ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో ఘనంగా 9వ జీఎస్టీ దినోత్సవం 2026; దేశ నిర్మాణంలో జీఎస్టీ పాత్రను కొనియాడిన గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

నాడు పోస్టు చేయడమైనది: 01 JUL 2026 7:02PM by PIB Hyderabad

భారతదేశ అత్యంత కీలకమైన పరోక్ష పన్ను సంస్కరణల్లో ఒకటైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నేడు హైదరాబాద్‌లో 9వ జీఎస్టీ దినోత్సవం 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. 2017 జూలై 1న ప్రారంభమైన జీఎస్టీ దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చివేసిన ఒక మైలురాయి లాంటి సంస్కరణ అని అభివర్ణించారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమాఖ్య స్ఫూర్తి ద్వారా జీఎస్టీ దేశ పరోక్ష పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేసిందని, పన్ను పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని ఆయన పేర్కొన్నారు.

సాంకేతికత ఆధారిత నిబంధనల అమలు పన్ను పరిపాలనను ఆధునీకరించినప్పటికీ, డిజిటల్ నోటీసులు, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి), అప్పీళ్ల కాలపరిమితి వంటి అంశాల్లో సరికొత్త చట్టపరమైన, కార్యాచరణ సవాళ్లకు కూడా దారితీసిందని గౌరవ ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిరంతర అవగాహన, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కిచెబుతూ.. మారుతున్న జీఎస్టీ వ్యవస్థను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పన్ను చెల్లింపుదారులు, చట్టపరమైన నిపుణులు, పన్ను అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

జీఎస్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు సూచనలు చేస్తూ.. కాలపరిమితి ముగిసిన అప్పీళ్ల కోసం అమ్నెస్టీ అవకాశం, జీఎస్టీఎన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ వివాద పరిష్కార వ్యవస్థ, పన్ను అక్షరాస్యత కార్యక్రమాల నిర్వహణ వంటి చర్యలు వ్యాజ్యాలను తగ్గించి, స్వచ్ఛంద పన్ను చెల్లింపులను ప్రోత్సహిస్తాయని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రతిపాదించారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థను నిర్మించడంలో పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులు, పన్ను పరిపాలనా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని, బలమైన, పారదర్శకమైన, స్వయంసమృద్ధ భారతదేశ నిర్మాణానికి నిజాయితీతో కూడిన పన్ను చెల్లింపులే అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా హైదరాబాద్ జోన్ సెంట్రల్ టాక్స్ & కస్టమ్స్ చీఫ్ కమిషనర్ శ్రీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో పన్ను నిబంధనల అమలును బలోపేతం చేయడం, డిజిటల్ గవర్నెన్స్‌ను ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీఎస్టీ భారతదేశ పరోక్ష పన్నుల వ్యవస్థను మార్చివేసిందని పేర్కొన్నారు.

 

జీఎస్టీ సాధించిన విజయాలను వివరిస్తూ.. 2017లో ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రెండింతలు పైగా పెరిగాయని, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 60 లక్షల నుంచి 1.65 కోట్లకు పైగా పెరిగిందని ఆయన గుర్తుచేశారు. పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధి, పన్ను చెల్లింపుదారుల సంఖ్య భారీగా పెరగడంతో హైదరాబాద్ సీజీఎస్టీ జోన్ అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పన్ను రీఫండ్‌ల వేగవంతమైన ప్రాసెసింగ్, సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం వంటి పన్ను చెల్లింపుదారుల కేంద్రంగా చేపట్టిన పలు కార్యక్రమాలను శ్రీ అరుణ్ కుమార్ వివరించారు, అలాగే పన్ను వివాద పరిష్కారానికి తోడ్పడే జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అందుబాటులోకి రావడాన్ని ఆయన స్వాగతించారు. పన్ను చెల్లింపుదారుల అవగాహన, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యతను నొక్కిచెబుతూ, భారతదేశ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇచ్చే పారదర్శకమైన, సమర్థవంతమైన, సమగ్రమైన పన్ను వ్యవస్థను నిర్మించడానికి పన్ను చెల్లింపుదారులు, వ్యాపారాలు, పన్ను నిపుణులు, పన్ను అధికారుల మధ్య నిరంతర సహకారం అవసరమని ఆయన కోరారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు డాక్టర్ కె. బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. తాను ఎలాంటి లోటుపాట్లు, ఆలస్యం లేకుండా నిరంతరం జీఎస్టీ చెల్లిస్తున్నానని, నిజాయితీగా పన్ను చెల్లించడం దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) సీనియర్ అధికారులు, సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ విభాగాల అధికారులు, పన్ను రంగానికి చెందిన ప్రముఖులు, వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులు, చట్టపరమైన నిపుణులు, ఇతర వాటాదారులు పాల్గొన్నారు.


(రిలీజ్ ఐడి: 2280049) సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Telugu