బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రీయంగా గనుల మూసివేత - పునరుపయోగ పద్ధతులపై బొగ్గు మంత్రిత్వశాఖ తొలి జాతీయ నివేదిక ‘ఆరోహ్’ ఆవిష్కరణ

శాస్త్రీయ విధానాల్లో గనుల మూసివేతకు సాంకేతిక సహకారం దిశగా జర్మనీ సంస్థ ‘జీఐజెడ్’తో ఒప్పందం కుదుర్చుకున్న మంత్రిత్వశాఖ

గనుల ద్రవ వ్యర్థాలను సురక్షిత తాగునీరుగా మార్చే ‘కోల్‌ నీర్’ ప్లాంట్లను ప్రారంభించిన బొగ్గుశాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి

ఝరియా పునరావాసం.. నైపుణ్యాభివృద్ధిపై హిండాల్కో.. రాజధాని యూనివర్సల్ ఫ్యాబ్రిక్స్‌తో బీసీసీఎల్-జేఆర్‌డీఏ త్రైపాక్షిక ఒప్పందం

प्रविष्टि तिथि: 22 JUL 2026 8:54PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు న్యూఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివిధ గనుల మూసివేతపై ‘ఆరోహ్’ పేరిట రూపొందించిన వార్షిక నివేదికను ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా గనుల మూసివేత, పర్యావరణ పునరుద్ధరణ, గనుల తవ్వకం తర్వాత సుస్థిర భూ వినియోగం దిశగా శాస్త్రీయ విధానాల అమలులో భారత్‌ సాధించిన ప్రగతిని ఈ నివేదిక వివరిస్తుంది.

 

ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే; శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర, (స్వతంత్ర బాధ్యత) ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సహా జర్మన్ రాయబారి గౌరవనీయ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్; ఈయూ ప్రతినిధి బృందం డిప్యూటీ హెడ్ డాక్టర్ ఈవా సువారా; కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, కోల్ కంట్రోలర్ శ్రీ ఎన్.సజీష్ కుమార్ హాజరయ్యారు. అలాగే, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో పాటు బొగ్గు కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, సుస్థిర గనుల తవ్వకం-అనంతర అభివృద్ధి సంబంధిత భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘గనుల మూసివేత-పునరుపయోగం’పై ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. కోల్ ఇండియా లిమిటెడ్-అనుబంధ సంస్థలు ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌), ఎన్‌టీపీసీ సహా ప్రైవేట్ మైనింగ్ సంస్థలు చేపట్టిన వినూత్న కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు. శాస్త్రీయ విధానాల్లో భూమి-పర్యావరణ పునరుద్ధరణ, గనుల పునరుపయోగం, సామాజిక అభివృద్ధి, తవ్వకానంతరం సుస్థిర భూ వినియోగం తదితరాల్లో విజయవంతంగా అమలు చేసిన పద్ధతులను ఈ ప్రదర్శన కళ్లకు కట్టింది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఆరోహ్’ నివేదికను మంత్రులు అధికారికంగా ఆవిష్కరించారు. అనంతరం, దీనిపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. శాస్త్రీయంగా గనుల మూసివేత-పునరుపయోగ పద్ధతులపై తొలి జాతీయ సమగ్ర చిత్రణను కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఈ నివేదిక విశదీకరిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ శాస్త్రీయంగా మూసివేసిన 42 బొగ్గు గనుల పరిణామాత్మక ప్రస్థానాన్ని వివరిస్తుంది. వ్యవస్థీకృత పునరుద్ధరణ ప్రక్రియలు, పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలు, గనుల తవ్వకం తర్వాత భూమి సుస్థిర వినియోగం, పర్యావరణ హితంగా పునరుద్ధరించిన, సామాజికంగా ప్రయోజనకర ప్రదేశాల రూపకల్పనకు దోహదం చేసిన సమాజాధారిత కార్యకలాపాలను మన ముందుంచుతుంది.

 

ఆరోహ్‌లో పొందుపరిచిన ప్రతి గని వివరాల మేరకు- కీలక మూసివేత కార్యక్రమాలు, గనుల తవ్వకం అనంతర భూ వినియోగ ఫలితాలు, తవ్వకానికి ముందు-తర్వాత దృశ్యరూపక వివరణ, ఆయా గని ప్రదేశాల పరిణామాత్మక మార్పును తెలిపే క్యూఆర్ కోడ్‌ సహిత డాక్యుమెంటరీ వీడియోలను చూడవచ్చు. ఈ ప్రచురణ ఒక విజ్ఞాన భాండాగారం తరహాలో విజయవంతమైన నమూనాలను ప్రముఖంగా వివరిస్తూ- భవిష్యత్తులో గనుల మూసివేత, పునరుపయోగ కృషి దిశగా విలువైన అవగాహనను కల్పిస్తుంది.

