అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: అంతరిక్ష దార్శనికత 2047

प्रविष्टि तिथि: 12 AUG 2026 2:44PM by PIB Hyderabad

2026లో ఇస్రో, అంతరిక్ష విభాగం చేపట్టిన కీలకమైన అంతరిక్ష ఆధారిత కార్యక్రమాలు

 

వ్యవసాయం కోసం: రెండు పంట కాలాలకు  సంబంధించి ఉపగ్రహ ఆధారిత జాతీయ స్థాయి పంట సాగు, కోతల విస్తీర్ణ మ్యాపింగ్. అఖిల భారత స్థాయిలో ఖరీఫ్ వరి, గోధుమ, జనపనార పంటల మ్యాపింగ్. జాతీయ స్థాయిలో వరి, గోధుమ పంటల దిగుబడి అంచనా. మహారాష్ట్ర (సోయాబీన్, పత్తి, వరి) మధ్యప్రదేశ్ (సోయాబీన్, గోధుమ, శనగలు, ఆవాలు, వరి) రాష్ట్రాలకు  రాష్ట్రస్థాయి పంటల మ్యాపింగ్ కోసం సాంకేతిక సహాయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) మద్దతుగా 10 రాష్ట్రాలలో బీమా యూనిట్ స్థాయిలో పంట దిగుబడిని అంచనా వేయడం. వేశంలోని ప్రధాన జనపనార పండించే రాష్ట్రాలైన అస్సాం, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో జనపనార పంటపై ప్రత్యేక నిఘా.

 

విపత్తు నిర్వహణ కోసం: భూ పరిశీలన ఉపగ్రహాల డేటాను ఉపయోగించి వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫానులు, అటవీ అగ్ని ప్రమాదలు, హిమానీనద సరస్సు విస్పోటన వరదలు (జీఎల్ఓఎఫ్‌లు), కరువులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించడం, మ్యాపింగ్ చేయడం. ఈ విధంగా సేకరించిన విపత్తు సమాచార నివేదికలను తక్షణ సహాయక చర్యల కోసం అధికారిక ‘భువన్’, ‘అత్యవసర నిర్వహణ కోసం జాతీయ డేటాబేస్’ (ఎన్‌డీఈఎం) వేదికల్లో  అప్‌లోడ్ చేస్తారు.

 

భారత నౌకాదళ కార్యకలాపాల కోసం కొచ్చిలోని నావల్ ఆపరేషన్స్ డేటా ప్రాసెసింగ్-అనాలిసిస్ సెంటర్ (ఎన్ఓడీపీఏసీ)లో ఉపగ్రహ, సంఖ్యా నమూనా ఆధారిత అత్యాధునిక గాలింపు, సహాయ సాధనాన్ని ఏర్పాటు చేశారు.

 

వాతావరణ పర్యవేక్షణ కోసం: ఈఓఎస్-06 ఉపగ్రహ మిషన్ (ఓషన్ కలర్ మానిటర్-3, స్కాటెరోమీటర్ సెన్సార్ల ద్వారా) సేకరించిన క్లోరోఫిల్-ఎ సాంద్రత, సముద్ర ఉపరితల గాలి ప్రవాహాలు, గాలి ఒత్తిడి, ఉపరితల గాలులు వంటి వాతావరణ పారామితులను, అలాగే ఐఎన్ఎస్ఏటీ-3డీఎస్ నుంచి  పొందిన మేఘాల ఉత్పత్తులను క్రమబద్ధంగా అప్‌డేట్ చేస్తూ వాతావరణ, పర్యావరణ అధ్యయనాల జాతీయ సమాచార వ్యవస్థ (ఎన్ఐసీఈఎస్) వెబ్ పోర్టల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఐఎండీ, ఎంఓఈఎస్ లలో కార్యాచరణ అమలు కోసం ఉపగ్రహ ఆధారిత తీవ్ర వాతావరణాన్ని వెనువెంటనే అంచనా వేసే సాధనాన్ని అభివృద్ధి చేసి మోహరించారు.

