కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ-ఇన్‌స్పెక్షన్, ఈ-సర్టిఫైడ్ కాపీ సేవలను ప్రారంభించిన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)

प्रविष्टि तिथि: 12 AUG 2026 7:21PM by PIB Hyderabad

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‍టీ) నేడు ఈ-ఇన్‌స్పెక్షన్, ఈ-సర్టిఫైడ్ కాపీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను ఎన్‍‌సీఎల్‌టీ అధ్యక్షులు జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

ట్రిబ్యునల్ రిజిస్ట్రీని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించేందుకు ఇది వీలు కల్పించనుంది. ఈ సందర్భంగా జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.. న్యాయపరమైన రికార్డులు, ధ్రువీకరించిన కాపీలను న్యాయవాదులు, వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు, ఇతర భాగస్వాములు మరింత సౌకర్యవంతంగా, వేగంగా పొందేందుకు ఈ రెండు సేవలు ఉపయోగపడతాయని తెలిపారు. సరికొత్తగా తీర్చిదిద్దిన ఎన్‌సీఎల్‌‍టీ వెబ్‌సైట్, కొనసాగుతున్న ఈ-కోర్ట్స్ 2.0 కార్యక్రమంతో సహా ట్రిబ్యునల్ చేపడుతున్న విస్తృత డిజిటల్ పరివర్తనలో భాగంగా ఈ సేవలను ప్రారంభించారు. 

కేసుల నిర్వహణను మెరుగుపరచడానికి, పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించడానికి తీసుకున్న చర్యలను కూడా ఎన్‌సీఎల్‌టీ అధ్యక్షులు వివరించారు. వివిధ బెంచ్‌లలో పెండింగ్‌ కేసులను పర్యవేక్షించడానికి ఎన్‌సీఎల్‌టీ డేటా-ఆధారిత విధానాన్ని అవలంబించింది. ఆ విధంగా సేకరించిన డేటా ఆధారంగా పనిభారాన్ని సమీక్షించి పునఃపంపిణీ చేయడం, అవసరమైన చోట ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయడం, అందుబాటులో ఉన్న కోర్టు సమయాన్ని గరిష్ఠంగా వినియోగించుకునేలా ప్రయత్నాలు జరిగాయి.

ఈ చర్యల ఫలితంగా 2026 ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 78 రిజల్యూషన్ ప్రణాళికలు ఆమోదం పొందాయి. ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్‌సీ కోడ్) అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొదటి త్రైమాసికంలో అత్యుత్తమ పనితీరు ఇదే కావటం విశేషం. సుమారు రూ. 5,517.66 కోట్ల విలువైన ఆస్తులు ఇందులో ఉన్నాయి.

పరిమిత న్యాయ వనరులను అత్యంత సమర్థంగా వినియోగించుకునేలా బార్‌తో సంప్రదింపులు జరిపి కేసుల నమోదు, లిస్టింగ్‌పై సమగ్ర మార్గదర్శకాలను కూడా ఎన్‌సీఎల్‌టీ జారీ చేసింది.

ఇప్పటికీ మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరతను ట్రిబ్యునల్ ఎదుర్కొంటున్నప్పటికీ అనవసరమైన జాప్యాన్ని తగ్గించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ ప్రముఖంగా చెప్పారు. 

మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన, భాగస్వామ్య-ఆధారిత న్యాయం అందించే వ్యవస్థను రూపొందించటానికి ఎన్‌సీఎల్‌టీ చేస్తోన్న నిరంతర ప్రయత్నాలలో ఈ రెండు సేవలను ప్రారంభించటం కూడా ఒకటి.

 

***


(रिलीज़ आईडी: 2298698) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati