సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌సీఎస్‌సీ ద్వారా గత రెండేళ్లలో పరిష్కారమైన కేసులు 60,000కు మాటే: ఎన్‌సీఎస్‌సీ ఛైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా


• ఆధునికీకరించిన ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఛైర్మన్

• ఎన్‌సీఎస్‌సీ హైదరాబాద్ కార్యాలయ పరిధిలో 10,800కు పైగా ఫిర్యాదుల పరిష్కారం, బాధితులకు రూ.33.8 కోట్ల పరిహారం

प्रविष्टि तिथि: 13 JUL 2026 5:03PM by PIB Hyderabad

గడచిన రెండేళ్ల కాలంలో 60,000కు పైగా కేసులను పరిష్కరించి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ) చరిత్ర సృష్టించిందని ఎన్‌సీఎస్‌సీ ఛైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా అన్నారు. ఈ రోజు హైదరాబాద్ కవాడిగూడలో ఉన్న సీజీవో టవర్స్‌లో ఆధునికీకరించిన కమిషన్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీఎస్‌సీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాంచందర్, ఎన్‌సీఎస్‌సీ కార్యదర్శి శ్రీ గుడే శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీఎస్‌సీ ఛైర్మన్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు న్యాయాన్ని అందించేందుకు, వారి హక్కులను పరరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌సీఎస్‌సీ కార్యాలయాలు కృషి చేస్తున్నాయని తెలియజేశారు. రాజ్యాంగంలోని 338 అధికరణకు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కమిషన్ పనిచేస్తోందని తెలియజేశారు. గత 75 ఏళ్లుగా షెడ్యూలు కులాల హక్కుల పరిరక్షణకూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషన్ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా గడచిన రెండేళ్లలో 60,000కు పైగా కేసులను పరిష్కరించామనీ, ఇది కమిషన్ చరిత్రలోనే అత్యధికమని  ఆయన తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, హక్కుల రక్షణ ముఖ్యమైన అంశాలని ఛైర్మన్ స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదుదారునికి సకాలంలో న్యాయం అందించాలనే డాక్టర్ అంబేద్కర్ కలను సాకారం చేసేందుకు కమిషన్ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

జవాబుదారీతనాన్ని పెంచేందుకు కమిషన్లో అమలు చేస్తున్న బలమైన, చట్టపరమైన యంత్రాంగాల గురించి ఎన్‌సీఎస్‌సీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాంచందర్ వివరించారు. అవసరమైనప్పుడు నోటీసులను, సమన్లను జారీ చేయడానికీ, ఆదేశాలను పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడానికీ ఎన్‌సీఎస్‌సీకి పూర్తి అధికారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రస్తుతం అందుతున్న ఆర్థిక సాయం గురించి మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ అభివృద్ధికి, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని ప్రజా ప్రతినిధులు, విధాన రూపకర్తలను ఆయన కోరారు. సమస్యలను పరిష్కరించడంలో, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఫిర్యాదు పరిష్కారంలో జాప్యాన్ని తొలగించడానికీ, సామర్థ్యాన్ని విస్తరించడానికీ డిజిటల్ సాధనాలను, ఆధునిక మౌలిక వసతులను ఉపయోగించుకొనేందుకు కమిషన్ కట్టుబడి ఉందని ఎన్‌సీఎస్‌సీ కార్యదర్శి గుడే శ్రీనివాస్ తెలియజేశారు. అసలైన లబ్ధిదారులకు ప్రయోజనాలు, చట్టపరమైన రక్షణ అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య విస్తృత సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ శాఖ పనితీరు గురించి ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ జీ సునీల్ కుమార్ బాబు వివరించారు. 2024–2026 మధ్య కాలంలో అత్యుతమ పనితీరు కనబరిచిన శాఖల్లో హైదరాబాద్ ఒకటని ఆయన వెల్లడించారు. ఈ సమీక్షా కాలంలో 10,853 ఫిర్యాదులను పరిష్కరించి.. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడడంలో హైదరాబాద్ కార్యాలయం కీలకపాత్ర పోషించింది. అదేవిధంగా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని నిబంధనల ప్రకారం బాధితులకు రూ.33.80 కోట్ల నష్టపరిహారాన్ని అందజేసింది. షెడ్యూలు కులాల హక్కుల తీవ్ర ఉల్లంఘనలకు సంబంధించిన 177 సుమోటో కేసులను నమోదు చేయడంతో పాటు, ఫిర్యాదుదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో 127 చట్టబద్ధమైన విచారణలను కూడా నిర్వహించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, వివిధ షెడ్యూలు కుల సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***


(रिलीज़ आईडी: 2284221) आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English