 

ఇతర అభివృద్ధి రంగాల కోసం: భూగోళ సమాచార సాంకేతికతను ఉపయోగించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కార్యకలాపాల ప్రణాళిక, పర్యవేక్షణ. వాటర్‌షెడ్ అభివృద్ధి విభాగం-ప్రధానమంత్రి  కృషి సించాయీ యోజన (డబ్ల్యూడీసీ-పీఎంకేఎస్‌వై) పర్యవేక్షణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అందరికీ ఇళ్లు (పట్టణ) పథకం పర్యవేక్షణ.. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్డు వ్యవస్థ స్థితిగతుల పరిశీలన. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) కింద సృష్టించిన మౌలిక వసతులు, ఆస్తుల పర్యవేక్షణ. జాతీయ రహదారుల పొడవునా పచ్చదనం విస్తృతిని పర్యవేక్షించడం, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కు సంబంధించిన భౌగోళిక మ్యాపింగ్, అనుబంధ సేవల పనులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

 

కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో ఉపగ్రహ ఆధారిత సేవల అనుసంధానం ఈ కింది చర్చల ద్వారా మరింత బలోపేతమవుతోంది.

 

కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్వహించే అనేక జాతీయ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో భారతీయ ఉపగ్రహ డేటా, స్వదేశీ అంతరిక్ష వేదికలను విస్తృతంగా అనుసంధానిస్తున్నారు.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిధులతో అమలు చేస్తున్న ఫసల్ 2.0 (అంతరిక్ష, వ్యవసాయ వాతావరణ, భూ-ఆధారిత పరిశీలనల ద్వారా వ్యవసాయ దిగుబడి ముందస్తు అంచనా) ప్రాజెక్టును అమలు చేయడం. పంటల పర్యవేక్షణ, దిగుబడి అంచనా కోసం ఇస్రోకు చెందిన వేదాస్ ( విజువలైజేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా- ఆర్కైవల్ సిస్టమ్) వేదికలో  జియోక్రెస్ట్‌ సేవలను వినియోగిస్తున్నారు.

 

వివిధ ప్రధాన పంటలకు సంబంధించి పంట దిగుబడి అంచనాలను రూపొందించి అందించడం.

 

 

సహజ వనరుల నిర్వహణ, అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ, కొత్త కార్యకలాపాల ప్రణాళికలో సహాయపడటానికి రాష్ట్ర శాఖలకు అవసరమైన సాంకేతిక సూచనలు, భౌగోళిక సమాచార పరిష్కారాలు అందించడం.

 

విపత్తు నిర్వహణ మద్దతు కార్యక్రమం కింద కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు (ఎస్‌డీఎంఏలు), జిల్లా యంత్రాంగాలు, సంబంధిత విభాగాలకు ఎప్పటికప్పుడూ ఉపగ్రహాల ద్వారా భౌగోళిక సమాచార ఉత్పత్తులను అందించడం.

 

వ్యవసాయం, సహజ వనరుల నిర్వహణ, విపత్తుల సన్నద్ధత, స్పందన, నష్టాల అంచనా, పునరుద్ధరణ ప్రణాళికల్లో అంతరిక్ష ఆధారిత సమాచార వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భాగస్వాములకు శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించడం.

 

పంటల మ్యాపింగ్, వాతావరణం–విపత్తు ముప్పుల అంచనా, ఉపగ్రహ డేటా ఆధారిత వాతావరణ అంచనాలు, జల వనరుల పర్యవేక్షణ, మైనింగ్ కార్యకలాపాల మ్యాపింగ్, పర్యవేక్షణ తదితర అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసేందుకు వివిధ కేంద్ర విభాగాలు, మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర విభాగాలతో 15కు పైగా  అవగాహన ఒప్పందాలపై  ఇస్రో, అంతరిక్ష శాఖ సంతకాలు చేసింది.

 

గ్రామ పంచాయతీలతో సహా దేశవ్యాప్తంగా సుపరిపాలనను అందించడానికి, సమాచార మార్పిడి సామర్థ్యాన్ని విస్తరించడానికి భారత్‌నెట్, డిజిటల్ ఇండియా వంటి  ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ కార్యక్రమాలలో శాటిలైట్ కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించి భారత్‌నెట్ పరిధిని విస్తరించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ వ్యత్యాసాన్ని  తొలగించవచ్చు. ఇది పరిపాలన సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. అనుసంధానిత పాలనను ప్రోత్సహిస్తుంది, తద్వారా సాక్ష్యాధారిత నిర్ణయాలకు మద్దతు ఇస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ గృహాలు, కార్పొరేట్ వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు, ప్రభుత్వ వినియోగదారుల కోసం నిరంతర, సురక్షితమైన నెట్‌వర్క్ సేవలు. వ్యూహాత్మక సేవల కోసం విస్తృత అనుసంధానం, డీటీహెచ్ టెలివిజన్, వీశాట్ సేవలు, విమాన ప్రయాణాల్లో,  సముద్ర రవాణాలో ఇంటర్నెట్ సేవలు (ఐఎఫ్ఎంసీ), టెలి-ఎడ్యుకేషన్, టెలి-మెడిసిన్, విపత్తు నిర్వహణ వంటి సామాజిక అనువర్తనాలకు సేవలు అందిస్తుంది.

           

 

పరిశోధనలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల కోసం జియోస్పేషియల్, భూ పరిశీలన డేటా లభ్యతను పెంచడానికి అనేక చర్యలు అమలు చేస్తున్నారు. వాటిలో

 

భారత అంతరిక్ష విధానం-2023 పరిధిలో 5 మీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్ శాంప్లింగ్ డిస్టెన్స్ (జీఎస్‌డీ) కలిగిన భారతీయ భూ పరిశీలన (ఈఓ) డేటాను వినియోగదారులందరికీ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచడం, ఈ ఉచిత డేటా ఆధారంగా రూపొందించిన అన్ని ఉత్పత్తులను  కూడా వినియోగదారులకు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే పంపిణీ చేస్తారు.

 

5 మీటర్ల కంటే తక్కువ జీఎస్‌డీ కలిగిన భూ పరిశీలన డేటాను ప్రభుత్వ వినియోగదారులకు ఉచితంగా, ప్రభుత్వేతర వినియోగదారులకు తగిన ధరకు అందిస్తున్నారు.

 

వెబ్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌లను మెరుగుపరచడం, డేటా నిబంధనలను సరళీకరించడం, కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన వినియోగదారులకు ఎప్పటికప్పుడూ ఉత్పత్తులను అందిస్తున్నారు. వివిధ అవసరాల కోసం అంతరిక్ష ఆధారిత పరిశీలనల సమాచారాన్ని వాతావరణ, సముద్ర శాస్త్ర ఉపగ్రహ డేటా ఆర్కైవల్ సెంటర్ (ఎంఓఎస్‌డీఏసీ),  వేదాస్ వంటి వేదికల ద్వారా ఎప్పటికప్పుడూ అందిస్తున్నారు.

 

వినియోగదారుల క్లౌడ్ ఆధారిత డేటా ప్రాసెసింగ్ అవసరాలకు మద్దతుగా ఆన్-డిమాండ్ ప్రాసెసింగ్ వేదికలను అందిస్తున్నారు.

 

పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు వివిధ రంగాల్లో అంతరిక్ష ఆధారిత పరిశీలనల వినియోగాన్ని ప్రోత్సహించి, వేగవంతం చేసేందుకు ఇస్రో,అంతరిక్ష శాఖ సామర్థ్య నిర్మాణంలో భాగంగా శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది.

 

అంతరిక్ష దార్శనికత 2047 కింద జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా స్వదేశీ అంతరిక్ష సాంకేతికతల వినియోగాన్ని విస్తరించేందుకు రూపొందించిన ప్రణాళికలోని ప్రధాన రంగాలు

 

భూ పరిశీలన అనువర్తనాలు: 2025 ఆగస్టు 22న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో భవిష్యత్తు భూ పరిశీలన అనువర్తనాలు, మౌలిక వసతుల అవసరాలను గుర్తించి ప్రతిపాదించారు. ఈ  మౌలిక సదుపాయాల అవసరాలన్నింటినీ వికసిత్ భారత్ 2047 కోసం అంతరిక్ష సాంకేతికత, అనువర్తనాల వినియోగంపై జాతీయ సమావేశం 2025 ఫలితాల నివేదికలో సమీకరించారు. ఈ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి అవసరమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ఆయా ఇస్రో, అంతరిక్ష శాఖ కేంద్రాలు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలుగా చేపట్టాయి.

