మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్- 2026’ కోసం నామినేషన్లకు ఆహ్వానం... 2026 ఆగస్టు 15 వరకు గడువు పొడిగింపు

प्रविष्टि तिथि: 04 AUG 2026 11:57AM by PIB Hyderabad

సమాజంపై సానుకూల ప్రభావం చూపుతూ విశేష ప్రతిభను కనబరిచిన, అత్యుత్తమ సేవలందించిన పిల్లలకు ఏటా అందించే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పీఎమ్‌ఆర్‌బీపీ) – 2026’ కోసం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. దేశంలో బాలలకు అందించే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఇదొకటి. పిల్లల్లో చైతన్యం, పట్టుదల, సామర్థ్యం, ఉత్సాహాలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తారు. సాహసం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి, శాస్త్ర - సాంకేతిక రంగం అనే ఆరు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు. భారతీయులై, దేశంలో ఉంటూ... 2026 జులై 31 నాటికి 5 సంవత్సరాలు నిండి, 18 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు నామినేషన్లకు అర్హులు. నామినేషన్ల సమర్పణకు నిర్దేశించిన చివరి తేదీకి ముందుగా రెండేళ్ల వ్యవధిలో కనబరిచిన ప్రతిభ, సాహసం లేదా సేవలను ఈ పురస్కారం కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ పురస్కారం కోసం వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా, పిల్లలు స్వయంగానూ నామినేషన్లను సమర్పించవచ్చు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు, జిల్లా మెజిస్ట్రేట్లు/కలెక్టర్లు, విద్యాసంస్థలు, అర్హత కలిగిన ఇతర అధికార యంత్రాంగాలు కూడా నామినేషన్లను సమర్పించవచ్చు. ప్రతి పురస్కార గ్రహీత ఒక పతకం, ధ్రువీకరణ పత్రం, ప్రశంసా పత్రాలను అందుకుంటారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార కమిటీ సిఫార్సుల మేరకు.. 25 మంది వరకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2026 డిసెంబరు 26న వీర బాల దివస్ సందర్భంగా విజేతలను ప్రకటిస్తారు. అనంతరం న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గౌరవ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీని 2026 ఆగస్టు 15 వరకు పొడిగించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు, సంస్థలు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్లను సమర్పించవచ్చు.  

****

 


(रिलीज़ आईडी: 2294159) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English