వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

12 ఏళ్ల ఎగుమతి ఆధారిత వృద్ధి ప్రస్థానాన్ని వెల్ల‌డించిన వాణిజ్య శాఖ; అంతర్జాతీయంగా లభిస్తున్న సరికొత్త అవకాశాలను తెలంగాణ అందుకోవాలని పిలుపు


విధానపరమైన సంస్కరణలు, మార్కెట్ల విస్తరణ, డిజిటల్ వ్యాపార సదుపాయాల ద్వారా దాదాపు రెట్టింపు వృద్ధితో 2025-26 నాటికి 860 బిలియన్ డాలర్లు దాటిన‌ భారతీయ‌ ఎగుమతులు

प्रविष्टि तिथि: 12 JUN 2026 4:54PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య శాఖ, ఏపీఈడీఏ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించింది. "వాణిజ్య శాఖ సాధించిన 12 ఏళ్ల విజయాలు - తెలంగాణ నుంచి ఎగుమతుల పెంపుపై అవగాహన కార్యక్రమం" అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఎగుమతిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, వ్యాపార ప్రోత్సాహక సంస్థలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ ఈపీ(అగ్రి) విభాగం ఆర్థిక సలహాదారు ప్రియా పి. నాయర్ మాట్లాడారు. గత 12 ఏళ్లుగా వాణిజ్య శాఖ నిరంతర విధాన సంస్కరణలు, ఎగుమతుల ప్రోత్సాహక చర్యలు, కొత్త మార్కెట్ల అన్వేషణ, డిజిటల్ మార్పుల ద్వారా అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ఆమె చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో అనిశ్చితులు ఉన్నప్పటికీ వస్తువులు, సేవల ఎగుమతుల్లో సాధించిన బలమైన వృద్ధి కారణంగా భారతదేశ మొత్తం ఎగుమతులు 2013-14లో 468 బిలియన్ డాలర్లు ఉండ‌గా, 2025-26 నాటికి 860 బిలియన్ డాలర్లు దాటి దాదాపు రెట్టింపు అయ్యాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కాలంలో ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు (ఫార్మా), సముద్ర ఉత్పత్తులు, దుస్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు-ఆభరణాల రంగాలు భారీ వృద్ధిని నమోదు చేశాయని. సేవల ఎగుమతులు సైతం దేశ ఆర్థిక విస్తరణకు చోద‌క‌శ‌క్తిగా మారాయని ఆమె పేర్కొన్నారు.

ట్రేడ్‌ కనెక్ట్, డిజిటల్ ట్రేడ్ ఇంటెలిజెన్స్ వేదిక‌లు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) అందిస్తున్న ప్రత్యేక మద్దతు వంటి కార్యక్రమాల ద్వారా వాణిజ్య శాఖ వ్యాపార సదుపాయాలను మరింత సులభతరం చేసిందని ప్రియా పి. నాయర్ వివరించారు. దీంతో పాటు వివిధ దేశాలతో స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాలను(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడం ద్వారా ఎగుమతిదారులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు, ట్రేసిబిలిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భాగస్వాముల సమన్వయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ వ్యాపార, ఎగుమతుల కేంద్రంగా మార్చడానికి బలమైన పునాది పడిందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా తెలంగాణ వాణిజ్య శాఖ కార్యదర్శి, జాతీయ పసుపు బోర్డు ప్రతినిధి ఎన్. భవానిశ్రీ, ఐఏఎస్‌ మాట్లాడుతూ.. భారతదేశం ఏటా దాదాపు 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తోందని, అయితే అందులో 13 శాతం మాత్రమే ఎగుమతి అవుతోందని చెప్పారు. త‌ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో మనకు ఇంకా ఎంతో వృద్ధి లభించే అవకాశం ఉందనే విష‌యం తెలుస్తోందన్నారు. భారతదేశ వ్యవసాయ ఎగుమతుల్లో సుగంధ ద్రవ్యాల వాటా 8 శాతానికి పైగా ఉందని, ప్రపంచంలోనే వీటిని అత్యధికంగా ఉత్పత్తి చేసే, వినియోగించే, ఎగుమతి చేసే దేశంగా భారతదేశం కొనసాగుతోందని ఆమె వివరించారు.

ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌) భాగ‌స్వామ్యాన్ని వివరిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా దాదాపు 40 కార్యాచరణ సెజ్‌లు పనిచేస్తున్నాయని, వీటి నుంచి ఎగుమతులు దాదాపు రూ. 15 లక్షల కోట్లకు చేరాయని ఆమె తెలిపారు. తెలంగాణలోని సెజ్‌లు ఔషధాలు, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీకి ప్రధాన కేంద్రాలుగా మారాయన్నారు. సెజ్‌లు, ఎగుమతి ఆధారిత విభాగాలు(ఈఓయూ) సుంకం లేని దిగుమతులు, సరళీకృత కస్టమ్స్ విధానాలు, సింగిల్ విండో అనుమతులు వంటి ప్రయోజనాలను అందిస్తూ వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తున్నాయని, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ కె. రాజా భాను మాట్లాడుతూ.. భారతీయ ఔషధ ఉత్పత్తులు ఇప్పుడు 190కి పైగా దేశాలకు చేరుతున్నాయని, ప్రపంచంలోని మొదటి 25 అత్యుత్తమ జెనరిక్ మందులలో పది భారతదేశం నుంచే సరఫరా అవుతున్నాయని చెప్పారు. ఇది దేశ తయారీ రంగ ప్రతిభను, నాణ్యతా ప్రమాణాలను, శాస్త్రీయ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోందని, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సరఫరాదారుగా భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు.

ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్. పి. నాయుడు మాట్లాడుతూ.. భారతదేశ వ్యవసాయ ఎగుమతుల రంగంలో తెలంగాణ వాటా నిరంతరం పెరుగుతోందన్నారు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం రూ. 8,000 నుంచి 10,000 కోట్ల వరకు సహకారం అందిస్తోందని చెప్పారు. రవి ఫుడ్స్, కరాచీ బేకరీ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ఒక ప్రధాన బేకరీ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన బంగినపల్లి మామిడి పండ్ల ఎగుమతులకు ఏపీఈడీఏ అందిస్తున్న మద్దతు, ట్రేస్‌నెట్ ద్వారా సేంద్రీయ వ్యాపార ప్రోత్సాహం, ఎగుమతి మౌలిక సదుపాయాలు, నాణ్యత పరీక్షా కేంద్రాల కోసం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఆయన వివరించారు.

ఈసీజీసీ ప్రతినిధి సురేష్ బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపారంలో వాణిజ్య, రాజకీయ నష్టాలకు వ‌ర్తించే క్రెడిట్ ఇన్సూరెన్స్ సౌక‌ర్యాల‌ ద్వారా ఎగుమతిదారులకు చెల్లింపుల నష్టాల నుంచి రక్షణ కల్పించడంలో తమ సంస్థ పాత్రను వివరించారు. విదేశీ కొనుగోలుదారులను అంచనా వేయడంలో, క్రెడిట్ పరిమితులను పొందడంలో, చెల్లింపులు జరగని పక్షంలో రక్షణ పొందడంలో ఈసీజీసీ ఎగుమతిదారులకు సహాయం చేస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈల కోసం రూపొందించిన ప్రత్యేక ఉత్పత్తులు, ఒకే కొనుగోలుదారు నష్టాలు, షిప్‌మెంట్‌కు ముందు ఉండే నష్టాలు, దేశీయ వ్యాపార క్రెడిట్ గురించి ఆయన వివరించారు. నష్టాల నిర్వహణ, క్లెయిమ్‌ల సకాలంలో పరిష్కారానికి డాక్యుమెంటేషన్, నిబంధనల పాటించడం, సకాలంలో వివరాలు ప్రకటించడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌(డీజీఎఫ్‌టీ) డాక్టర్ సంపత్ కుమార్, ఐటీఎస్‌ మాట్లాడుతూ.. విదేశీ వాణిజ్య విధానం కింద అమలు చేస్తున్న కీలక ఎగుమతి ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఎగుమతిదారుల కోసం డిజిటల్ సేవలు, ఎఫ్‌టీఏల కింద లభించే ప్రయోజనాలు, ఈ-కామర్స్ వేదిక‌ల ద్వారా ఎంఎస్ఎంఈలకు లభించే మద్దతు, ఆర్థిక సహాయ పథకాలు, భారతీయ వ్యాపారాలు తమ అంతర్జాతీయ పరిధిని విస్తరించుకోవడానికి ఉద్దేశించిన వ్యాపార సదుపాయాల కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడారు.

 ఎగుమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు వాణిజ్య శాఖ, ఏపీఈడీఏ, డీజీఎఫ్‌టీ, ఈసీజీసీ, ఇతర వ్యాపార ప్రోత్సాహక సంస్థలతో చురుగ్గా పాలుపంచుకోవాలని వ‌క్త‌లు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అవగాహన, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల్లో పాల్గొంటూ, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఎగుమతులను పెద్ద ఎత్తున పెంచడానికి, ఉపాధిని సృష్టించడానికి, భారతదేశాన్ని ప్రపంచ వ్యాపార శక్తిగా మార్చే ప్రయాణంలో భాగస్వాములు కావడానికి నాణ్యతా ప్రమాణాలు, ధ్రువీకరణ పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

***


(रिलीज़ आईडी: 2272219) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English