వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ “మీడియా ప్రచార” కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో డీజీఎఫ్‌టీ ప్రాంతీయ పర్యటన
प्रविष्टि तिथि:
09 JUN 2026 2:05PM by PIB Vijayawada
కొత్తగా ప్రారంభించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌పై దృష్టి సారించి, విశాఖపట్నంలోని జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్ లో “ఎగుమతిదారుల అవగాహన సదస్సు” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) శ్రీ లవ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఎగుమతిదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాలు, ఈసీజీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో డీజీఎఫ్‌టీ, ఈసీజీసీ, ఎమ్ఎస్ఎమ్ఈ కార్యాలయాల నిపుణులు పలు సాంకేతిక అంశాలపై వివరణాత్మక ప్రసంగాలు చేశారు. ప్రపంచ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తుల భాగస్వామ్యాన్ని పెంచడానికి డీజీఎఫ్‌టీ పథకాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో వారు వివరించారు. అనంతరం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సముద్ర మత్స్య సంపద, ఇంజనీరింగ్, మెడ్‌టెక్ ఎగుమతుల రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు తమ అనుభవాలను సదస్సులో పంచుకున్నారు.
ముఖ్య అతిథి డీజీఎఫ్‌టీ శ్రీ లవ్ అగర్వాల్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన ప్రాధాన్యతలను వివరించారు. ముఖ్యంగా, మార్చి 1, 2026 నుంచి మే 31, 2026 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా.. విశాఖపట్నం ప్రాంతీయ అథారిటీ ద్వారా పరిష్కరించిన ఎగుమతి బాధ్యత విముక్తి ధృవీకరణ పత్రం (ఈఓడీసీ) కేసుల పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి కేసులను వేగంగా పరిష్కరించడం వల్ల ఎగుమతిదారులు తమ బ్యాంక్ గ్యారంటీలను క్లియర్ చేసుకోవడానికి వీలైందని, తద్వారా వారి నగదు ప్రవాహం పెరిగిందని తెలిపారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఎగుమతిదారులకు దాదాపు రూ.419 కోట్ల మేర లభ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
అలాగే, కొత్తగా ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను చురుగ్గా ఉపయోగించుకోవాలని ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లను ఆయన ప్రోత్సహించారు. ఈ మిషన్ ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలపై పనిచేస్తుందని వివరించారు. మొదటిది, వాణిజ్య ఆర్థిక సహాయం అందించే 'నిర్యత్ ప్రోత్సాహన్' కాగా, రెండవది అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి తోడ్పడే 'నిర్యత్ దిశ'.
దీనితో పాటు, జూన్ 1, 2026 న ప్రారంభమైన 'ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు' డ్రైవ్ గురించి కూడా సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న 90 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశారు. ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం, స్థానిక ప్రత్యేక ఉత్పత్తుల గుర్తింపును పెంచడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎమ్ఎస్ఎమ్ఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి.

సదస్సులో భాగంగా జరిగిన పరస్పర చర్చా కార్యక్రమంలో ఎగుమతిదారులు, అధికారులు.. ఎగుమతి రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, ఆలోచనలను పంచుకున్నారు. ఎగుమతిదారులకు నిరంతరం మద్దతు ఇవ్వడానికి, ఎమ్ఎస్ఎమ్ఈల భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి, భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ, ఎగుమతుల కేంద్రంగా మార్చాలనే విజన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి డీజీఎఫ్‌టీ కట్టుబడి ఉందనే బలమైన నమ్మకంతో ఈ కార్యక్రమం ముగిసింది.
****
(रिलीज़ आईडी: 2270671)
आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English