కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.15,373 కోట్లకు చేరిన ఇండియా పోస్ట్ ఆదాయం; విస్తృత పరివర్తనాత్మక కార్యాచరణను వివరించిన కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
పార్శిల్, లాజిస్టిక్స్ సేవల్లో 70% వృద్ధి నమోదు; ఆదాయ సామర్థ్యం రూ.10,000 కోట్లుగా అంచనా
నిరంతరాయమైన, సమగ్ర డిజిటల్ తపాలా సేవలను అందించేందుకు రూ.5,800 కోట్ల భారీ పెట్టుబడితో 'IT 2.0' ప్రాజెక్టు
లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు చెల్లింపుల ద్వారా రూ.45,000 కోట్లు పంపిణీ; సుకన్య సమృద్ధి యోజన కింద 3.8 కోట్ల మంది బాలికల నమోదు
భారీ సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు, అత్యాధునిక తపాలా కార్యాలయాలు — ప్రజలతో అనుసంధానమయ్యే విధానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్న ఇండియా పోస్ట్
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 4:29PM by PIB Vijayawada
కేంద్ర సమాచార మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని డీడీ ఇండియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 2025–26 ఆర్థిక ఏడాదిలో ఇండియా పోస్ట్ ఆదాయం రూ.15,373 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. తపాల శాఖ 170 ఏళ్ల చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఆర్థిక విజయాల్లో ఒకటిగా అభివర్ణించారు. 2016లో తపాల శాఖ ఆదాయం సుమారు రూ.11,500 కోట్లుగా ఉండేదని, ఆ తరవాత ప్రతి ఏడాది సగటున రూ.200–300 కోట్ల వృద్ధి మాత్రమే నమోదయ్యేదని తెలిపారు. కానీ.. ఈ ఏడాది ఒక్కసారిగా రూ.2,100 కోట్ల పెరుగుదల నమోదైందని, ఇది గత సగటుతో పోలిస్తే దాదాపు పది రెట్లు ఎక్కువని తెలిపారు.
ఈ మార్పునకు తాము అమలు చేసిన ద్విముఖ వ్యూహాత్మక విధానమే ప్రధాన కారణమని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా.. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు మార్కెట్ అవకాశాలను గుర్తించడం, లక్ష్యాలను నిర్ణయించడం, జవాబుదారీతనాన్ని పెంచడం కీలకమన్నారు. అలాగే.. కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు క్షేత్రస్థాయి ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలు తీసుకున్నామని అన్నారు. సమస్యల్ని గుర్తించి పరిష్కరించే వ్యవస్థను నెలకొల్పడం ద్వారా ఫలితాలను సాధించడంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు.
ఇండియా పోస్ట్ పార్సెల్, లాజిస్టిక్స్ విభాగం 70 శాతం వృద్ధి సాధించిందని మంత్రి వెల్లడించారు. సాంకేతిక సేవల వినియోగం పెరగడం, ఈ-కామర్స్ సంస్థల భాగస్వామ్యాల విస్తరణతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రస్తుత నాయకత్వం బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్సెల్ ఆదాయం సుమారు రూ.600 కోట్లుగా ఉండేదని తెలిపిన కేంద్ర సహాయ మంత్రి.. ఓటీపీ ఆధారిత డెలివరీ, ఎస్ఎంఎస్ ట్రాకింగ్, యూపీఐ, డిజిటల్ చెల్లింపుల స్వీకరణ, ప్రముఖ ఈ-కామర్స్ వేదికలతో బీ2బీ ఒప్పందాల అమలుతో పార్సెల్ సేవల ద్వారానే ఏకంగా రూ.10,000 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించే సామర్థ్యం ఉందని అంచనా వేశారు.
తపాల సేవలను మరింత వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా రూట్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్టు తెలిపారు. విస్తృతమైన పైలట్ ప్రాజెక్టుల అనంతరం, దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో 24 గంటలు, 48 గంటల వ్యవధిలోనే డెలివరీ చేసేలా సరికొత్త 'స్పీడ్ పోస్ట్' సేవలను ఇండియా పోస్ట్ ప్రారంభించిందని చెప్పారు. ఈ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించామన్నారు. సాంప్రదాయ ఉత్తరాల వినియోగం క్రమంగా తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో, లాజిస్టిక్స్, పార్సెల్ విభాగాలే తపాలా శాఖ భవిష్యత్ వృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా మారాయని డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు.