దేశంలో గనుల మూసివేత చట్రం పరిణామ క్రమంతోపాటు బొగ్గు మంత్రిత్వశాఖ చేపట్టిన కీలక కార్యక్రమాలను కూడా ఈ నివేదిక ప్రముఖంగా వివరిస్తుంది. వీటిలో శాస్త్రీయ అంచనాలు, భాగస్వాముల పాత్ర, విజ్ఞాన ఆదానప్రదానం, గనుల తవ్వకానంతర సుస్థిర భూ వినియోగాన్ని ప్రోత్సహించే పునరాధీన చట్రం, ఎల్ఐవీఈఎస్ చట్రం, గనుల పునరుపయోగ ఉపకరణం-సువికల్ప్, సువికల్ప్ సంవాద్ తదితరాలున్నాయి.

 

శాస్త్రీయ విధానంలో గనుల మూసివేతకు సాంకేతిక సహకారం కోసం జర్మనీ సంస్థ ‘డాయిష్ గెసెల్షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్బీట్’ (జీఐజెడ్)తో బొగ్గు మంత్రిత్వశాఖ ఒప్పందం ఈ కార్యక్రమంలో మరో కీలక ఘట్టం. శాస్త్రీయ విధానంలో గనుల మూసివేత, పునరుపయోగం, సాంకేతిక సామర్థ్య వికాసం, విజ్ఞాన ఆదానప్రదానం, ప్రపంచ ఉత్తమ పద్ధతుల అనుసరణ తదితర అంశాలలో సహకార బలోపేతంతో పాటు మైనింగ్ రంగంలో భారత్-జర్మనీ సహకారాన్ని పటిష్టం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ ప్రాజెక్టును జర్మనీ ఫెడరల్ ఆర్థిక సహకార-అభివృద్ధి మంత్రిత్వశాఖ (బీఎంజడ్‌) ప్రారంభిస్తుంది. దీని విలువ వ్యయం 10 మిలియన్‌ యూరోలు కాగా ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా తన వాటా కింద 2030 వరకూ నిధులిస్తుంది. ఈ మేరకు భారత్‌లో బొగ్గు గనుల మూసివేత, పునరుపయోగం నిమిత్తం వినూత్న, సుస్థిర విధానాల రూపకల్పనకు ప్రాధాన్యంతో నాలుగేళ్ల పాటు ఈ సహకారం కొనసాగుతుంది. సుస్థిర ఆర్థికాభివృద్ధిపై సహకార విస్తృతి లో భారత్‌తో ‘ఈయూ’కుగల బలమైన భాగస్వామ్యాన్ని జర్మనీ, ‘ఈయూ’ల పెట్టుబడి ప్రతిబింబిస్తుంది. ఈ అంశాన్ని భారత్-ఈయూ 16వ శిఖరాగ్ర సదస్సులోనూ, ఈ ఏడాది ఆరంభంలో జర్మన్ ఛాన్సలర్ భారత పర్యటనలోనూ పునరుద్ఘాటించడం గమనార్హం.

 

