వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పవిత్ర హరియాలీ అమావాస్య సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్న వృక్ష మిత్ర పరివార్ సభ్యులు: 50,000కు పైగా మొక్కలు నాటాలని లక్ష్యం
హరియాలీ అమావాస్య ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పర్వదినం
గ్రామాలు, నగరాల్లో మొక్కలు నాటనున్న వృక్ష మిత్ర పరివార్ సభ్యులు
దేశ వ్యాప్తంగా 50,000 పైగా మొక్కలు నాటేందుకు ప్రతిజ్ఞ
మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా పర్యావరణ పరిరక్షణ సందేశం
హరియాలీ అమావాస్య సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటాలి: కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
प्रविष्टि तिथि:
11 AUG 2026 9:08PM by PIB Hyderabad
హరియాలీ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 12, బుధవారం న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియం సమీపంలోని పీబీజీ గ్రౌండ్, సెంట్రల్ రేంజ్‌లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వందలాది మంది సహచరులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతారు. అదే సమయంలో, శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వృక్ష మిత్ర అభియాన్ తో అనుబంధం ఉన్న వేలాది మంది సభ్యులు తమ తమ గ్రామాలు, నగరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 50,000 పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొక్కలు నాటే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ప్రజలు హరియాలీ అమావాస్యను జరుపుకునేలా ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, సంరక్షణ ప్రాధాన్యతను మరింతగా చాటిచెప్పడం ఈ కార్యక్రమం లక్ష్యం.
హరియాలీ అమావాస్య ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పర్వదినం
కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఆగస్టు 12న పవిత్రమైన హరియాలీ అమావాస్య పర్వదినాన్ని జరుపుకుంటామని తెలిపారు. దేశంలోని ప్రతి పండుగ వెనుక శాస్త్రీయ దృక్పథంతో పాటు, ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపరిచే సందేశం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కల్పించే పర్వదినమే హరియాలీ అమావాస్య అని శ్రీ చౌహాన్ అన్నారు.పొలాల్లో విస్తరించిన పచ్చదనం, కొత్త పంట రాబోతుందన్న ఆశ మనసులో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతాయని ఆయన అన్నారు. ప్రకృతి పట్ల కృతజ్ఞతను కేవలం మాటలకే పరిమితం చేయకుండా మొక్కలు నాటడం ద్వారా ఆచరణలోనూ చూపించాలని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి ప్రాధాన్యతను గుర్తించి, దాని పరిరక్షణకు అర్థవంతమైన చర్యల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించేందుకు హరియాలీ అమావాస్య ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని శ్రీ చౌహాన్ తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతా భావాన్ని పెంపొందించుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజలందరూ చురుకుగా పాల్గొని, తమ పరిసరాల్లో మరింత పచ్చదనాన్ని పెంచడం ద్వారా ఈ పర్వదినాన్ని ప్రకృతి పండుగగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మొక్కలు నాటనున్న వేలాది మంది వృక్ష మిత్ర పరివార్ సభ్యులు
శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఆగస్టు 12న హరియాలీ అమావాస్యను పురస్కరించుకుని తమ తమ గ్రామాలు, నగరాలు, పంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని వృక్ష మిత్ర పరివార్ సభ్యులు సంకల్పించినట్లు తెలిపారు. అదే రోజు తాను కూడా తన సహచరులతో కలిసి ఢిల్లీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ హరియాలీ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని కనీసం ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించడం ద్వారా ఈ పవిత్ర సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వృక్ష మిత్ర పరివార్‌కు చెందిన వేలాది మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వివిధ ప్రాంతాలు, సమాజాల్లో మొక్కలు నాటే కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు. గ్రామాలు, నగరాలు, పంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా సభ్యులు తమ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామూహిక బాధ్యత సందేశాన్ని విస్తృతంగా చాటి చెప్పనున్నారు. హరియాలీ అమావాస్య వేడుకల్లో మొక్కలు నాటడాన్ని ఒక అర్థవంతమైన భాగంగా మార్చుతూ, ప్రజలందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శ్రీ చౌహాన్ కోరారు.
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి
కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒక మొక్క నాటడం కేవలం పర్యావరణ పరిరక్షణ చర్య మాత్రమే కాదని, రాబోయే తరాలకు సురక్షితమైన, భద్రమైన, అందమైన భవిష్యత్తుకు పునాది వేయడమని అన్నారు. హరియాలీ అమావాస్య సందర్భంగా ఆగస్టు 12న దేశవ్యాప్తంగా ఉన్న వృక్ష మిత్రులు, ప్రజలందరూ ఒక్కొక్కరూ కనీసం ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో, ప్రతి ఒక్కరూ తమ మొక్కలు నాటే ప్రతిజ్ఞలో మరో ఐదుగురిని భాగస్వాములను చేయాలని కేంద్ర మంత్రి కోరారు. ఆ ఐదుగురూ మరో ఐదుగురిని చొప్పున ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. తద్వారా ఈ మొక్కలు నాటే ఉద్యమంలో సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలు భాగస్వాములు అవుతారని ఆయన అన్నారు. ఈ విధంగా భాగస్వామ్యాన్ని విస్తరించే క్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చవచ్చని ఆయన అన్నారు. వ్యక్తులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు, విస్తృత సమాజంలోని ఇతరులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. పౌరులు తాము చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, ఫొటోలను shivrajsinghchouhan.co.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన కోరారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
***
(रिलीज़ आईडी: 2298027)
आगंतुक पटल : 18