 

శాటిలైట్ కమ్యూనికేషన్: డిజిటల్ అనువర్తనాలను మరింత బలోపేతం చేయడానికి ఫ్లెక్సిబుల్ పేలోడ్‌లు, డైరెక్ట్-టు-డివైజ్ (డీ2డీ), 5జీ/6జీ ప్రమాణాలను ఉపయోగించే నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ (ఎన్‌టీఎన్), ఎం2ఎం కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఆధారిత ఎన్‌బీ-ఐఓటీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అవలంబిస్తూ స్వదేశీ అంతరిక్ష పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. బీమ్‌ఫార్మింగ్  సామర్థ్యాలతో, అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో పనిచేసే బహుళ-కక్ష్య అనుకూల బ్రాడ్‌బ్యాండ్ టెర్మినళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. భవిష్యత్తు హెచ్‌టీఎస్  ఫీడర్ లింక్ అవసరాల కోసం ఆప్టికల్, లేజర్ కమ్యూనికేషన్ గ్రౌండ్ స్టేషన్ వ్యవస్థ మౌలిక వసతుల అభివృద్ధి, కార్యాచరణ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకేడీ) వ్యవస్థ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి స్వదేశీ సార్వభౌమత్వంతో కూడిన ఎన్-జీఎస్ఓ  ఉపగ్రహాల సమూహాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

ఉపగ్రహ నావిగేషన్: నౌకా రవాణా, లాజిస్టిక్స్, ఏవియేషన్, సముద్ర రవాణా, రైల్వేలు, రక్షణ, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, స్మార్ట్ సిటీ వంటి విభిన్న రంగాలలో స్థాన నిర్ధారణ, నావిగేషన్,  సమయ నిర్ధారణ (పీఎన్‌టీ) సేవలకు నావిక్‌ను (నెవిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్) ప్రధాన వ్యవస్థగా వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. పరిశ్రమల్లో నావిక్ మార్కెట్ ఆమోదాన్ని వేగవంతం చేయడానికి, దాని ఆధారిత ప్రిసైజ్ పాయింట్ పొజిషనింగ్ (పీపీపీ) రియల్-టైమ్ కైనమాటిక్స్ (ఆర్‌టీకే) కోసం రిసీవర్‌ సాంకేతికతలను అభివృద్ధి చేయనున్నారు. రిసీవర్ సాంకేతికతలతో పాటు, 5జీ, 6జీ వంటి ప్రస్తుత, రాబోయే టెలికామ్ పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ, స్వదేశీ చిప్‌సెట్ తయారీకి అవసరమైన నావిక్ అనుకూలమైన జీఎన్‌ఎస్‌ఎస్‌ బేస్‌బ్యాండ్‌ ఏఎస్‌ఐసీలను స్వదేశీ విధానంలో అభివృద్ధి చేస్తోంది. నావిక్‌ ఉపగ్రహ సమూహాన్ని విస్తరించడం, సిగ్నల్‌ వైవిధ్యం, కచ్చితత్వం, ప్రపంచవ్యాప్త కవరేజీని మెరుగుపరచడం, వినియోగదారు పరికరాలు, కీలక మౌలిక సదుపాయాల్లో అనుసంధానం ద్వారా విస్తృత వినియోగాన్ని ప్రోత్సహించడం, దేశీయ చిప్‌సెట్లు, రిసీవర్‌ తయారీకి మద్దతు ఇవ్వడం, వివిధ అప్లికేషన్ల అభివృద్ధికి బలమైన ప్రైవేటు రంగ వ్యవస్థను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. చంద్రుడిపై స్థాన నిర్ధారణ, నావిగేషన్‌, సమయ నిర్ధారణ సేవలను విస్తరించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు

 

ఈ సమాచారాన్ని లోక్‌సభలో కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంఓ-అణు ఇంధన-అంతరిక్ష విభాగం-సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2298690) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी