గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి "వికసిత్ భారత్ జీ-రామ్ జీ - గ్రామీణ్" జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నాడు పోస్టు చేయడమైనది: 02 JUL 2026 7:03PM by PIB Vijayawada

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామం నుంచి “వికసిత్ భారత్– జీ రామ్ జీ యోజన” ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, శ్రీ కమలేష్ పాశ్వాన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న పేద కూలీలు, రైతులు, గ్రామాలకు ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి కోసం భారీ ఆర్థిక కేటాయింపులు, పారదర్శకమైన వ్యవస్థతో కూడిన ఒక కొత్త నమూనాను ఆవిష్కరించారు 

 

శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరిస్తూ ప్రారంభమైన  వీబీ- జీ రామ్ జీ​​

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ "నమః వెంకటేశాయః", "గోవిందా, గోవిందా" నినాదాలతో ప్రారంభిస్తూ.. ఈ పవిత్ర భూమి నుంచి వికసిత్ భారత్ జీ-రామ్ జీ పథకాన్ని అమలు కావడం పేదలు, కార్మికులపై భగవంతుడి ఆశీస్సుల అందినట్లే అన్నారు. దేశంలో ఏ పేద కూలీ కూడా పనిలేకుండా ఉండకూడదని, ప్రతి చేతికి పని, ప్రతి వ్యక్తికి ఆహారం లభించాలని ఆయన ప్రార్థించారు. ఈ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో సాకారం చేస్తున్నందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి చౌహన్ ధన్యవాదాలు తెలిపారు.

 

ఎంజీ-నరేగా కు మించి వీబీ జీ-రామ్ జీ.. ఉపాధి 100 రోజుల నుంచి 125 రోజులకు పెంపు

యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎంఎన్ఆర్ఈజీఏ కేవలం 100 రోజుల ఉపాధికి మాత్రమే హామీ ఇచ్చిందని.. నేడు 'వికసిత్ భారత్-జీ రామ్ జీ' పథకం 125 రోజుల పనికి హామీ ఇస్తుందని తెలిపారు. ఇది కేవలం పనిదినాల పెరుగుదల మాత్రమే కాదని, ఆలోచనా విధానంలో మార్పు అని, ఎవరూ పనిలేకుండా మిగిలిపోకూడదనేదే లక్ష్యమని అన్నారు. ఈ కొత్త పథకం అమలులోకి వచ్చిన మొదటి రోజే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు పని పొందారని, ఎంఎన్ఆర్ఈజీఏ కు మరింత మెరుగైన రీతిలో  'వికసిత్ భారత్-జీ రామ్ జీ'గా అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. 

 

మొదటి సంవత్సరంలోనే రూ.1.51 లక్షల కోట్ల కేటాయింపు, 5 సంవత్సరాలలో రూ.7.5 లక్షల కోట్ల లక్ష్యం​​​​

కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్, ఈ పథక ఆర్థిక అంశాలను వివరిస్తూ.. వికసిత్ భారత్-జీ రామ్ జీ పథకంలో మొదటి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.95,000 కోట్లకు పైగా ఉంటుందని, రాష్ట్రాల 40% వాటాతో కలిపి వార్షిక వ్యయం సుమారు రూ.1.51 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం కింద మొత్తం రూ.7.5 లక్షల కోట్ల వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ నిధులు దేశవ్యాప్తంగా 2.86 లక్షల పంచాయతీలకు చేరుతుంది, దీని ద్వారా ఒక్కో పంచాయతీకి ఏడాదికి సగటున రూ.2 కోట్లకు పైగా లభిస్తుందని, ఇది గ్రామాలలో ఉపాధిని పెంచడంతో పాటు శాశ్వత ఆస్తులను సృష్టిస్తుందని అన్నారు. 

 

ఉద్యోగానికి చట్టపరమైన హామీ – 15 రోజుల్లోపు పని, లేకపోతే నిరుద్యోగ భృతి

వికసిత్ భారత్-జీ రామ్ జీ పథకం కూలీల హక్కులకు చట్టబద్ధతను కల్పిస్తుందని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. పని కోరిన ఏ కార్మికుడికైనా 15 రోజుల్లోగా ఉపాధి కల్పించడం తప్పనిసరి. నిర్దేశించిన సమయంలోగా పని కల్పించని పక్షంలో, ఆ కార్మికుడికి నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్మికుల కష్టాన్ని ఇకపై ఎవరూ దోపిడీ చేయలేరని, దీర్ఘకాలంగా ఉన్న వేతనాల ఆలస్య సమస్యను పరిష్కరించేందుకు, ఈ పథకం కింద కార్మికులకు ఆలస్యమైన వేతనాలను వడ్డీతో సహా చెల్లిస్తారని వెల్లడించారు. దీనివల్ల కార్మికులు తమ శ్రమకు పూర్తి విలువ పొందుతారని, పేదల సేవే దైవారాధనగా భావించే 'మోదీ మంత్రం' క్షేత్రస్థాయిలో ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.

 

వ్యవస్థను బలోపేతం చేయడానికి 9 % పరిపాలనా ఖర్చులు , క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి వేతనం​​

ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పరిపాలనా వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీని కింద, గ్రామ ఉపాధి సహాయకులు, మేట్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది జీతభత్యాల కోసం రూ.13,000 కోట్లకు పైగా కేటాయించినట్లు తెలిపారు. గ్రామాల్లో కూలీలను, అభివృద్ధి పనులను పర్యవేక్షించే సిబ్బందికి సమాయానికి పూర్తి వేతనం అందడం ఎంతో ముఖ్యమన్నారు. అప్పుడే వారు తప్పుదోవ పట్టకుండా ఉంటారని, వ్యవస్థ బలంగా ఉంటుందని అన్నారు. ఈ విధంగా.. ఈ పథకం కార్మికులను, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

 గ్రామ నిర్ణయం గ్రామానిదే – గ్రామసభే పనులను నిర్ణయిస్తుంది​​

ఏ గ్రామంలో ఏ పని చేయాలో ఢిల్లీ నుంచో, అమరావతి నుంచో నిర్ణయించరని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. పనులను నిర్ణయించే అధికారం గ్రామ పంచాయతీ, గ్రామ సభకే ఉంటుందన్నారు. అంగన్‌వాడీ నిర్మించాలా, పాఠశాల, ఆసుపత్రి, రోడ్డు, వ్యవసాయ రహదారి, రైతు ఉత్పత్తిదారుల కార్యాలయం (FPO) కోసం నిర్మాణం, చెరువు, జాక్ డ్యామ్, ఆనకట్ట లేదా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే గోడ వంటివి నిర్మించుకోవాలా? వద్దా? అనేది గ్రామస్థులే స్వయంగా నిర్ణయించుకుంటారని అన్నారు. ఈ నిర్ణయాలన్నీ గ్రామంలోనే కొలువుదీరిన గ్రామసభ ద్వారా తీసుకుంటారని, గ్రామ నిర్ణయం గ్రామంలోనే తీసుకుంటారని, ఇదే జీ-రామ్ జీ యోజన ఆత్మ అని అన్నారు. 

వెనుకబడిన పంచాయతీలకు అదనపు సహాయం, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707 కోట్ల ప్రత్యేక కేటాయింపు​​​

ప్రగతిని వేగవంతం చేసేందుకు, రాష్ట్రాలు తమ పంచాయతీలను ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి, అభివృద్ధిలో వెనుకబడిన వాటికి మరింత నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ సూచించారు. దీనివల్ల అంతర్గత, వెనుకబడిన ప్రాంతాల్లోని గ్రామాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వికసిత్ భారత్-జీ రామ్ జీ యోజన కింద కేవలం తొమ్మిది నెలల్లోనే కేంద్రం రూ.7,707 కోట్ల ప్రత్యేక గ్రాంటును అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి ఈ ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలుపుతుందని, గ్రామాల్లో ఉపాధి, అభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 కొత్త వేతన ధరలు

ఏ రాష్ట్రంలోనూ ఇకపై వేతనాలు రూ.300 కంటే తక్కువ ఉండవని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేటును రూ.312 నుంచి రూ.315 మధ్య నిర్ణయించారు, తద్వారా కూలీలు తమ శ్రమకు పూర్తి విలువను పొందుతారని తెలిపారు.  

ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ రహదారుల శాఖకు భారీగా నిధులు – వేదికపై నుంచే ఆమోద పత్రాల అందజేత

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ మరియు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన-IV కింద ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాలు, గ్రామాలకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఆంధ్రప్రదేశ్‌కు 74,212 కొత్త పక్కా ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో అర్హులైన ప్రతీ పేద కుటుంబం మంచి గృహవసతిని పొందుతారని అన్నారు. ఇంకా పక్కా రోడ్ల సౌకర్యం లేని గ్రామాల ఆందోళనలను కూడా ఆయన ప్రస్తావించారు. అటువంటి ప్రాంతాలలో 146 కొత్త రోడ్లు, 19 వంతెనల నిర్మాణానికి మొత్తం రూ.422 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వేదికపై నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఈ ఆమోద పత్రాలను అందజేస్తూ, గ్రామాలు అభివృద్ధి చెందేకొద్దీ భారతదేశం మారుతుందని, ఆంధ్రప్రదేశ్ సమగ్ర గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి లోటు రానివ్వదని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.

 తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం – మార్కెట్ జోక్యం ద్వారా సరసమైన ధరలకు హామీ

ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ..  మామిడి ధరలు పడిపోవడం వల్ల రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని, అందువల్ల రైతులకు సరసమైన ధర లభించేలా, కూలీలకు మంచి వేతనాలు అందేలా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపురి మామిడిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. దీనితో పాటు, మామిడి తోటల ఉత్పాదకతను పెంచడానికి, మార్కెట్లో మెరుగైన రకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల బృందం రాష్ట్ర ప్రభుత్వ బృందంతో కలిసి డ్రాఫ్టింగ్ మరియు రకాల మార్పిడి పద్ధతులపై పనిచేస్తుందని ఆయన తెలియజేశారు.

 పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతిజ్ఞ

పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. తాను స్వయంగా ప్రతిరోజూ చెట్లు నాటుతానని, ప్రజలు కూడా తమ పుట్టినరోజున కనీసం ఒక చెట్టునైనా నాటాలని కోరారు. అభివృద్ధి చెందిన గ్రామం, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వేదికపై నుంచి ప్రజల చేత సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. 

వికసిత్ భారత్- జీ రామ్ జీ యోజన గ్రామాలు, గ్రామీణ జీవన ప్రమాణాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది

ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వికాసిత్ భారత్-జీ రామ్ జీ యోజన గ్రామాలలో మరియు గ్రామీణ జీవన ప్రమాణాలలో పరివర్తన తీసుకువచ్చే కార్యక్రమమని అభివర్ణించారు. గతంలో రాయలసీమ నుంచి ప్రారంభమైన ఎంఎన్ఆర్ఈజీఏ దేశానికి ఒక నమూనాని ఇచ్చిందని, ఇప్పుడు అదే ప్రాతిపదికన, మరింత శక్తివంతమైన రూపంలో వీబీ-జీ రామ్ జీ యోజనను ప్రారంభించామని, ఇది స్వర్ణాంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన భారత్ దిశగా ఒక పెద్ద ముందడుగని అన్నారు. 125 రోజుల ఉపాధి హామీతో పాటు, వ్యవసాయ రోడ్లు, చెరువులు, డ్రైనేజీ వంటి పనులు, భూమిలేని కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ద్వారా గ్రామీణ జీవన ప్రమాణాలు నేరుగా మెరుగుపడతాయని అన్నారు. 

డిజిటల్ పర్యవేక్షణ మోసాలను అడ్డుకట్ట , గ్రామ సభల ద్వారా అభివృద్ధి ప్రణాళికలు

ఈ కొత్త పథకంలో డిజిటల్ మాస్టర్ రోల్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, రియల్ టైమ్ పర్యవేక్షణ, జియో-ట్యాగింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పనులను పర్యవేక్షిస్తుందని శ్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. దీనివల్ల, పని చేయకుండా కాగితాల మీద లెక్కలు చూపించే పాత పద్ధతికి స్వస్తి కలుగుతుందని, నిధులు సరైన చోట ఖర్చు అవుతుందని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన గ్రామ సభలు, సీసీ రోడ్లు, గోశాలలు, నీటి ట్యాంకులు, పంపు పాండ్ లు, గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన రహదారులను ప్రస్తావిస్తూ, ఈ అనుభవాల ఆధారంగా వీబీ-జీ రామ్ జీ పథకాన్ని సాధ్యమైనంత ఉత్తమంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 

