వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏపీఈడీఏ ఆధ్వర్యంలో బిహార్‌ నుంచి కెనడాకు తొలిసారి సముద్ర మార్గం ద్వారా విలువ ఆధారిత ఫ్లేవర్డ్ మఖానా ఎగుమతి



ఈ ఎగుమతులతో రైతుల ఆదాయం 50 శాతం పెరుగుదల... అంతర్జాతీయ స్థాయిలో బిహార్‌ గుర్తింపు బలోపేతం

प्रविष्टि तिथि: 30 JUL 2026 7:19PM by PIB Hyderabad

 

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) కీలక మైలురాయిని సాధించింది. బిహార్ రాష్ట్రం దర్భంగా నుంచి తొలిసారి సముద్ర మార్గం ద్వారా కెనడాకు విలువ జోడించిన ఫ్లేవర్డ్ మఖానా (తామర గింజలు) ఎగుమతిని జూలై 29, 2026న విజయవంతంగా ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో బిహార్ విశిష్టమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, రాష్ట్ర విలువాధారిత ఎగుమతుల పరిధిని విస్తరించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది.

 

రెండు కంటెయినర్లలో ప్యాక్ చేసిన మొత్తం 7 మెట్రిక్ టన్నుల మఖానా సరుకు ముంద్రా ఓడరేవు ద్వారా కెనడాలోని జెడ్‌కేడీ ఫుడ్స్ సంస్థకు బయలుదేరింది. ఈ ఫ్లేవర్డ్ మఖానాను న్యూట్రివిన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంతర్జాతీయ నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెస్ చేసి ప్యాక్ చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్, విలువాధారిత రంగాలు, ఎగుమతి ఆధారిత తయారీలో బిహార్‌కు పెరుగుతున్న సామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలిచింది.

 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీఈడీఏ చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రవాణా సాఫీగా జరగడానికి సహకరించిన ఎగుమతిదారులు, ప్రాసెసర్లు, రైతులు, పరిశ్రమ వర్గాలు, ఏపీఈడీఏ అధికారుల సమష్టి కృషిని ఆయన అభినందించారు. ఇటువంటి ఉమ్మడి కార్యక్రమాలు బిహార్ వ్యవసాయ ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని, విలువ జోడించిన ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో దర్భంగా ఐసీఏఆర్ తూర్పు ప్రాంత పరిశోధన సముదాయం, మఖానా పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మనోజ్ కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి శ్రీ లోక్‌నాథ్ ఠాకూర్, ఏపీఈడీఏ ఉన్నతాధికారులు, మఖానా విలువాధారిత రంగానికి చెందిన ఎగుమతిదారులు, వాటాదారులు పాల్గొన్నారు.

 

ఫాక్స్‌ నట్స్‌గా పిలిచే మఖానా (తామర గింజలు) బిహార్ రాష్ట్ర ప్రధాన వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఒకటి. దేశ మఖానా ఉత్పత్తిలో సింహభాగం ఈ రాష్ట్రానిదే కావడం విశేషం. ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ కారణంగా బిహార్ మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతోంది. ఫ్లేవర్డ్ మఖానా ఎగుమతి కావడం వల్ల ఎగుమతి అవకాశాలు పెరగడమే కాకుండా, ఈ ప్రత్యేక ఉత్పత్తికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నారు.

 

ఉత్పత్తుల విలువను పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లకు నేరుగా అనుసంధానం కావడం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రాసెసింగ్, బ్రాండింగ్, ఎగుమతి ఆధారిత వ్యాపారాల ద్వారా భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని ఎంతగానో పెంచవచ్చని ఈ విజయం రుజువు చేస్తోంది. మన రైతులను అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థతో అనుసంధానించడంలో ఇటువంటి ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయి.

 

సామర్థ్యాల పెంపు, ఎగుమతి మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల అమలు, మార్కెట్ అనుసంధానం, ఉత్పత్తుల విలువ పెంపు వంటి చర్యల ద్వారా బిహార్‌ను ఒక ప్రముఖ వ్యవసాయ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఏపీఈడీఏ నిరంతరం కృషి చేస్తోంది. నాణ్యతను నిర్ధారించడం, ఎగుమతులను సులభతరం చేయడం, కొత్త మార్కెట్లను పెంపొందించడం ద్వారా భారతీయ వ్యవసాయ ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రాసెసర్లు, ఇతర భాగస్వాములతో కలిసి ఏపీఈడీఏ పనిచేస్తోంది. కెనడాకు ఫ్లేవర్డ్ మఖానాను సముద్ర మార్గం ద్వారా విజయవంతంగా ఎగుమతి చేయడం ఈ ప్రయత్నాల్లో కీలక మైలురాయిగా నిలిచింది. ఇది బిహార్ ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తుల అంతర్జాతీయ ఉనికిని మరింత పెంచడమే కాకుండా రైతులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులకు నిలకడైన, సుస్థిరమైన ఆదాయ అవకాశాలను సృష్టిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2292149) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी