రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారులపై పశువుల సంచారం కారణంగా జరిగే ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు మరింత ముమ్మరం
నాడు పోస్టు చేయడమైనది:
28 JUL 2026 5:36PM by PIB Vijayawada
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ప్రాజెక్టు అమలు విభాగం- అమరావతి పరిధిలోని జాతీయ రహదారులపై పశువుల సంచారాన్ని నివారించడంతో పాటు రహదారి వినియోగదారుల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నిరంతర చర్యలు చేపడుతోంది.
రోడ్డు భద్రతల చర్యల్లో భాగంగా, జాతీయ రహదారి-16 లోని చిలకలూరిపేట–విజయవాడ విభాగంలో పశువుల సంచారం ఎక్కువగా ఉన్న నాలుగు (04) దుర్బలమైన ప్రాంతాలు అలాగే మూడు (03) ప్రమాదకర బ్లాక్ స్పాట్‌లను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.
జాతీయ రహదారి-16 లోని చిలకలూరిపేట–విజయవాడ విభాగం, చిలకలూరిపేట బైపాస్, విజయవాడ బైపాస్, అలాగే జాతీయ రహదారి-544D లోని గిద్దలూరు–వినుకొండ విభాగాల్లో సంచార పశువులను తొలగించే ప్రత్యేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. రూట్ పెట్రోల్ వెహికల్స్ (RPVs) సహకారంతో ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ బృందాలు ఈ జాతీయ రహదారి విభాగాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సంచార పశువులను సురక్షితంగా తొలగించి, యజమానులను గుర్తించి వారికి అప్పగిస్తున్నాయి. ఈ మార్గాల్లో రోజుకు మూడు షిఫ్టులలో 24 గంటలపాటు గస్తీ నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారులపై భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ చర్యలను ఎన్‌హెచ్‌ఏఐ నిరంతరాయంగా అమలు చేస్తోంది.
ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ మేనేజర్ మరియు రూట్ పెట్రోల్ బృందాలు సమీప గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, పశువుల యజమానులు తమ పశువులను జాతీయ రహదారులపైకి వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాయి. అలాగే పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీలతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. జాతీయ రహదారులపై కనిపిస్తున్న సంచార పశువుల్లో ఎక్కువ భాగం సమీప గ్రామాలకు చెందినవే కాగా, వాటిని రహదారి పరిసరాల్లో స్వేచ్ఛగా మేత కోసం వదిలేయడం వల్ల అవి జాతీయ రహదారులపైకి వస్తున్నట్లు గుర్తించారు.
నిరంతర పర్యవేక్షణ, ఘటనలపై సత్వర స్పందన, ప్రజల్లో అవగాహన కల్పించడం, స్థానిక అధికారులతో సమన్వయం వంటి చర్యల ద్వారా జాతీయ రహదారులపై భద్రతను మరింత మెరుగుపరచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ నిరంతరం కృషి చేస్తోంది. వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని, నిర్దేశిత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, జాతీయ రహదారులపై సంచార పశువులు కనిపించిన వెంటనే 1033 జాతీయ రహదారుల అత్యవసర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచిస్తోంది. అలాగే పశువుల యజమానులు తమ పశువులను జాతీయ రహదారులపైకి వదలకుండా సహకరించాలని ఎన్‌హెచ్‌ఏఐ విజ్ఞప్తి చేస్తోంది. సంచార పశువులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు జాతీయ రహదారి అత్యవసర హెల్ప్‌లైన్ (1033) 24/7 అందుబాటులో ఉండి, తక్షణ స్పందనకు తోడ్పడుతోంది.


****
(రిలీజ్ ఐడి: 2290586)
సందర్శకుల సూచీ సంఖ్య : : 32