వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
బంగారు నగల దుకాణంపై బీఐఎస్ దాడులు
హాల్‌మార్కింగ్ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు.. 1.6 కిలోల బంగారు ఆభరణాలు జప్తు
నాడు పోస్టు చేయడమైనది:
22 JUN 2026 4:38PM by PIB Hyderabad
బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఓ నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. బీఐఎస్ చట్టం–2016 మరియు తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి, డైరెక్టర్ పి.వి. శ్రీకాంత్ ఆదేశాల మేరకు, డైరెక్టర్ & సైంటిస్ట్-ఈ సత్తు సవిత నేతృత్వంలోని బృందం ఈ సోదాల్లో పాల్గొంది.
తనిఖీల సందర్భంగా దుకాణంలో తప్పనిసరి బీఐఎస్ హాల్‌మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను విక్రయానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అలాగే పాత హాల్‌మార్క్ గుర్తులతో ఉన్న ఆభరణాలు కూడా విక్రయిస్తున్నట్లు తేలింది. ఇవి బీఐఎస్ చట్టం–2016తో పాటు బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.

ఈ దాడుల్లో ఉంగరాలు, హారాలు, పెండెంట్లు తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు జప్తు చేశారు. సంబంధిత దుకాణంపై బీఐఎస్ చట్టం–2016 ప్రకారం తదుపరి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
వినియోగదారుల రక్షణ బీఐఎస్‌కు అత్యంత ప్రాధాన్యమైన అంశమని.. వినియోగదారులు బీఐఎస్ లోగో, ఆభరణం స్వచ్ఛత కేరట్లలో, హెచ్‌యూఐడీ (HUID) నంబర్ ఉన్న హాల్‌మార్క్ బంగారు ఆభరణాలనే కొనుగోలు చేయాలని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ కోరారు. కొనుగోలు ముందు బీఐఎస్ కేర్ (BIS CARE) యాప్ ద్వారా ఆభరణాల ప్రామాణికతను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని.. హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాల విక్రయం లేదా బీఐఎస్ హాల్‌మార్క్ దుర్వినియోగం గమనించినట్లయితే, బీఐఎస్ కేర్ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అలాగే నగల వ్యాపారులు అందరూ తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, బీఐఎస్ చట్టం–2016 ప్రకారం హాల్‌మార్క్ కలిగిన బంగారు ఆభరణాలనే విక్రయించాలని సూచించారు.
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల అమలు, మార్కెట్లో పారదర్శకత పెంపు లక్ష్యంగా బీఐఎస్ రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ నిఘా, అమలు చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు హెచ్‌యూఐడీ నంబర్‌ను బీఐఎస్ కేర్ యాప్ ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, ప్రతి కొనుగోలుకు సరైన బిల్లు తీసుకోవాలని సూచించారు.
***
(రిలీజ్ ఐడి: 2276698)
సందర్శకుల సూచీ సంఖ్య : : 35