గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
प्रविष्टि तिथि:
10 JUN 2026 4:23PM by PIB Vijayawada
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న నూతన గ్రీన్‌ఫీల్డ్ నగరం అమరావతిలో ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుంది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా, వాటికి పెరుగుతున్న కార్యాలయ వసతి డిమాండ్‌ను తీర్చడమే ఈ ప్రతిపాదన లక్ష్యం. ఈ ఏకీకరణ వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సేవల సామర్థ్యాన్నీ, ప్రభావాన్నీ ఇది మెరుగుపరుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతిని 5.53 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణంలో రెండు బ్లాకులు ఉన్నాయి. ఒకటి ప్లాట్ సి-9లో గ్రౌండ్ + 13 అంతస్తులతో (గ్రౌండ్ ఫ్లోర్ సేవల కోసం, మూడు అంతస్తులు పోడియం పార్కింగ్ కోసం, పది అంతస్తులు కార్యాలయాల కోసం) కూడిన బ్లాకు కాగా... మరొకటి ప్లాట్ సి-8లో గ్రౌండ్ + 10 అంతస్తులతో (గ్రౌండ్ ఫ్లోర్ సేవల కోసం, మూడు అంతస్తులు పోడియం పార్కింగ్ కోసం, ఏడు అంతస్తులు కార్యాలయాల కోసం) కూడిన బ్లాకు. సుమారు 8,000 మంది అధికారులు, సిబ్బందికి వసతి కల్పించేలా దీనిని రూపొందించారు. సుమారు 1,800 ఈక్వివాలెంట్ కార్ స్పేసెస్ (ఈసీఎస్) కోసం పోడియం పార్కింగ్ సదుపాయాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణ విస్తీర్ణం 23,25,000 చదరపు అడుగులు (2,16,032 చదరపు మీటర్లు).
పర్యావరణపరంగా సుస్థిరమైన, వనరులను సమర్థంగా వినియోగించగల నిర్మాణ పద్ధతుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ నిబద్ధతకు అనుగుణంగా... ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతిలో ప్రతిపాదిత కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి కోసం దేశంలో అమలులో ఉన్న అత్యున్నత గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళిక, రూపకల్పన చేస్తున్నారు. సుస్థిరమైన సైట్ ప్రణాళిక, మెరుగైన ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, స్థానికంగా లభించే వస్తువుల వాడకం, నివాసితుల ఆరోగ్యం, సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాంగణాన్ని కనీసం గృహ 4-స్టార్ రేటింగ్ సాధించేలా రూపకల్పన చేసి, నిర్మించి, రిజిస్టర్ చేస్తారు. ఇది ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనెబుల్ బిల్డింగ్ కోడ్-2024 తాజా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతిలో ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతిలో ఉద్యోగులు, సందర్శకుల అవసరాలను తీర్చడానికి అవసరమైన పౌర, సామాజిక సౌకర్యాలు కల్పించనున్నారు. వీటిలో ఏటీఎంతో కూడిన బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, క్రీచ్, రిక్రియేషన్ రూమ్, మహిళల గది, 100 మంది కూర్చునే సామర్థ్యం గల సమావేశ మందిరం, 500 మంది కూర్చునే సామర్థ్యం గల మల్టీపర్పస్ హాల్, నాలుగు క్యాంటీన్లు ఉన్నాయి.
వర్తించే యాక్సెసిబిలిటీ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా దివ్యాంగుల కోసం సౌకర్యం, భద్రత, అనుకూలతను నిర్ధారించడానికి ఈ ప్రాంగణంలో అవరోధ రహిత నిర్మాణ వ్యవస్థను భాగం చేశారు.
నైపుణ్యం గల, పాక్షిక నైపుణ్యం గల, నైపుణ్యం లేని కార్మికుల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి ఈ ప్రాజెక్టు గణనీయ అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. నిర్మాణ దశలో సంవత్సరానికి సుమారు 7,00,000 పనిదినాల ఉపాధి లభిస్తుందని, కార్యాచరణ దశలో సంవత్సరానికి సుమారు 50,000 పనిదినాల ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
ప్రాజెక్టు వ్యయం, నిధులు
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,299.08 కోట్లు. భారత ప్రభుత్వం '4059 ప్రజా పనుల మూలధన వ్యయం' ఖాతా కింద బడ్జెట్ నుంచి ఈ నిధులను సమకూరుస్తుంది).
ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కార్యకలాపాలు
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రజా పనుల విభాగం ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. ప్రీ-బిడ్ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టెండర్ పత్రాల రూపకల్పన ప్రస్తుతం కొనసాగుతోంది.


***
(रिलीज़ आईडी: 2271160)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English