రైల్వే మంత్రిత్వ శాఖ
రూ. 299 కోట్ల వ్యయంతో యార్డు సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా... విశాఖపట్నం కోచింగ్ యార్డు పునరుద్ధరణ ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే ఉన్న ఆరు ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ సహా ఆరు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు, మరో ఆరు కొత్త లైన్ల ఏర్పాటు
ప్రయాణికులకు మెరుగైన అనుభవం కోసం కొత్తగా తూర్పు వైపు స్టేషన్ ప్రవేశ ద్వారం, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, సర్ఫేస్ పార్కింగ్, సమర్థమైన సర్క్యులేషన్ ప్లాన్
प्रविष्टि तिथि:
30 JUL 2026 6:34PM by PIB Hyderabad
ప్రయాణికుల మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యానికి అత్యంత ప్రాదాన్యమిస్తూ... దక్షిణ తీర రైల్వేకు చెందిన విశాఖపట్నం కోచింగ్ యార్డును రూ.299 కోట్ల వ్యయంతో పునర్నిర్మించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే టెర్మినళ్లలో ఒకటైన ఈ స్టేషన్ నిర్వహణ సామర్థ్యాన్ని, రైళ్ల సమయపాలనను గణనీయంగా మెరుగుపరచడం, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
విశాఖపట్నం కోచింగ్ యార్డు సమగ్ర పునర్నిర్మాణం
మంజూరైన ఈ ప్రాజెక్టులో భాగంగా, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సహా అదనపు లైన్లు, ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణం ద్వారా విశాఖపట్నం కోచింగ్ యార్డును సమగ్రంగా పునర్నిర్మించనున్నారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒక ప్రధాన కోచింగ్ టెర్మినల్. ఇది ప్రతి రోజూ సగటున 113 రైళ్లతో దాదాపు 80,000 మంది ప్రయాణికులను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉన్న యార్డు లేఅవుట్ కారణంగా, గమ్యస్థానానికి చేరే, నేరుగా వెళ్లే రైళ్లు ఉపరితల క్రాసింగ్‌లను దాటవలసి వస్తోంది. దీనివల్ల అప్రోచ్ సిగ్నళ్ల వద్ద రైళ్లు నిలిచిపోవడం, ప్లాట్‌ఫారమ్‌లు సరిపడా అందుబాటులో లేకపోవడం, నిర్వహణాపరమైన పరిమితుల వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
యార్డు పునర్నిర్మాణం ఈ ఉపరితల క్రాసింగ్‌ల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది. రైళ్లు నిలిచిపోయే సమయాన్నీ తగ్గిస్తుంది. ప్లాట్‌ఫారమ్ ఆక్యుపెన్సీని మెరుగుపరుస్తుంది. అదనపు రైళ్లను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రధాన సామర్థ్య పెంపు, ప్రయాణికుల-కేంద్రిత మౌలిక సదుపాయాలు
ఈ పనుల్లో ఇవి భాగంగా ఉంటాయి:
లైన్ లూప్ లైన్లను తొలగించడం, పాయింట్ జోన్లను తిరిగి అమర్చడం.
ప్రస్తుతం ఉన్న ఆరు ప్లాట్‌ఫారాలను విస్తరించడం.
ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆరు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం.
అదనంగా ఆరు రైల్వే లైన్ల నిర్మాణం.
ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండడాన్ని, వారి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి గానూ విస్తరించిన ప్లాట్‌ఫారమ్‌లపై ర్యాంపులు, లిఫ్టులు, ఎస్కలేటర్‌లు సహా ప్రయాణికుల సదుపాయాలను అభివృద్ధి చేయడం.
స్టేషన్ తూర్పు వైపున కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయడంతో పాటు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)ను తరలించడం.
విశాఖపట్నం స్టేషన్ యార్డులో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఈఐ) ఏర్పాటు సహా, ఉపరితల పార్కింగ్ సౌకర్యాల అభివృద్ధి, సమర్థమైన సర్క్యులేటింగ్ ఏరియా ప్రణాళిక.
మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, ప్రయాణికుల సౌకర్యం
ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టు... కోచింగ్ యార్డులో రద్దీని తగ్గించడం, ప్లాట్‌ఫారాల లభ్యతను పెంచడం, రైళ్ల రాకపోకలను సులభతరం చేయడం ద్వారా నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ అదనపు మౌలిక సదుపాయాలు, విశాఖపట్నం స్టేషన్‌కు పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలు కల్పిస్తూనే, రైళ్ల సమయపాలననూ మెరుగుపరిచి, ఆలస్యాన్ని తగ్గిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2292144)
आगंतुक पटल : 11