పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: ఏఐ డేటా కేంద్రాల్లో నీటి సమర్థ వినియోగం
प्रविष्टि तिथि:
06 AUG 2026 6:59PM by PIB Hyderabad
సవరించిన పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్-2006 ప్రకారం, కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్లకు స్వతహాగా పర్యావరణ అనుమతి (ఈసీ) అవసరం లేదు. ఈఐఏ నోటిఫికేషన్-2006 షెడ్యూల్‌లోని అంశం 8(a) ప్రకారం "భవన, నిర్మాణ ప్రాజెక్టు"లో భాగంగా ఉన్న, 20,000 చదరపు మీటర్లకు మించిన నిర్మిత ప్రాంతంలో గల ఏఐ డేటా సెంటర్లకు ముందస్తు ఈసీ అవసరం. అంశం 8(b) ప్రకారం "టౌన్షిప్, ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు"లో భాగంగా ఉన్న, 50 హెక్టార్లు లేదా అంతకన్నా ఎక్కువ కవరింగ్ ఏరియా... 1,50,000 చదరపు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ నిర్మిత ఏరియా గల ఏఐ డేటా సెంటర్లకూ ముందస్తు ఈసీ అవసరం. అటువంటి భవన నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఈసీని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ మంజూరు చేస్తుంది.
పర్యావరణ అనుమతి (ఈసీ) మంజూరు కోసం అటువంటి భవన నిర్మాణ ప్రాజెక్టుల మదింపు సమయంలో, ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో... మంచినీటి లభ్యత, నీటి నిల్వ నివేదిక, గ్రేవాటర్ ఉత్పత్తి, గ్రేవాటర్ రీసైక్లింగ్, పునర్వినియోగం వంటి వివిధ అంశాలను సక్రమంగా పరిగణనలోకి తీసుకుంటారు. తగిన పర్యావరణ భద్రతా చర్యలనూ సూచిస్తారు. ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణ సమయంలో నీరు, గ్రేవాటర్ వినియోగం, విడుదల... నీటి (కాలుష్య నివారణ-నియంత్రణ) చట్టం-1974, వాయు (కాలుష్య నివారణ - నియంత్రణ) చట్టం-1981 నియంత్రణలో ఉంటాయి. నీటి వినియోగం, మురుగునీటి విడుదలకు నిర్దేశించిన ప్రమాణాలు సహా, ఈ చట్టాల్లోని నిబంధనల పాటింపును... వర్తించే మేరకు సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు లేదా కాలుష్య నియంత్రణ కమిటీ పర్యవేక్షిస్తుంది.
మౌలిక సదుపాయాలు లేదా వాణిజ్య ప్రాజెక్టుల కోసం భూగర్భ జలాల వెలికితీతను... 29.03.2023 నాటి నోటిఫికేషన్ ద్వారా సవరించిన మార్గదర్శకాలు, 24.09.2020 నాటి జల్ శక్తి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఎస్.ఓ. 3289(E) ద్వారా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నియంత్రిస్తారు.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డిస్ట్రిక్ట్ కూలింగ్ మార్గదర్శకాలు-2023ను జారీ చేసింది. మంచినీటి వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సుస్థిర నీటి నిర్వహణను ప్రోత్సహించడానికి, సాధ్యమైన చోటల్లా కూలింగ్ టవర్ మేకప్ వాటర్‌గా శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని ఈ మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నాయి. ఇంధన సామర్థ్యం గల కూలింగ్ టెక్నాలజీలను అవలంబించడం, కూలింగ్ సిస్టమ్ పనితీరును మెరుగ్గా ఉండేలా చేయడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను ఉపయోగించడం, నీటి సంరక్షణ చర్యలను అమలు చేయడాన్నీ ఈ మార్గదర్శకాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ చర్యలు ముఖ్యంగా డేటా సెంటర్‌లు సహా, అధిక కూలింగ్ అవసరమయ్యే పెద్ద సౌకర్యాల కోసం అత్యంత సముచితమైనవి. ఇవి మెరుగైన ఇంధన సామర్థ్యానికి, నీటి వినియోగం తగ్గించడానికి, కూలింగ్ మౌలిక సదుపాయాల సుస్థిర నిర్వహణకూ మద్దతునిస్తాయి.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం... డిజిటల్, ఏఐ మౌలిక సదుపాయాల్లో ఇంధన సామర్థ్యం, నీటి నిర్వహణ, పర్యావరణ మార్పులను తట్టుకునే శక్తిని పరిశీలించడానికి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ద్వారా ‘తట్టుకునే శక్తి, ఆవిష్కరణ, సమర్థత’ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
రాజ్యసభలో ఈ రోజు అడిగిన ఒక ప్రశ్నకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2295819)
आगंतुक पटल : 10