గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
దేశమంతటా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల నిర్మాణంలో పురోగతిపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి సమీక్ష
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 9:04PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల (ఈఎమ్ఆర్ఎస్)ల నిర్మాణంలో పురోగతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువల్ ఒరామ్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశాన్ని గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు, కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ)ల సీఎమ్‌డీలు, ఎమ్‌డీలు, సీనియర్ అధికారులతో పాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, మిజోరమ్, ఒడిశా, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు దృశ్య మాధ్యమ పద్ధతిలో పాల్గొన్నారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న పథకాల్లో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల (ఈఎమ్ఆర్ఎస్)లు ఒక ప్రధాన పథకం. ఈ పథకాన్ని దూర ప్రాంతాల్లోని షెడ్యూల్డు తెగ (ఎస్‌టీ)ల విద్యార్థులకు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు నాణ్యమైన ఆశ్రమ విద్యను బోధించడానికి ఉద్దేశించారు. గిరిజన బాలబాలికల్లో విద్య పరమైన అంతరాల్ని తొలగించి, వారి సమగ్ర వికాసాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.
గిరిజన బాలబాలికల సమగ్ర వికాసంలో భాగంగా వారికి విద్యాబుద్ధులు చెప్పి, క్రీడలలో ఆసక్తిని పెంచి, వారిలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతారు.
ఈఎమ్ఆర్ఎస్ నిర్మాణ పనుల్లో భౌతిక పురోగతినీ, ఆర్థికసహాయ సంబంధిత పురోగతినీ గౌరవ కేంద్ర మంత్రి విస్తృత స్థాయిలో సమీక్షించారు. సమావేశంలో సీపీడబ్ల్యూడీ, హెచ్ఎస్‌సీఎల్, టీసీఐఎల్, డబ్ల్యూఏపీసీఓఎస్, బీ అండ్ ఆర్, ఈపీఐఎల్, ఎమ్ఏఎన్ఐడీసీఓ, ఎమ్‌టీడీసీ, ఎన్‌పీసీసీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల వంటి ప్రధాన కార్యాచరణ సంస్థలు తమ పనుల్లోని ప్రగతిని గురించి, ఆయా పనులను పూర్తి చేయడానికి ఖరారు చేసిన గడువులను గురించి వివరించాయి.
ఏజెన్సీవారీ, రాష్ట్రం వారీ పనితీరును సమీక్షించారు. దీనిలో భాగంగా గడువు, నాణ్యత ప్రమాణాలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపైన కూడా దృష్టిని కేంద్రీకరించారు.
దూర ప్రాంతాల, ప్రయోజనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్న ప్రాంతాల్లో గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలది కీలక పాత్ర అనీ, ఈ కారణంగా ఈ పాఠశాలల పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సివుందనీ గౌరవ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పీఎస్‌యూలు, సీపీడబ్ల్యూడీ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సహా అన్ని కార్యాచరణ ఏజెన్సీలు ప్రాజెక్టు స్థలాల్లో జనశక్తితో పాటు వనరుల్ని కూడా సమర్థంగా వినియోగించుకుంటూ నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆయన ఆదేశాలిచ్చారు. పనులను దగ్గరుండి పర్యవేక్షించడానికి తరచుగా క్షేత్ర పర్యటనలను చేపట్టాలని సీనియర్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అంశాలన్నిటినీ ప్రాధాన్యం ప్రాతిపదికన పరిష్కరించాల్సిందిగా గౌరవ కేంద్ర మంత్రి రాష్ట్రాల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ అంశాల్లో భూమి, అడవులకు సంబంధించిన క్లియరెన్సులు కూడా ఉన్నాయి.
ఈఎమ్ఆర్ఎస్ వారీ అంశాలతో పాటు, పనులను అనుకున్న సమయానికే పూర్తి చేయడానికి సంబంధించిన కార్య ప్రణాళికలు సహా అన్ని వర్తమాన ప్రాజెక్టులకు చెందిన తాజా వివరాలతో కూడిన నెలవారీ ప్రగతి నివేదికలను మంత్రిత్వ శాