కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పబ్లిక్ వై-ఫై సేవలను మరింత సరళతరం చేస్తూ, ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు 'PM-WANI' కి భారీ అప్గ్రేడ్


ల్యాప్టాప్ల కోసం క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత లాగిన్, తక్కువ సమయ వ్యవధి గల ప్లాన్లు, ఒకే రకమైన 'PM-WANI' హాట్స్పాట్ పేర్లు

అందరికీ డిజిటల్ కనెక్టివిటీని అందించేందుకు పీఎం-వాణి వ్యవస్థలో సమగ్ర మార్పులు

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 12:05PM by PIB Vijayawada

భారతదేశ డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు, పౌరులకు ఇంటర్నెట్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) 'పీఎం-వాణి'- (ప్రైమ్ మినిస్టర్ వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్) ఫ్రేమ్వర్క్ కింద వరుస సంస్కరణలను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త చర్యలలో భాగంగా:

  • ల్యాప్టాప్లు, ఇతర అనుబంధ పరికరాల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత అథెంటికేషన్ సదుపాయం.
  • కేవలం 15, 30, 60 నిమిషాల వ్యవధితో కూడిన ఫ్లెక్సిబుల్ వై-ఫై ప్లాన్లు.
  • ప్రజలు సులభంగా గుర్తించడానికి, సేవల నమ్మకాన్ని పెంచడానికి వీలుగా దేశవ్యాప్తంగా పీఎం-వాణి హాట్స్పాట్ పేర్లను (SSIDs) ఒకే ప్రమాణంలోకి తీసుకురావడం.

 

టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) మే 22, 2026న జారీ చేసిన సర్క్యులర్ నంబర్లు 1/PM-WANI/2026 మరియు 2/PM-WANI/2026 ద్వారా ఈ కొత్త సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. పీఎం-వాణి వ్యవస్థలోని భాగస్వాములందరూ సవరించిన మార్గదర్శకాలను సర్క్యులర్ జారీ చేసిన ఎనిమిది వారాల లోపు అమలు చేయాలని ఆదేశించారు. దీనివల్ల జూలై 2026 నాటికి ఈ వినియోగదారు-అనుకూల ఫీచర్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ కనెక్టివిటీ విజన్ను ప్రతి పౌరుడికి సరసమైన ధరల్లో చేర్చడానికి ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఈ సంస్కరణలు. కేంద్ర సమాచార, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో, పీఎం-వాణి వ్యవస్థ ప్రస్తుతం సులభమైన వినియోగం, పరస్పర అనుసంధానం, వినియోగ సౌలభ్యం, విస్తృత ప్రజా ఆదరణే లక్ష్యంగా సమగ్ర పరివర్తనను సాధిస్తోంది.

కేంద్ర సమాచార మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, పీఎం-వాణి అమలును వేగవంతం చేయడానికి, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇటీవల శాఖాధికారులు, సంబంధిత భాగస్వాములతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహించారు.

ఈ సంస్కరణల గురించి డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ, "దేశంలో అందరికీ పబ్లిక్ వై-ఫై సేవలను అందించేందుకు పీఎం-వాణి ఒక అద్భుతమైన వేదికఇప్పుడు దీనిని ప్రజలు మరింత సులభంగా వాడేలా తీర్చిదిద్దుతున్నాము. సరికొత్త క్యూఆర్-ఆధారిత లాగిన్ విధానం ద్వారా వినియోగదారులు తమ ఫోన్లోని అథెంటికేటెడ్ యాప్ సాయంతో కేవలం ఒక కోడ్ను స్కాన్ చేసి ల్యాప్టాప్లను వై-ఫైకి అనుసంధానించుకోవచ్చు. అలాగే, కొద్దిసేపు మాత్రమే ఇంటర్నెట్ అవసరమయ్యే వారి కోసం 15, 30 మరియు 60 నిమిషాల స్వల్ప వ్యవధి ప్లాన్లను అందించాల్సిందిగా హాట్స్పాట్ ఆపరేటర్లకు సూచించాము" అని పేర్కొన్నారు. నేటి డిజిటల్ యుగంలో పబ్లిక్ వై-ఫై అనేది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ప్రయాణికులు, నిత్యం రాకపోకలు సాగించేవారు, నిపుణులు, చిన్న వ్యాపారస్తులకు మద్దతుగా నిలిచే ఒక ప్రజోపయోగకర సేవగా అవతరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

క్యూఆర్ అథెంటికేషన్ ద్వారా ల్యాప్టాప్ కనెక్షన్ సరళతరం:

పీఎం-వాణి సేవలను సులభతరం చేయడానికి ల్యాప్టాప్ల వంటి ద్వితీయ శ్రేణి పరికరాలకు క్యూఆర్-ఆధారిత అథెంటికేషన్ను టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) అనుమతించింది. వినియోగదారులు లాగిన్ పేజీలో కనిపించే క్యూఆర్ కోడ్ను తమ స్మార్ట్ఫోన్ ద్వారా స్కాన్ చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేగంగా, సురక్షితంగా కనెక్ట్ అవ్వవచ్చు.

స్వల్ప కాలిక వ్యవధితో యాక్సెస్ ప్లాన్లు:

రవాణా కేంద్రాలు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాలలో ఇంటర్నెట్ వాడే వినియోగదారుల సౌకర్యార్థం 15, 30 మరియు 60 నిమిషాల స్వల్ప కాలపరిమితి గల ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆపరేటర్లకు స్పష్టం చేశారు. ఈ ప్లాన్లు నిత్యం ప్రయాణించే వారికి, విద్యార్థులకు ఇంటర్నెట్ను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురావటమే కాకుండా, ఆపరేటర్ల ఆదాయాన్ని, హాట్స్పాట్ వినియోగాన్ని గణనీయంగా పెంచుతాయి.

 

హాట్స్పాట్ గుర్తింపు సరళీకరణ:

వినియోగదారులు ప్రామాణికమైన నెట్వర్క్లను సులభంగా గుర్తించడానికి వీలుగా, హాట్స్పాట్ పేర్ల (SSID) నామకరణాన్ని 'PMWANI' బ్రాండింగ్తో ఒకే ప్రమాణంలోకి తీసుకువచ్చారు. 'డిజిటల్ ఇండియా' చొరవ కింద ప్రారంభమైన పీఎం-వాణి, పీడీఓలు (PDOs), పీడీఓఏలు (PDOAs), యాప్ ప్రొవైడర్ల విస్తృత వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా చౌకైన ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా పబ్లిక్ వై-ఫై మౌలిక సదుపాయాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయనున్నాయి.

https://x.com/PemmasaniOnX/status/2057790287599350125

 

*****


(రిలీజ్ ఐడి: 2265562) సందర్శకుల సూచీ సంఖ్య : : 7