ఇండియా పోస్ట్ ఆధునికీకరణలో భాగంగా ఐటీ 2.0 కింద ప్రవేశపెట్టిన అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ కార్యక్రమానికి రూ.5,800 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. పూర్తిస్థాయి డిజిటల్ సేవల లక్ష్యంతో శాఖ ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజలు అంతర్జాలంలోనే ఒక్క క్లిక్‌తో సేవింగ్స్ పథకాలు, పీఎల్ఐ, ఆర్‌పీఎల్ఐ బీమా పాలసీలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వివరించారు. డిజిటల్ సర్టిఫికెట్లు వెంటనే డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం, మెచ్యూరిటీ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే విధానం అమల్లోకి వస్తోందని, దీంతో పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
దేశంలో అత్యధిక వడ్డీ ఇచ్చే సేవింగ్స్ ఖాతాల్లో పోస్టల్ సేవింగ్స్ ఖాతాలు ఒకటిగా ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటిపై 4 శాతం వడ్డీ లభిస్తోందని, ప్రధాన వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న సుమారు 2.5 శాతం వడ్డీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పారు. డిజిటల్ సౌకర్యాల విస్తరణతో ఈ ఖాతాల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఐటీ 2.0 భద్రతా వ్యవస్థలో ముఖ గుర్తింపు ఆధారిత ప్రవేశం, ఈ-కేవైసీ, ఆధార్ అనుసంధానం, జాతీయ క్లౌడ్ భద్రతా ప్రమాణాల అమలు వంటి ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా తపాల శాఖ ప్రతీ ఏటా సుమారు రూ.45,000 కోట్లను లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో పంపిణీ చేస్తోందని మంత్రి చెప్పారు. దేశంలో చివరి ప్రాంతం వరకు సంక్షేమ పథకాల లబ్ధి అందించే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒకటిగా ఉందని తెలిపారు. మొబైల్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు, ప్రింటర్లతో పనిచేస్తున్న ఐపీపీబీ ప్రతినిధులు, గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారని చెప్పారు. నగదు పంపిణీ, బిల్లుల వసూళ్లు వంటి సేవలు నేరుగా గ్రామీణ కుటుంబాల వద్దకే చేరుతున్నాయని వివరించారు.
ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకం కింద దేశంలో సుమారు 3.8 కోట్ల బాలికలు నమోదై ఉన్నారని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ పథకాలు, స్వయం సహాయక సంఘాల అనుసంధానం, అధిక వడ్డీ గ్రామీణ సేవింగ్స్ ఖాతాల ప్రచారం విస్తృతంగా సాగుతోందని చెప్పారు. దాదాపు ప్రతి గ్రామంలో పనిచేస్తున్న 2.5 లక్షల గ్రామీణ డాక్ సేవకుల వ్యవస్థ ప్రస్తుతం ఇండియా పోస్ట్‌కు వెన్నెముకగా ఉందని మంత్రి అభివర్ణించారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా డీబీటీ లబ్ధిదారుల జనాభా వివరాల ఆధారంగా వారికి సరిపోయే బీమా, సేవింగ్స్ పథకాల సూచనలు అందించే విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్టు డాక్టర్ పెమ్మసాని తెలిపారు. దీనివల్ల వారి ఆర్థిక భద్రత మరింత బలపడుతుందని చెప్పారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఉద్యోగుల్లో నైపుణ్యాలు, ప్రవర్తనా మార్పుల కోసం భారీ కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ప్రతి వందమంది ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వినియోగదారులతో సంభాషించే తీరు, అందిస్తున్న సేవలు, విక్రయ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. సాంకేతిక అనుసంధానంతో కేవలం లావాదేవీలకే పరిమితమయ్యే విధానానికి బదులుగా ప్రజా కేంద్రిత సేవల దిశగా ఉద్యోగుల ఆలోచనా విధానం మారడమనేది అత్యంత కీలక అంశంమని డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనాలు నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా మాట్లాడినట్టు తెలిపారు. శాఖ ఆర్థిక పరిస్థితి, వికసిత భారత్ లక్ష్య సాధనలో వారి పాత్ర గురించి వివరించినట్టు వెల్లడించారు.
ఇదే సమయంలో పోస్టాఫీసుల ఆధునికీకరణ పనులు విస్తృతంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. పట్టణ పోస్టాఫీసుల అభివృద్ధికి ఒక్కో కేంద్రానికి రూ.60–70 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నామని, డిజిటల్ కౌంటర్లు, సులభ ఆధార్ అప్‌డేట్ సేవలు, ఉమ్మడి కార్యాలయ వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో కొత్త తరం పోస్టాఫీసులు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. యువతను ఆకర్షించేలా సాంస్కృతిక అంశాలు, డిజిటల్ సదుపాయాలు అందులో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సేవలు చేరేలా పూర్తి స్థాయి కవరేజ్‌పై దృష్టి పెట్టామని అన్నారు. అర్హులైన వారిని పథకాలలో చేర్చడం, పోస్టల్ ఆర్థిక సేవలపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోందని వివరించారు.
*****
(రిలీజ్ ఐడి: 2265427)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10