రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశోధన, ఆవిష్కరణల నిమిత్తం జాతీయ హైవే డేటాను ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో పంచుకోనున్న ఎన్‌హెచ్ఏఐ


ఈ నమూనా డేటా పరిశోధనా సంస్థలు పైలట్ ప్రాజెక్టులను చేపట్టడానికి, పద్ధతులను ధృవీకరించడానికి, పరిశోధన ఫలితాల ప్రయోజనాలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది

2,000 కి.మీ జాతీయ రహదారులకు సంబంధించిన ప్రామాణిక నమూనా డేటాను అనుమతి పొందిన పరిశోధనా ప్రాజెక్టులకు అందజేస్తారు

प्रविष्टि तिथि: 21 JUL 2026 4:00PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో జాతీయ రహదారి మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలకు సంబంధించిన సమాచార భాగస్వామ్యాన్ని సులభతరం చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ ఓ సమగ్ర నియమావళిని ప్రవేశపెట్టింది. ఇది పరిశోధన, సాంకేతిక ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ఎన్‌హెచ్ఏఐకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. సహకార విద్యా పరిశోధనను ప్రారంభించడానికి అవసరమైన సమయాన్ని తగ్గించడం ద్వారా విధానపరమైన సామర్థ్యాన్ని ఈ నియమమావళి మెరుగుపరుస్తుంది, అదే సమయంలో సురక్షితమైన, మరింత మన్నికైన, తక్కువ వ్యయంతో కూడిన జాతీయ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), సీఎస్ఐఆర్ – సెంట్రల్ రోడ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) లాంటి దేశంలోనే అగ్రగామి ప్రభుత్వ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటారు. స్థానిక పరిస్థితులు, ట్రాఫిక్ లోడింగ్, కార్యాచరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన, శాస్త్రీయంగా ధ్రువీకరించిన పేవ్‌మెంట్ క్షీణత నమూనాలు (పీడీఎంలు), అధునాతన ట్రాఫిక్ విశ్లేషణల అభివృద్ధికి మద్దతివ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

గతంలో ప్రతి పరిశోధనా ప్రతిపాదనకూ విడివిడిగా అవగాహనా ఒప్పందాలను (ఎంవోయూ) కుదుర్చుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో చేపట్టిన ప్రధాన మార్పును ఈ కార్యక్రమం సూచిస్తుంది. మునపటి పద్ధతిలో విస్తృతమైన న్యాయ పరిశీలన, బహుళ సంస్థల సంప్రదింపులు అవసరం అయ్యేవి. సవరించిన నియమావళి ఆధారంగా గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థల నుంచి వచ్చే అర్హత కలిగిన అభ్యర్థనలను ఎన్‌హెచ్ఏఐలోని ఒక ప్రత్యేక కేంద్రీకృత యంత్రాంగం స్వీకరించి, మూల్యాంకనం చేస్తుంది. దీనివల్ల వేగంగా ఆమోదం లభించడంతో పాటు, సకాలంలో పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది.

సహకారాత్మక పరిశోధనకు అవసరమైన నిర్మాణాత్మక విధానాన్ని డేటా షేరింగ్ నియమావళి అందిస్తుంది. ఆమోదం పొందిన పరిశోధనా ప్రాజెక్టులకు తొలుత 2,000 కిలోమీటర్ల వరకు విస్తరించిన జాతీయ రహదారులకు సంబంధించిన ప్రామాణిక నమూనా డేటా బ్లాక్ అందజేస్తారు. ఈ నమూనా డేటా పైలట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి, పద్ధతులను ధృవీకరించడానికి, పరిశోధన ఫలితాల ప్రయోజనాలను ప్రదర్శించే వీలును సంస్థలకు కల్పిస్తుంది.

వీటికి అదనంగా, డేటా భద్రతనూ, గోప్యతనూ నిర్ధారించేందుకు అవసరమైన పటిష్టమైన రక్షణ చర్యలు  నియమావళిలో ఉన్నాయి. ఈ పరిశోధనల్లో పాల్గొనే సంస్థలు ప్రామాణిక గోప్యతా ఒప్పందం (ఎన్‌డీఏ)పై సంతకం చేయాల్సి ఉంటుంది. తద్వారా తమ సొంత పరిశోధన, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే డేటాను ఉపయోగించుకొనే వీలు సంస్థలకు ఉంటుంది. అలాగే డేటాను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని లేదా మూడో పక్షానికి బహిర్గతం చేయడాన్ని నిషేధిస్తుంది. ప్రాజెక్టు కాల వ్యవధిలోనూ, అనంతరం మూడేళ్ల పాటు ఈ గోప్యతా నియమాలు అమల్లో ఉంటాయి. ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న పరిశోధకులు, విద్యార్థులు, ఇతర విద్యాసంస్థల నుంచి సహకరించే నిపుణులు కూడా ఈ గోప్యతా నియమాలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి.

అంతేకాకుండా, పరిశోధనల ఆధారంగా దక్కించుకొనే మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్), పేటెంట్లు లేదా కాపీరైట్‌లు... ఎన్‌హెచ్ఏఐ, సంబంధిత పరిశోధనా సంస్థల ఉమ్మడి అధీనంలో ఉంటాయి. ఎన్‌హెచ్ఏఐ నుంచి అనుమతి పొందిన అనంతరం పరిశోధనా ఫలితాలను ప్రముఖ విద్యా జర్నళ్లలో ప్రచురించేలా విద్యా సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా వ్యూహాత్మక మౌలిక సదుపాయాల డేటాను సక్రమంగా నిర్వహిస్తూనే.. ఆవిష్కరణలను కూడా ప్రోత్సహిస్తారు. 

పైలట్ ప్రాజెక్టులు విజవయవంతంగా పూర్తయిన అనంతరం, జాతీయ రహదారుల ప్రణాళిక, రూపకల్పన, నిర్వహణలో ఆచరణాత్మక వినియోగాన్ని ప్రదర్శించే ధ్రువీకృత పేవ్‌మెంట్ క్షీణతా నమూనాలు (పీడీఎంలు), ఇతర పరిశోధనా ఫలితాలను పూర్తి స్థాయి డేటాసెట్ల ఆధారంగా మూల్యాంకనం చేస్తారు. గణనీయమైన కార్యాచరణ విలువతో కూడిన నిరూపితమైన పరిష్కారాలను అధికారిక ఎంవోయూల పరిధిలో నిర్మాణాత్మకమైన దీర్ఘకాల సహకారాల ద్వారా జాతీయ రహదారుల వ్యవస్థలో విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు పరిగణిస్తారు.

దేశవ్యాప్తంగా జాతీయ రహదారి వ్యవస్థ అభివృద్ధి, నిర్వహణలో పరిశోధన, ఆవిష్కరణ, డేటా ఆధారిత నిర్ణయాలను ఏకీకృతం చేయడానికి ఎన్‌హెచ్ఏఐ చేస్తున్న కృషిని ఈ నియమావళి ప్రతిబింబిస్తుంది.  

 

***


(रिलीज़ आईडी: 2287280) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali