ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

పెరుగుతున్న ప్రాణ రక్షక మందుల ధరలు

प्रविष्टि तिथि: 28 JUL 2026 3:28PM by PIB Hyderabad

ప్రస్తుతం దేశంలో జాతీయ ఔషధ ధరల విధానం 2012 ఆధారంగా రూపొందించిన మందుల (ధరల నియంత్రణ) ఉత్తర్వు 2013 (డీపీసీఓ 2013) నిబంధనల ప్రకారం మందుల ధరలను నియంత్రిస్తున్నారు. జాతీయ అత్యవసర జౌషధాల జాబితా ఆధారంగా డీపీసీఓ 2013 షెడ్యూల్-Iలో చేర్చిన మందుల గరిష్ఠ ధరలను, నూతన మందుల రిటైల్ ధరలను జాతీయ ఔషధ ధరల సంస్థ (నేషనల్‌ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ-ఎన్‌పీపీఏ) నిర్ణయిస్తుంది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ఆధారంగా ప్రతీ సంవత్సరం ఈ షెడ్యూల్డ్ మందుల గరిష్ఠ ధరలను సవరిస్తుంటారు. షెడ్యూల్‌లో లేని ఇతర మందుల విషయంలో తయారీదారులు గడిచిన 12 నెలల కాలంలో ఏ మందు గరిష్ఠ రిటైల్ ధరను (ఎంఆర్‌పీ) అయినా 10 శాతానికి మించి పెంచకూడదు. అత్యవసర పరిస్థితులు, ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా డీపీసీఓ 2013లోని పేరా 19 కింద కూడా ఎన్‌పీపీఏ ప్రత్యేకంగా ధరలను నిర్ధారిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ ధరలు వసూలు చేసే సందర్భాలపై డీపీసీఓ 2013 నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఎన్‌పీపీఏ నిర్ధారించిన లేదా సవరించిన ధరల పూర్తి వివరాలు వారి అధికారిక వెబ్‌సైట్ (www.nppa.gov.in) లో అందుబాటులో ఉన్నాయి.

 

దేశంలో మందుల లభ్యతను ఎన్‌పీపీఏ పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్లు (ఎస్‌డీసీలు), ఫార్మా జన్ సమాధాన్ వేదిక, ఎన్‌పీపీఏ హెల్ప్‌లైన్, ప్రజా ఫిర్యాదుల వేదికలు, వ్యక్తుల ద్వారా ఏ మందైనా అందుబాటులో లేదనే సమస్య తమ దృష్టికి వచ్చిన వెంటనే ఎన్‌పీపీఏ నివారణ చర్యలు చేపడుతుంది. సామాన్య ప్రజలకు నిత్యావసర మందులు తక్కువ ధరలకే అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం ఇతర చర్యలు కూడా చేపట్టింది. అవి..
 

 1. ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన: ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి, దేశ వ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ జనఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన జెనెరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ బ్రాండెడ్ మందుల ధరలతో పోలిస్తే ఇక్కడ 50 నుంచి 80 శాతం తక్కువ ధరకే మందులు లభిస్తాయి.

 

2.ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై): కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా ద్వితీయ, తృతీయ స్థాయి (టెర్షియరీ కేర్ హాస్పిటలైజేషన్) ఆసుపత్రి వైద్య చికిత్సల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుంది. ఈ చికిత్సల్లో మందుల ఖర్చులు కూడా కలిసి ఉంటాయి.

 

3.జాతీయ ఆరోగ్య మిషన్-ఉచిత మందుల సరఫరా కార్యక్రమం: భారతీయ ప్రజా ఆరోగ్య ప్రమాణాల (ఐపీహెచ్‌ఎస్‌) ప్రకారం సిఫార్సు చేసిన నిత్యావసర మందులను ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచిజిల్లా ఆసుపత్రుల వరకు ఉచితంగానే ఈ మందుల పంపిణీ జరుగుతుంది.

 

4.అమృత్ పథకం: కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘అమృత్’ (అఫోర్డబుల్ మెడిసిన్స్, రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్‌మెంట్) పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పలు ఆసుపత్రులు, వైద్య సంస్థల్లో ఏర్పాటు చేసిన అమృత్ మందుల దుకాణాల ద్వారా క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర తీవ్రమైన రోగాలకు సంబంధించిన మందులు అందిస్తున్నారు. ఇంప్లాంట్లు, సర్జికల్ వస్తువులు, ఇతర వైద్య పరికరాలను సాధారణ మార్కెట్ ధరల కంటే సగటున 50 శాతం వరకు తగ్గింపు ధరకే లబ్ధిదారులకు విక్రయిస్తున్నారు.

 

5. రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్‌ఏఎన్‌), వైద్యశాఖ మంత్రి సంక్షేమ నిధి: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన రోగులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడితే... రాష్ట్రీయ ఆరోగ్య నిధి, వైద్యశాఖ మంత్రి సంక్షేమ నిధి పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి వారికి నేరుగా ఆర్థిక సహాయం అందుతుంది.

 

ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా అందించిన సమాచారంలో వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2290838) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी