గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎనిమిదో విడత గనుల వేలాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే


కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించిన 20 బ్లాకుల వేలం

నాడు పోస్టు చేయడమైనది: 15 JUL 2026 8:55PM by PIB Hyderabad

ఇండియా మైనింగ్ వీక్-2026 సన్నాహక కార్యక్రమంలో భాగంగా కీలకమైన, వ్యూహాత్మకమైన ఖనిజ బ్లాక్‌ల ఈ-వేలం ఎనిమిదో విడతను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే ప్రారంభించారు. భారత దేశంలో శుద్ధ ఇంధనం, అధునాతన తయారీ, రక్షణ, ఏరోస్పేస్, ఇతర వ్యూహాత్మక రంగాలకు అవసరమైన కీలకమైన ఖనిజాల భద్రతను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పటిష్టమైన ఖనిజ సరఫరా వ్యవస్థలను నిర్మించడంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం ఒకటి. భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్రాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), మేధావులు, ప్రోస్పెక్టివ్ బిడ్డర్లు, విలేకరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

image.png

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి ప్రసంగించారు. దేశ మైనింగ్ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి విధాన రూపకర్తలనూ, పరిశ్రమ నాయకులనూ, పెట్టుబడిదారులనూ, సాంకేతిక సేవలు అందించేవారినీ, విద్యావేత్తలనూ ఒక్కచోట చేర్చే ప్రధాన వేదిక ప్రారంభాన్ని ఇండియా మైనింగ్ వీక్ సూచిస్తుందన్నారు. ఖనిజ భద్రతను బలోపేతం చేయడంలోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, అంతర్జాతీయంగా పోటీనిచ్చేలా, భవిష్యత్తు అవసరాలకు తగిన మైనింగ్ వ్యవస్థను నిర్మించేలా దేశ ఖనిజ సామర్థ్యాన్ని వెలికి తీయడంలోనూ ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ఈ కీలకమైన, వ్యూహాత్మకమైన ఖనిజ బ్లాకుల ఎనిమిదో విడత ప్రారంభం ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు.

దేశ నిర్మాణంలోనూ, ఇంధన భద్రత, వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించడంలోనూ మైనింగ్ కీలకంగా నిలుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే అన్నారు. వాణిజ్య మైనింగ్, డిజిటల్ గవర్నెన్స్, ప్రైవేటు రంగ విస్తృత భాగస్వామ్యంతో సహా ఈ రంగంలో చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి ఆయన వివరించారు.  ఈ సంస్కరణలు పారదర్శకతనూ, సామర్థ్యాన్నీ, సుస్థిర వృద్ధినీ ప్రోత్సహిస్తున్నాయన్నారు. అదే సమయంలో మైనింగ్ ద్వారా లభించే ప్రయోజనాలు స్థానిక సమాజాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నాయని తెలియజేశారు.

భారత దేశ మైనింగ్ రంగం సామర్థ్యాన్ని ప్రదర్శించడానికీ, సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించడానికీ, ప్రభుత్వాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించే వార్షిక అంతర్జాతీయ వేదికగా ఇండియా మైనింగ్ వీక్ కార్యక్రమాన్ని పరిగణిస్తున్నట్లు గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ అన్నారు. ఈ ఎనిమిదో విడత వేలంలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించిన 20 బ్లాకులున్నాయని వెల్లడించారు. దీంతో మొత్తం కీలక ఖనిజాల బ్లాకుల సంఖ్య 88కు చేరుకున్నాయనీ, వాటిలో 56 బ్లాకుల వేలాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఇది భారతదేశంలోని సంస్కరణల ఆధారిత మైనింగ్ రంగంపై పరిశ్రమలకు పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తుందని చెప్పారు.