బొగ్గు గనుల నుంచి వెలువడే ద్రవ వ్యర్థాలను సురక్షిత తాగునీరుగా మార్చేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) ఏర్పాటు చేసిన ‘కోల్ నీర్’ ప్లాంట్లను కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తన అనుబంధ సంస్థలైన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్‌), సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్‌), మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్‌), సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌) ద్వారా ‘సీఐఎల్‌’ వీటిని ఏర్పాటు చేయించింది. బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో సురక్షిత, సుస్థిర తాగునీటి సౌకర్యాల బలోపేతం సహా ఆ ప్రాంతాల్లో నివసించే జనజీవన నాణ్యతను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశిత ‘వ్యర్థం నుంచి అర్థం’ దృక్కోణానికి అనుగుణంగా ఏర్పాటైన ఈ ప్లాంట్లు గనుల నీటిని శుద్ధి చేసి, ‘కోల్ నీర్’ బ్రాండ్ పేరిట సురక్షిత, నాణ్యమైన బాటిల్ తాగునీరుగా విక్రయిస్తాయి. స్థానికులతోపాటు సమీప గ్రామాలకు పరిశుభ్ర, సురక్షిత తాగునీరు అందించే దిశగా వివిధ ఆధునిక శుద్ధి విధానాలను ఈ ప్లాంట్లలో వినియోగిస్తారు. తాగునీరు చౌక ధరకు అందుబాటులో ఉండటమే కాకుండా సమీప గ్రామాల స్వయం సహాయక బృందాలకు ఈ ప్రాజెక్టుల ద్వారా సుస్థిర జీవనోపాధి కూడా లభిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా హిండాల్కో, రాజధాని యూనివర్సల్ ఫ్యాబ్రిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలతో బీసీసీఎల్, ఝరియా రిహాబిలిటేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జేఆర్‌డీఏ) ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఝరియా బొగ్గు గనుల ప్రాంతంలో పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంక్షేమం, సామాజిక-ఆర్థిక అభివృద్ధి దిశగా సమన్వయ కృషికి ఇది తోడ్పడుతుంది. బీసీసీఎల్‌, జేఆర్‌డీఏ, హిండాల్కోల మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందంతో ముఖ్యంగా ధన్‌బాద్ ప్రాంత యువతకు అంతర్జాతీయ స్థాయి వస్త్ర తయారీ యూనిట్లలో పనిచేయగల పారిశ్రామిక నైపుణ్య శిక్షణ లభిస్తుంది. ఇందుకోసం పరిశ్రమ అనుసంధాన నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే, అంతర్జాతీయ స్థాయి సమీకృత సాంకేతిక వస్త్ర తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయడం బీసీసీఎల్‌, జేఆర్‌డీఏ, రాజధాని యూనివర్సల్ ఫ్యాబ్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం లక్ష్యం. దీనివల్ల భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు అపార ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

 

ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి ప్రధానోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుకైన నాయకత్వాన దేశంలో గనుల మూసివేత విధానం ఆమూలాగ్రం మారిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ విధానాన్ని గనుల మూసివేతగా కాకుండా ప్రజల, సమాజాల సుస్థిర ప్రగతికి కొత్త అవకాశాల ఆవిష్కరణగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత జాతీయ ప్రాధాన్యం మాత్రమే కాదని, వికసిత భారత్-2047 సంకల్ప సాకారానికి ఒక మూలస్తంభమని ఆయన అభివర్ణించారు. భారత్‌ ఇప్పటికే 42 బొగ్గు గనులను శాస్త్రీయంగా మూసివేసిన నేపథ్యంలో 33 గత ఏడాదిలోనే మూసివేసినవేనని తెలిపారు. మరో రెండుమూడేళ్లలో 147 గనుల మూసివేతకు ప్రతిష్టాత్మక లక్ష్యనిర్దేశం చేసుకున్నామని వెల్లడించారు. పునరాధీన చట్రం, సువికల్ప్‌ డిజిటల్ వేదిక, ఏఆర్‌టీహెచ్‌ఏ చట్రం సహా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని సలహా కమిటీల సంప్రదింపులతో గనుల మూసివేతకు తమ మంత్రిత్వశాఖ ఒక సమగ్ర వ్యవస్థను రూపొందించిందని శ్రీ కిషన్‌ రెడ్డి తెలిపారు. అలాగే, మూసివేత కార్యకలాపాల్లో ప్రజా సంక్షేమం, సుస్థిరతకు ‘గనుల మూసివేత మార్గదర్శకాలు-2025’ ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన చెప్పారు. ఆమోదిత గని మూసివేత వ్యయంలో 25 శాతాన్ని తొలిసారి సామాజిక ప్రగతికి కేటాయిస్తున్నామని తెలిపారు. తద్వారా రాబోయే దశాబ్దంలో దాదాపు ₹10,000 కోట్ల పెట్టుబడి సామర్థ్యాన్ని సృష్టించగల అవకాశం ఉందని మంత్రి వివరించారు. శాస్త్రీయ-ప్రగతిశీల విధానాల్లో గనుల మూసివేత కోసం ప్రభుత్వం 5 బిలియన్ డాలర్ల (దాదాపు ₹40,000 కోట్ల)కు పైగా సొమ్ముతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. పర్యావరణ బాధ్యత సహిత తవ్వకం, పర్యావరణ పునరుద్ధరణ, మైనింగ్ ప్రభావిత ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వ దీర్ఘకాలిక నిబద్ధతకు ఇదొక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత వల్ల ఒనగూడే పరిణామాత్మక సామర్థ్యాన్ని శ్రీ కిషన్‌ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా పునరాధీనం చేసుకున్న గనుల భూములను పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ పర్యాటకం, జల సంరక్షణ, వ్యవసాయం, సామాజిక మౌలిక సదుపాయాల నిర్మాణం, సుస్థిర జీవనోపాధి కల్పన తదితరాల కోసం వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బొకారో, బిశ్రాంపూర్, వివేక్‌నగర్ సౌరశక్తి ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తుండటం ఇందుకు నిదర్శనమని ఆయన ఉదాహరించారు. ప్రపంచ ఉత్తమ పద్ధతులను.. ముఖ్యంగా గనుల మూసివేత-సముచిత మార్పులో జర్మనీ అనుభవాన్ని మంత్రి ప్రస్తావించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, ‘జీఐజెడ్’ మధ్య ఒప్పందంతో ఆ సంస్థ అనుభవాన్ని భారత్‌లో సద్వినియోగం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక భాగస్వామ్యం, ఆర్థిక అవకాశాలను ఏకీకృతం చేస్తూ భారతీయ గనుల మూసివేత నమూనాను రూపొందిస్తామని తెలిపారు. ఈ మేరకు జర్మనీ నైపుణ్యాన్ని భారత్‌ విధాన నాయకత్వం, విస్తృతి, అమలు సామర్థ్యంతో సమ్మిళితం చేస్తామని పేర్కొన్నారు. గనుల మూసివేత విజయవంతం కావడంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పౌర సమాజం, స్థానిక సంఘాలు సహా అంతర్జాతీయ భాగస్వాముల సమష్టి కృషి అవశ్యమని ఆయన స్పష్టం చేశారు. తద్వారా మూసివేసిన ప్రతి గనిని భావితరాల ఆశలు, ఆకాంక్షలు, అవకాశాలు, శ్రేయస్సుకు పునాదిగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

అనంతరం మరో మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ- “గని మూసివేత అనే పదాన్ని ‘సంపన్న గని’ మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది” అని వ్యాఖ్యానించారు. శాస్త్రీయంగా గనుల మూసివేతలో బొగ్గు మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలను ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 42 బొగ్గు గనులను శాస్త్రీయంగా మూసివేయడం వల్ల పర్యావరణ పునరుద్ధరణ, అటవీకరణ, జల సంరక్షణతోపాటు పునరుత్పాదక ఇంధనం, ఇతర సుస్థిర సమాజ కేంద్రక కార్యక్రమాల ద్వారా ఆ భూములు ఉత్పాదక ఆస్తులుగా మారిన తీరు స్పష్టమవుతున్నదని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాలను ఇలా సంపదగా మార్చడం వర్తుల ఆర్థిక వ్యవస్థ సూత్రాలను ప్రతిబింబిస్తున్నదని అభిప్రాయపడ్డారు. శాస్త్రీయంగా గనుల మూసివేత కార్యకలాపాల్లో భారత్-జర్మనీ భాగస్వామ్యాన్ని, ప్రైవేట్ రంగ భాగస్వామ్య విస్తృతిని అభినందిస్తూ- 2070నాటికి నికరశూన్య ఉద్గార లక్ష్య సాధన దిశగా భారత్‌ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

 

బొగ్గు శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్‌ చంద్ర దూబే ప్రసంగిస్తూ- గనుల తవ్వకం ప్రయోజనాలు బొగ్గు ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకుండా, ఆ నిక్షేపాలుగల ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను అర్థవంతంగా మెరుగుపరచేలా చూడటానికి తమ శాఖ కట్టుబడి ఉందని చెప్పారు. పర్యావరణ పునరుద్ధరణ, సామాజిక-ఆర్థిక అభివృద్ధి రెండూ ఏకకాలంలో సాగాలనే సూత్రం ప్రాతిపదికగానే శాస్త్రీయ విధానంలో గనుల మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇండో-జర్మన్ సాంకేతిక సహకారాన్ని ప్రస్తావిస్తూ- ఈ భాగస్వామ్యంతో సంస్థాగత సామర్థ్యం బలోపేతం కాగలదని, ప్రపంచవ్యాప్త నైపుణ్య ఆదానప్రదాన సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. అలాగే, గనుల మూసివేత మాత్రమేగాక మైనింగ్ అనంతర సుస్థిర ప్రగతి దిశగా ఉత్తమ పద్ధతుల అనుసరణకు తోడ్పడుతుందని చెప్పారు. తద్వారా మూసివేసిన గనులను పర్యావరణ పునరుద్ధరణ, సుస్థిర జీవనోపాధి, దీర్ఘకాలిక ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించే ఆస్తులుగా మార్చే వీలుంటుందని ఆయన వివరించారు.

 

ఈ సందర్భంగా కోల్ నీర్, ఝరియా బృహత్ప్రణాళిక కింద త్రైపాక్షిక అవగాహన ఒప్పందాల ప్రాధాన్యాన్ని శ్రీ దూబే ప్రముఖంగా ప్రస్తావించారు. సుస్థిర మైనింగ్ విధానాలను విస్పష్ట సామాజిక ప్రయోజనాలుగా మలచడంలో తమ శాఖ నిబద్ధతను ఇవి చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోల్ నీర్ కార్యక్రమం ద్వారా స్థానిక స్వయం సహాయక బృందాల... ముఖ్యంగా మహిళల చురుకైన భాగస్వామ్యంతో సురక్షిత తాగునీటి లభ్యత మెరుగుపడుతుందని చెప్పారు. దీంతోపాటు జల వనరుల సమర్థ నిర్వహణకు ప్రోత్సాహం, జీవనోపాధి అవకాశాల కల్పనకు వీలుంటుందన్నారు. ఇక ఝరియా కార్యక్రమం పునరావాసానికి తోడు పరిశ్రమలతో ముడిపడిన నైపుణ్యాభివృద్ధి-ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, ఆ కుటుంబాలకు దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక సాధికారతనిస్తుందని తెలిపారు.

ఆ తర్వాత బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ- గనుల తవ్వకం ప్రాంతాలలో అభివృద్ధికి ప్రజలు-వారి జీవితాలే కేంద్రకం కావాలని స్పష్టం చేశారు. గనుల తవ్వకం ఎట్టి పరిస్థితులలోనూ మనస్సాక్షికి అనుగుణంగానే సాగాలని ఆయన దృఢంగా అభిప్రాయపడ్డారు. గనుల జీవిత చక్రంలో మూసివేత ఓ కీలక దశ కాగా, బాధ్యతాయుత వనరుల వెలికితీత అనంతరం దీర్ఘకాలిక పర్యావరణ పునరుద్ధరణ, భూమి పునరుపయోగం, సుస్థిర సమాజ ప్రగతిగా అది పరిణామం చెందాలని తెలిపారు. గని మూసివేతను ఒక నియంత్రణ నిబంధన స్థాయి నుంచి ప్రణాళికబద్ధ, ప్రజా కేంద్రక ప్రక్రియగా బొగ్గు మంత్రిత్వశాఖ మార్చివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గని మూసివేత మార్గదర్శకాలు-2025, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ రూపొందించిన సమగ్ర చట్రాలు డిజిటల్ ఉపకరణాల ద్వారా స్పష్టమైన నిర్దేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. గని మూసివేత ప్రణాళికలోని ప్రతి దశలోనూ పర్యావరణ పునరుద్ధరణ, సమాజ భాగస్వామ్యం, భవిష్యత్ భూ వినియోగం ఏకీకృతమయ్యేలా ఇవన్నీ పర్యవేక్షక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. గనుల మూసివేతపై ఇండో-జర్మన్ సాంకేతిక సహకార ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని ఈ సందర్భంగా శ్రీ దత్‌ ప్రస్తావించారు. జర్మనీ ప్రభుత్వం, ఐరోపా సమాఖ్యల నుంచి 10 మిలియన్ యూరోల ఆర్థిక సహాయం లభించడాన్ని గుర్తుచేశారు. శాస్త్రీయంగా గనుల మూసివేతలో భారత్‌ అంతర్జాతీయ స్థాయి ఉత్తమ విధానాలను అనుసరించేందుకు ఈ సాయం తోడ్పడుతుందని చెప్పారు. అలాగే, మూసివేతను గని కార్యకలాపాల ముగింపుగా కాకుండా పర్యావరణ పరిరక్షణకు, ప్రజల-స్థానిక సమాజాల ప్రగతి దిశగా కొత్త అవకాశాల సృష్టికి దోహదం చేసే ఉత్తమ ప్రక్రియగా పరిగణించే ఉమ్మడి దృక్పథాన్ని ఇది ప్రోది చేస్తుందన్నారు.

 

గనుల తవ్వకానంతర సమగ్రాభివృద్ధికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన ఝరియా బృహత్ప్రణాళిక పునరావాసానికే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి ద్వారా సుస్థిర జీవనోపాధి కల్పనకు దోహదం చేస్తుందన్నారు. ఆ మేరకు పునరావాస కుటుంబాల కోసం ఒక ఉత్పాదక సంసిద్ధ జౌళి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఏటా దాదాపు 300 లక్షల కిలోలీటర్ల శుద్ధి చేసిన గనుల నీటి సరఫరాలో బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థల విశిష్ట పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీనివల్ల చెన్నైకి తాగునీటి సరఫరా సహా సుమారు 3 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కోల్ నీర్ ప్లాంట్ల ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ- గనుల వ్యర్థ జలాలను సమీపంలోని సమాజాలకు శుద్ధి చేసిన సురక్షిత నీరుగా అందించడం ఎలాగో ఈ కార్యక్రమం వివరిస్తుందన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలు, వనరుల సుస్థిర నిర్వహణ, సామాజిక సంక్షేమంపై మంత్రిత్వశాఖ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

 

భారత్‌, భూటాన్‌ దేశాల జర్మనీ రాయబారి గౌరవనీయ డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ ప్రసంగిస్తూ- సుస్థిర ప్రగతిని కొనసాగించడంలో భారత్-జర్మనీ ప్రస్తుత భాగస్వామ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. శాస్త్రీయ విధానంలో గనుల మూసివేత, వాటి సుస్థిర పునర్వినియోగానికి తగిన సాంకేతిక నైపుణ్యం, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానానికి బొగ్గు మంత్రిత్వ శాఖ, ‘జీఐజెడ్’ల మధ్య ఒప్పందం తోడ్పడుతుందని చెప్పారు. అలాగే, గనుల ప్రాంతాల్లో సముచిత, సుస్థిర మార్పుల దిశగా ఇండో-జర్మన్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో ఐరోపా సమాఖ్య ప్రతినిధి బృందం డిప్యూటీ హెడ్ డాక్టర్ ఈవా సువారా మాట్లాడుతూ- ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవం, సుస్థిర ప్రగతిపై సంయుక్త నిబద్ధత ప్రాతిపదికగా భారత్‌-ఈయూ భాగస్వామ్యం కొనసాగుతున్నదని చెప్పారు. తవ్వకం అనంతరం గనుల మూసివేతలో భారత్‌ అనుసరిస్తున్న సుస్థిర పద్ధతులు ప్రభుత్వ నిబద్ధతతోపాటు దూరదృష్టిగల బాధ్యతాయుత విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. గనుల మూసివేతకు దీర్ఘకాలిక ప్రణాళిక, భాగస్వాములతో చురుగ్గా సంప్రదింపులు, నైపుణ్య-పునశ్చరణ శిక్షణలో పెట్టుబడి, భూమి పునరుద్ధరణ సహా ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, సమ్మిళితంగా ఉండేలా దృఢమైన నిబద్ధత కూడా అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేటి ఒప్పందాన్ని కీలక, ఆచరణాత్మక మలుపుగా అభివర్ణించారు. ఉమ్మడి ఆశయానికి ఇదొక నిర్దిష్ట రూపమిస్తూ, సాంకేతిక సహాయం, సామర్థ్య పెంపు ద్వారా విస్పష్ట సహకారానికి పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు.

 

ప్రగతిశీల విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు, సంస్థాగత భాగస్వామ్యాలు, సమాజ కేంద్రక కార్యక్రమాల ద్వారా శాస్త్రీయంగా గనుల మూసివేతను పటిష్ఠంగా కొనసాగించడంలో బొగ్గు మంత్రిత్వశాఖ నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది. బాధ్యతాయుత మైనింగ్, పర్యావరణ పునరుద్ధరణ, గనుల తవ్వకానంతర సుస్థిర ప్రగతి నిర్దేశిత భారత్‌ చట్రాన్ని ‘ఆరోహ్‌’ వంటి అధ్యయన కార్యకలాపాల ద్వారా బలోపేతం చేస్తూ, వికసిత భారత్‌ సంకల్ప సాకారానికి తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తోంది.

 

*****


(रिलीज़ आईडी: 2288118) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी