శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సిరిపురం గ్రామపంచాయతీకి 500 కేఎల్‌డీ నమూనా వికేంద్రీకృత సమీకృత వ్యర్ధజలాల శుద్ధి కేంద్రాన్ని అప్పగించిన సీఎస్ఐఆర్ - ఐఐసీటీ
గ్రామీణ వస్త్ర పరిశ్రమల సముదాయాల్లో సుస్థిర మురుగునీటి నిర్వహణకు ఆదర్శ నమూనాగా ‘ల్యాబ్ టు లూమ్’ కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
23 JUL 2026 5:22PM by PIB Hyderabad
సుస్థిర గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత ఆధారిత సామాజిక సాధికారత దిశగా ఒక విజయాన్ని సూచిస్తూ, హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ - భారత కెమికల్ టెక్నాలజీ సంస్థ (సీఎస్ఐఆర్–ఐఐసీటీ) తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురం గ్రామపంచాయతీకి 500 కేఎల్‌డీ సామర్థ్యం గల నమూనా వికేంద్రీకృత సమీకృత మురుగునీటి శుద్ధి (ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ -ఈటీపీ) కేంద్రాన్ని అధికారికంగా అప్పగించింది. ఈ కేంద్రం ద్వారా వస్త్రాల రంగు అద్దకం పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలతో పాటు ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని కూడా శుద్ధి చేస్తారు.
సీఎస్ఐఆర్ - ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాసరెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ, “సిరిపురం నమూనా వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి కేంద్రం శాస్త్రీయ ఆవిష్కరణలతో పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా, గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరచగలదని నిరూపిస్తోంది. ఇది ‘ల్యాబ్ టు లూమ్’ కార్యక్రమానికి నిదర్శనం. ఇది దేశీయ పరిశోధనా ఫలితాలను చేనేత రంగానికి ఉపయోగపడే ఆచరణాత్మక, సుస్థిర పరిష్కారంగా మలిచిన కార్యక్రమం. దేశంలోని వివిధ జౌళి, చేనేత పరిశ్రమల సముదాయాల్లో ఈ నమూనాను అమలు చేసే అవకాశం ఎంతో ఉందని మేం భావిస్తున్నాం. ఇది నీటి సంరక్షణ, కాలుష్య నివారణతో పాటు సుస్థిర గ్రామీణాభివృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
సీఎస్ఐఆర్ - ఎన్ఈఈఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకట మోహన్ మాట్లాడుతూ, సంక్లిష్టమైన వస్త్ర రంగులు, సేంద్రీయ కాలుష్య కారకాలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసేందుకు ఈ శుద్ధి వ్యవస్థలో అనేక జీవక్రియ మార్గాలను ఆధునిక బయో ఎలక్ట్రో క్యాటలైటిక్ ప్రక్రియలతో సమన్వయం చేసినట్లు వివరించారు. తక్కువ విద్యుత్ వినియోగం, కనిష్ఠ రసాయనాల వినియోగం, వనరుల సంరక్షణ, నీటి పునర్వినియోగం వంటి సూత్రాల ఆధారంగా ఈ వ్యవస్థను రూపొందించారు. పర్యావరణ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ రంగాల్లోని ఆధునిక సాంకేతికతలను క్షేత్రస్థాయిలో అమలు చేయగల సమర్థవంతమైన పరిష్కారాలుగా మలిచి, కాలుష్య నియంత్రణ, నీటి భద్రత, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను సాధించేందుకు ఇది దోహదపడుతుందని నిరూపిస్తోంది. దేశంలో వందల సంఖ్యలో చేనేత, వస్త్ర పరిశ్రమల క్లస్టర్లు ఉన్నాయని, వాటిలో అనేక ప్రాంతాలు రంగుల అద్దకం, ఇతర ప్రాసెసింగ్ కార్యకలాపాల ద్వారా వెలువడే మురుగునీటి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని డాక్టర్ మోహన్ వివరించారు. అందువల్ల సిరిపురం ఈటీపీ నమూనాను గురుత్వాకర్షణ ఆధారిత, రసాయన రహిత, శక్తి సామర్థ్యంతో కూడిన విధానంలో అభివృద్ధి పరిచారు. దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమల క్లస్టర్లలో అమలు చేసేందుకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకునేందుకు విస్తృత అవకాశాలున్న ఆదర్శ ప్రదర్శన కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంది.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల కోసం స్వదేశీ హరిత సాంకేతికత
500 కేఎల్‌డీ సామర్థ్యం గల ఈ శుద్ధి కేంద్రం సమగ్ర హైబ్రిడ్ జీవ శుద్ధి విధానాన్ని ఉపయోగిస్తుంది. ఇందులో అనేక జీవక్రియ మార్గాలను ఆధునిక బయో ఎలక్ట్రో క్యాటలైటిక్ ప్రక్రియలతో సమన్వయం చేసి మురుగునీటి శుద్ధి చేపడుతున్నారు. ఈ స్థాయిలో బయో ఎలక్ట్రో క్యాటలైటిక్ ప్రక్రియలను సమన్వయం చేయడం ద్వారా, వస్త్ర పరిశ్రమల వ్యర్థ జలాలనూ, గృహ మురుగు నీటినీ కలిపి శుద్ధి చేసే సాంకేతికతకు ఇది క్షేత్రస్థాయిలో ఒక ముఖ్యమైన నమూనాగా నిలుస్తోంది.
సామాజిక, పర్యావరణ ప్రభావం
ఈ శుద్ధి కేంద్రం ద్వారా స్థానిక పర్యావరణ పరిస్థితులు మెరుగుపడటంతో పాటు, సుస్థిర జీవనోపాధులకు తోడ్పాటుతో సిరిపురం గ్రామంలోని దాదాపు 7,000 మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మురుగునీటి వల్ల భూమి, జల వనరులు కలుషితం కాకుండా నివారించడంతో పాటు పారిశుద్ధ్యం, పర్యావరణ నాణ్యత మెరుగుపడుతాయని భావిస్తున్నారు. అలాగే మంచినీటి వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, సంప్రదాయ చేనేత కార్యకలాపాలకు పర్యావరణ పరంగా మరింత సుస్థిరతను అందించడంలో ఇది సహాయపడనుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం పర్యావరణ బాధ్యత కలిగిన వస్త్ర ఉత్పత్తిగా పోచంపల్లి వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో దోహదపడుతుంది. భవిష్యత్లో సుస్థిరత ధ్రువీకరణ, పర్యావరణ అనుకూల గుర్తింపు పొందే ప్రయత్నాలకు ఇది తోడ్పాటు అందించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోచంపల్లి వస్త్రాల విలువనూ , పోటీతత్వాన్నీ పెంచే అవకాశం ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2288651)
సందర్శకుల సూచీ సంఖ్య : : 46