ఉద్యానవన కేంద్రం కోసం భారీ పెట్టుబడి​

రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తన దార్శనికతను ముఖ్యమంత్రి పంచుకున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్డు అనుసంధానం, గిడ్డంగులు, మౌలిక సదుపాయాల ద్వారా దేశంలో పండ్లు, ఉద్యానవన పంటలకు రాయలసీమను ఒక ప్రధాన కేంద్రంగా మార్చేందుకు, పూర్వోదయ కార్యక్రమం కింద సుమారు రూ.40,000 కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, సుమారు రూ.60,000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దార్శనికతను స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఒక నిర్ణయాత్మక అడుగుగా అభివర్ణిస్తూ, గ్రామీణ ఉపాధి, ఉద్యానవనం, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని వెల్లడించారు.  

అమరావతి, పోలవరం మరియు పరిశ్రమల పెట్టుబడులతో స్వర్ణాంధ్రప్రదేశ్

అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణిస్తూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని ప్రాజెక్ట్, పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్, ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మళ్లీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సరైన నాయకుడు, సరైన ప్రదేశం, సరైన సమయం – ఇదే నరేంద్ర మోదీ అని, 2047 నాటికి భారతదేశాన్ని నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పనులు వేగంగా పురోగమిస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మాట్లాడుతూ.. వీబీ జీ-రామ్ జీ యోజన కింద పనిదినాలను 100 నుంచి 125కు పెంచడమే కాకుండా, పని లభించని పక్షంలో నిరుద్యోగ భృతికి కూడా నిబంధన ఉందని అన్నారు. దీనివల్ల ప్రతి కార్మికుడికి పని లభిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ మాట్లాడుతూ, వీబీజీ రామ్ జీ యోజన అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది అవుతుందని అన్నారు. ఈ పథకం కింద 300కు పైగా రకాల పనులు ఉంటాయని, ఇవి గ్రామీణ భారతదేశాన్ని సాధికారత కల్పించి, సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రోహిత్ కన్సల్, సంయుక్త కార్యదర్శి రోహిణి ఆర్. భజిభకరే కూడా పాల్గొన్నారు.

 కేంద్రం మద్దతుతో ఆంధ్రప్రదేశ్ బలోపేతం​​​​​

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "శివరాజ్ జీ, మీ 49 ఏళ్ల ప్రజా జీవితం ప్రజా సేవకు, రైతుల పట్ల, గ్రామీణ భారతదేశం పట్ల మీకున్న అంకితభావానికి ప్రతీక. మీరు ఆరు సార్లు పార్లమెంట్ సభ్యునిగా, నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశానికి సేవ చేసి స్ఫూర్తిదాయకమైన ఆదర్శాన్ని నెలకొల్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మీరు చేసిన పోరాటం, మీరు జైలుపాలవడం మా అందరికీ స్ఫూర్తిదాయకం. మీ మార్గదర్శకత్వం, ప్రధానమంత్రి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి రూ.12,845 కోట్ల మంజూరైంది. మీ సహకారంతో రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కాగా, గిరిజన ప్రాంతాల్లో మొక్కల పెంపకంతో సహా అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు పురోగమించాయి. ఆర్జీఎస్ఏ జాతీయ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ 24వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది" అని అన్నారు. వీబీ-జీ రామ్ జీ జాతీయ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడం ద్వారా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవాంన్ని పెంచారని అన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో, ముఖ్యమంత్రి శ్రీ నాయుడు మరియు కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఫామ్ పాండ్ కార్యాచరణ స్థలానికి చేరుకుని పూజ, శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు. అనంతరం “మ్యాజిక్ డ్రెయిన్” ప్రదర్శనను వీక్షించి, ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాల ప్రదర్శనను సందర్శించారు.

 *****


(రిలీజ్ ఐడి: 2280493) సందర్శకుల సూచీ సంఖ్య : : 81
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English