ఎనిమిదో విడతలో 20 కీలక, వ్యూహత్మక ఖనిజ బ్లాకులను వేలానికి ఉంచారు. వీటిలో కొత్తగా గుర్తించిన 13  ఖనిజ బ్లాకులున్నాయి. ఖనిజ (వేలం) నియమాలకు అనుగుణంగా మరో ఏడు బ్లాకులను రెండోసారి వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వేలం వేస్తున్న బ్లాకులు వివరాలు:

రాష్ట్రం

బ్లాకుల సంఖ్య

ఖనిజాలు

ఆంధ్రప్రదేశ్

2

మాలిబ్డినమ్, గ్రాఫైట్

బీహార్

3

గ్లకోనైట్, వెనాడియం– బేరింగ్ మాగ్నటైట్–ఇల్మెనైట్

ఛత్తీస్‌ఘడ్

5

గ్లకోనైట్, వెనాడియం, గాలియం, టైటానియం, అరుదైన ఖనిజాలు (ఆర్ఈఈ), బాక్సైట్, అల్యూమినస్ లాటరైట్, పాస్ఫోరైట్, సున్నపురాయి

మహారాష్ట్ర

2

అరుదైన ఖనిజాలు (ఆర్ఈఈ), వనాడియం, గాలియం, టైటానియం, బాక్సైట్, అల్యూమినస్ లాటరైట్

ఒడిశా

3

వెనాడియం, టైటానియం, మాంగనీస్ గ్రాఫైట్

పంజాబ్

1

పొటాష్, హాలైట్

రాజస్థాన్

2

పొటాష్, హాలైట్, టంగ్‌స్టన్

తెలంగాణ

1

టైటానియం, వెనాడియం, గాలియం, అల్యూమినస్ లాటరైట్

పశ్చిమ బెంగాల్

1

అరుదైన లోహాలు (లిథియం, సీసియం, రుబీడియం)

 

శుద్ధ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలు, విద్యుత్ వాహన రంగం, అధునాతన తయారీ, ఎరువులు, రక్షణ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఇతర వ్యూహాత్మక పరిశ్రమలకు అవసరమైన కీలకమైన, వ్యూహాత్మకమైన ఖనిజాలను అందించే బ్లాకులను ఈ విడతలో వేలం వేస్తున్నారు. దీని ద్వారా భారత దేశ ఖనిజ భద్రత బలోపేతమవుతుందనీ, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందనీ, దేశంలో దీర్ఘకాల పారిశ్రామిక వృద్ధికీ, ఇంధన పరవర్తనకు మద్దతు లభిస్తుందనీ అంచనా వేస్తున్నారు.

టెండర్ ప్రతాల విక్రయాలు 2026 జులై 15న ప్రారంభమవుతాయి. టెండరు పత్రాలను కొనుగోలు చేయడానికి చివరి తేదీ 2026 సెప్టెంబర్ 14 (సాయంత్రం 5 గంటలు). బిడ్లను (సాంకేతిక బిడ్, ప్రతిపాదిత ప్రారంభ ధర) దాఖలు చేయడానికి చివరి తేదీ 2026 సెప్టెంబరు 21 (సాయంత్రం 5 గంటలు)

ఈ వేలాన్ని పారదర్శకమైన రెండంచెల అసెండింగ్ ఫార్వర్డ్ పద్దతిని అనుసరిస్తూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. రవాణా చేసిన ఖనిజం విలువపై అత్యధిక శాతం కోట్ చేసిన వారిని ప్రాధాన్య బిడ్డర్‌గా ఎంపిక చేస్తారు. బ్లాకులు, వేలం షరతులు, గడువులకు సంబంధించిన పూర్తి సమాచారం ఎంఎస్‌టీసీ ఈ– ఆక్షన్ వెబ్‌సైట్లో ఉంటుంది.

https://www.mstcecommerce.com/auctionhome/mlcln/

ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభించడం ద్వారా అన్వేషణకూ, తవ్వకానికీ అందుబాటులో ఉన్న కీలకమైన, వ్యూహాత్మకమైన ఖనిజ బ్లాకుల వ్యవస్థను గనుల మంత్రిత్వ శాఖ మరింత బలోపేతం చేసింది. వికసిత్ భారత్ – 2047 లక్ష్యానికి అనుగుణంగా దేశీయంగా ఖనిజ భద్రతను బలోపేతం చేయడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పటిష్టమైన, అంతర్జాతీయంగా పోటీనిచ్చే ఖనిజ రంగాన్ని నిర్మించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ కార్యక్రమం తెలియజేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2285292) సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी