో ఉన్న అవయవాల మధ్య గణనీయ వ్యత్యాసం ఉంది. అవయవ దానాన్ని, మార్పిడి ప్రక్రియలను సమన్వయం చేయడంలోనూ, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలోనూ ఎన్‌వోటీటీవో, ఎస్‌వోటీటీవోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 'వార్త' వంటి మీడియా కార్యశాలల ద్వారా... అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించడంతో పాటు, ఈ అపోహలకు-వాస్తవిక వైద్యపరమైన అంశాలకు మధ్య వ్యత్యాసాన్ని వివరించే సమాచారాత్మక సదస్సులను మేం నిర్వహిస్తున్నాం" అన్నారు.

నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెఫ్రాలజీ ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు ప్రసంగిస్తూ... “మరణించిన వ్యక్తి మరొక వ్యక్తికి జీవితాన్ని అందించగల ఒక ఉదాత్తమైన చర్యగా అవయవ దానాన్ని మనమంతా... ఈ ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా గుర్తించాలి. అవయవ మార్పిడిలో వైద్య శాస్త్రం అద్భుతమైన పురోగతి సాధించినప్పటికీ, మానవ అవయవాలను పూర్తిగా తిరిగి సృష్టించడం ఇంకా సాధ్యం కాలేదు. అందుకే దాతలు, వారి కుటుంబాల ఉదారత ఎంతో అమూల్యమైనది” అన్నారు.
అవయవ మార్పిడిలో ఉండే సంక్లిష్టతలను వివరిస్తూ... మార్పిడి చేసిన అవయవాన్ని మానవ రోగనిరోధక వ్యవస్థ సహజంగానే ఒక అన్య పదార్థంగా గుర్తించి, దానిని తిరస్కరించడానికి ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘వైద్య రంగంలో వచ్చిన పురోగతి వల్ల ఈ రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడం, అవయవ మార్పిడి ఫలితాలను మెరుగుపరచడం సాధ్యమైంది. ఈ తిరస్కరణను నివారించడం, గ్రహీతను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడం మధ్య ఒక సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడం ఇప్పటికీ ఒక ముఖ్యమైన సవాలుగానే ఉంది’ అని డాక్టర్ శ్రీ భూషణ్ రాజు తెలిపారు.

"అవయవ మార్పిడి విజయం అంతిమంగా అవయవాల లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. వైద్య శాస్త్రం అధునాతన మార్పిడి విధానాలు, ఔషధాలను అభివృద్ధి చేసినప్పటికీ... అవయవాలను కర్మాగారాల్లో తయారు చేయడం సాధ్యం కాలేదు. అందువల్ల, అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు కొత్త జీవితాన్ని పొందేందుకు అవయవ దానం అత్యంత కీలకం" అని ఆయన తెలిపారు.
ఎన్‌వోటీటీవో, ఎస్‌వోటీటీవోలతో కలిసి మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం (టీహెచ్‌వోటీఏ)... దేశంలో అవయవ దానం, మార్పిడిల నియంత్రణ, బలోపేతం కోసం ఒక ముఖ్యమైన విధాన ప్రణాళికను అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, పారదర్శక అవయవ కేటాయింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సహా దాని పాత్రనూ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు ప్రముఖంగా ప్రస్తావించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించడం, మార్పిడిని సులభతరం చేయడం, అంతిమంగా అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు పునర్జన్మను అందించడం ఈ ప్రయత్నాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

అవయవ దానానికి సుముఖంగా ఉన్నప్పటికీ, వారి కుటుంబ సభ్యుల అవయవాలు వైద్యపరంగా సరిపోలని రోగుల విషయంలో స్వాప్-ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక కీలకమైన ఎంపిక అవుతుందని డాక్టర్ భూషణ్ రాజు స్పష్టం చేశారు. ఇటువంటి సందర్భాల్లో తగిన చట్టపరమైన, వైద్యపరమైన నిబంధనలకు అనుగుణంగా పరస్పరం సరిపోలే దాత-గ్రహీత జంటలను కలపవచ్చని ఆయన వివరించారు. గతంలో అవయవ దానాన్ని ప్రధానంగా వైద్యపరమైన లేదా శాస్త్రీయ అంశంగానే పరిగణించేవారనీ... ఇది క్రమంగా ఆర్థిక, కుటుంబపరమైన అంశాలతో కూడిన సామాజిక అంశంగా మారుతూ, ప్రస్తుతం డిమాండ్-సరఫరాల మధ్య అంతరానికి కారణమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ అంతరాన్ని పూడ్చడానికి, అవయవ దానాన్ని బహిరంగ చర్చల్లోకి తీసుకురావాలన్నారు. మరింత అవగాహనను, సమ్మతిని కల్పించడానికి కుటుంబాలు, సమాజాల మధ్య చర్చలను ప్రోత్సహించాలని డాక్టర్ భూషణ్ రాజు సూచించారు. అపోహలు, తప్పుడు అభిప్రాయాలను తొలగించి, అవయవ దానంపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, విజ్ఞానవంతమైన చర్చలు విస్తృతంగా నిర్వహించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యశాలలో పాల్గొన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అవయవ దానానికి సంబంధించిన వివిధ అంశాలపై సంభాషించారు.
***
(रिलीज़ आईडी: 2299149)
आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English