శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్వాంటం.. ఏఐ.. భవిష్యత్ సాంకేతికతలలో శరవేగంగా భారత్‌ పురోగమనం


· వికసిత భారత్‌-2047 లక్ష్య సాధనలో దేశానికి యువతరం సారథ్యం: డాక్టర్ జితేంద్ర సింగ్

· కేవలం మూడేళ్లలోనే భారత్‌ 1,000 కిలోమీటర్ల సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ లక్ష్యాన్ని అధిగమించింది

· గుజరాత్‌లోని వడోదరలోగల పారుల్ విశ్వవిద్యాలయంలో ‘లక్ష్య-2047’ భవిష్యత్ నైపుణ్య కేంద్రం.. కెడావరిక్‌ సెంటర్.. అత్యాధునిక మెడికల్ సిమ్యులేషన్ సదుపాయాలకు డాక్టర్‌ జితేంద్ర సింగ్ ప్రారంభోత్సవం

· ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక సమీకృత విధానంతో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు.. విద్యావేత్తల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహిస్తోంది

నాడు పోస్టు చేయడమైనది: 08 MAY 2026 6:16PM by PIB Hyderabad

కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం, సెమీకండక్టర్లు సహా డీప్-టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల రంగంలో భారత్‌ ‘శరవేగంగా’ పురోగమిస్తున్నదని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర, (స్వతంత్ర బాధ్యత) ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష మంత్రిత్వ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీంతో వికసిత భారత్‌-2047 సాకారంలో యువత సారథ్యం వహించనుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలోగల పారుల్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ రోజు ‘లక్ష్య-2047’ భవిష్యత్ నైపుణ్య కేంద్రంతోపాటు కెడావరిక్ సెంటర్, అత్యాధునిక మెడికల్ సిమ్యులేషన్ సదుపాయాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు.

ఏఐ, సెమీకండక్టర్లు, సైబర్ భద్రత, క్వాంటం సాంకేతికత వంటి అత్యాధునిక పరిజ్ఞానాలతో ఉన్నత విద్యను అనుసంధానించే దిశగా ప్రభుత్వ విస్తృత కృషిని మంత్రి వివరించారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ), ఎథ్నోటెక్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రచురణాలయం-అంచనాల సంస్థ సహకారంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ధ్రువీకరణలతో 9 భవిష్యత్ సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు శిక్షణ లభిస్తుందని ఆయన చెప్పారు. జాతీయ క్వాంటం మిషన్ కింద దేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ- భారత్‌ కేవలం మూడేళ్లలోనే 1,000 కిలోమీటర్ల సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్‌ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. అంచనా కాలపరిమితిలో సగం కన్నా తక్కువ వ్యవధిలోనే ఈ గమ్యం చేరగలిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల లక్ష్యం వైపు 4 థీమాటిక్ హబ్‌లు, దేశవ్యాప్తంగాగల సంస్థల సహకారంతో ద్వారా వేగంగా దూసుకెళ్తోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ‘ఇండియా ఏఐ మిషన్’, కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటాసెట్‌లు-ఆవిష్కరణలు సహా భవిష్యత్ నైపుణ్యం వగైరాల చుట్టూ బలమైన వ్యవస్థను సృష్టిస్తోందని మంత్రి అన్నారు. ఆవిష్కరణల పరంగా అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట  ఇనుమడిస్తున్నదని చెప్పారు. అంకురావరణ వ్యవస్థ పరంగా దేశం నేడు ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని, అంతేగాక లక్షకు పైగా పేటెంట్లను నమోదు చేసిందని, వాటిలో అధికశాతం భారతీయులు దాఖలు చేసినవేనని ఆయన అన్నారు. అలాగే శాస్త్రవిజ్ఞాన ప్రచురణల పరంగానూ భారత్‌ ప్రపంచ అగ్ర దేశాల జాబితాలో ఒకటిగా నిలిచిందని చెప్పారు. భారత పరిశోధనలు అంతర్జాతీయ గుర్తింపుతోపాటు విస్తృత ప్రశంసలు కూడా పొందుతున్నాయని ఆయన తెలిపారు.

సాంకేతిక పరిణామాలు... ముఖ్యంగా ఏఐ, సైబర్‌ భద్రత, క్వాంటం సాంకేతికతలు, సెమీకండక్టర్ డిజైన్ వంటి రంగాల్లో వేగం పెరుగుతున్న నేపథ్యంలో నిరంతర నైపుణ్యాభివృద్ధి, నైపుణ్య పునశ్చరణ అత్యావశ్యకమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ జనాభాలో దాదాపు 70 శాతం 40 ఏళ్లలోపు వారే కావడమనే జనసంఖ్య లబ్ధి మనకు సానుకూలాంశమని చెప్పారు. రాబోయే రెండుమూడు దశాబ్దాల్లో అంతర్జాతీయ నైపుణ్యం గల శ్రామిక శక్తి కూడలిగా భారత్‌ ఎదగడానికి ఇది కీలక అవకాశాన్నిస్తోందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, సంప్రదాయ విభాగాలకు అతీతంగా ఆవిష్కరణలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి దిశగా సమగ్ర, సహకార విధానాన్ని అనుసరించందని చెప్పారు. తదనుగుణంగా విద్యాసంస్థలు, అంకుర సంస్థలతోపాటు ప్రైవేట్ రంగం నుంచి మరింతగా భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన జాతీయ విద్యా విధానం-2020, జాతీయ క్వాంటం మిషన్, ఇండియా ఏఐ మిషన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సహా వివిధ అంకుర చేయూత కార్యక్రమాల వంటివాటిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సార్వజనీన శాస్త్రవిజ్ఞాన పురోగమనానికి ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళా శాస్త్రవేత్తలు, పాఠశాల విద్యార్థులు, షెడ్యూల్డ్ కులాలు-తెగల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అంతేకాకుండా ‘పర్స్’, ‘ఫిస్ట్’, ‘స్తుతి’, టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్‌ వంటి పథకాల ద్వారా విశ్వవిద్యాలయాలు, యువ పరిశోధకులకు ఇస్తున్న మద్దతు యంత్రాంగాల గురించి విశదీకరించారు. దేశవ్యాప్తంగా విజ్ఞాన, పరిశోధన, మౌలిక సదుపాయాలు సహా ఆవిష్కరణ అవకాశాలను అందరికీ అందుబాటులోకి తేవడం కోసమే ఈ కార్యక్రమాలు రూపొందాయని ఆయన అన్నారు.

కృత్రిమ మేధ గురించి వివరిస్తూ- సార్వజనీనత, బాధ్యత, ప్రజా శ్రేయస్సు ప్రాధాన్య విధానాన్ని భారత్‌ అనుసరిస్తున్నదని మంత్రి గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ‘గ్లోబల్ సౌత్ ఏఐ సమ్మిట్’లో బాధ్యతాయుత ఏఐపై ఢిల్లీ తీర్మానానికి ఆమోదముద్ర గురించి ప్రస్తావిస్తూ- సమాజంలోని అత్యంత బలహీన-వెనుకబడిన వర్గాలకు సాంకేతికత ప్రయోజనాలు అందాలని స్పష్టం చేశారు. “కృత్రిమ మేధ వినియోగానికి తగినంత వివేచన అవశ్యం” అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, సామాజిక రూపాంతరీకరణలో నైతిక విలువలు, సమానత్వం ప్రాతిపదికగాగల కృత్రిమ మేధ శక్తిమంతమైన ఉపకరణం కాగలదని ఆయన వివరించారు.

అణు వైద్య పరిశోధన, అనువర్తనాల రూపకల్పన దిశగా భారత అణు రంగంలో మరింతగా ప్రైవేట్‌ భాగస్వామ్యం కోసం ప్రభుత్వం అవకాశాలు కల్పించడాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలలో ఆవిష్కరణలతోపాటు వృత్తిపరమైన అవకాశాల విస్తరణలో ఇదొక కీలక మలుపు కాగలదని ఆయన అభివర్ణించారు.

వికసిత భారత్ స్వప్న సాకారం వైపు ప్రస్థానంలో యువత చురుగ్గా పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047 సంవత్సరం నాటికి శక్తిసామర్థ్యాలు, వృత్తి నైపుణ్యాల్లో భారత యువత అగ్రస్థానానికి చేరుతుందన్నారు. ఆవిష్కరణలు, విజ్ఞానం, నైపుణ్యం గల మానవ వనరులతో భారత వృద్ధి పయనం మరింత వేగం పుంజుకునేలా వారి సామర్థ్య వికాసానికి తగిన అవకాశాల కల్పన ప్రభుత్వ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2259245) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी