చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
లైంగిక నేరాల సంబంధిత కేసుల విషయంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
प्रविष्टि तिथि:
07 AUG 2026 11:58PM by PIB Hyderabad
లైంగిక నేరాలకు సంబంధించిన ఒక కేసును విచారిస్తూ 14.07.2026 తేదీన సుమోటో రిట్ పిటిషన్ (క్రిమినల్) నం. 1 ఆఫ్ 2025లో ఇచ్చిన తన తీర్పులో.... బాధితులు, ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయ ప్రక్రియల్లో కరుణ, సానుభూతి, సున్నితత్వంల ఆవశ్యకతను గౌరవ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమైన, బాధ్యతాయుతమైన, సమర్థమైన న్యాయ వ్యవస్థ నిర్వహణకు కరుణ, మానవత్వం, అవగాహన వంటి విలువలు అనివార్యమని... న్యాయ నిర్ణయాలు వాటిని తప్పనిసరిగా కలిగి ఉండాలని గౌరవ సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ న్యాయ అకాడమీ ద్వారా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికనూ గౌరవ సుప్రీంకోర్టు ఆమోదించింది.
గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ న్యాయ అకాడమీ ఒక నివేదిక రూపంలో తయారుచేసిన ఈ మార్గదర్శకాలు... న్యాయ ప్రక్రియల్లో, ముఖ్యంగా లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల్లో లింగ-సున్నితమైన, మానసిక వేదనను పరిగణనలోకి తీసుకునే విధానాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాయి. సున్నితత్వం లేని విచారణ వలన కలిగే రెండో దశ బాధింపును నివారించడం, న్యాయ సంబంధిత శిక్షణ-అవగాహన ద్వారా న్యాయం అమలులో సానుభూతి, గౌరవం, నిష్పక్షపాతాన్ని పెంపొందించడం ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఈ నివేదికలోని ముఖ్య లక్షణాల్లో, ఇతర అంశాలతో పాటుగా ఇవి ఉన్నాయి:
గౌరవం, సమానత్వం, గోప్యత, శారీరక సమగ్రత, స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యమిస్తూ... లింగ సంబంధిత న్యాయానికి సంబంధించిన పరిణామం చెందుతున్న రాజ్యాంగ, న్యాయ సూత్రాలను ఇది వివరిస్తుంది. ప్రధానంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలోని సంబంధిత వ్యక్తులు లింగ సంబంధిత కేసులను సున్నితంగా, గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.
ఇలాంటి కేసుల్లో బాధితురాలి లైంగిక చరిత్రపై ఆధారపడటం, అనుమతించలేని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి వాటికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు సహా... విచారణ నిర్వహణకు సంబంధించి ఆచరణాత్మక మార్గదర్శనాన్ని ఇది అందిస్తుంది.
విచారణ, తీర్పు ప్రక్రియల్లో సంభావ్య లింగ పక్షపాతాలు, దురభిప్రాయాలను గుర్తించే ప్రగతిశీల న్యాయ విధానాలను ప్రోత్సహిస్తుంది.
న్యాయపరమైన ఉత్తర్వులు, తీర్పుల్లో లింగ-సున్నితమైన, గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని సిఫార్సు చేస్తోంది.
సంబంధిత భాగస్వాములందరి గౌరవాన్ని, గోప్యతను పరిరక్షించే కరుణాయుతమైన, మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకునే, బాధితులకే ప్రాధాన్యమిచ్చే న్యాయస్థాన పద్ధతులనూ ప్రోత్సహిస్తుంది.
సుమోటో రిట్ పిటిషన్ (Crl.) నం. 1/2025 లోని తీర్పు, అదే పిటిషన్‌కు సంబంధించిన మిసిలేనియస్ అప్లికేషన్ నం. 1998/2026 లోని తీర్పు, జడ్జిమెంట్స్ అండ్ జెండర్ (తీర్పుల రచనలో సున్నితత్వం, కరుణ)' అనే ప్రచురణను భారత సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ విషయాన్ని తెలిపారు.
(रिलीज़ आईडी: 2296523)
आगंतुक पटल : 4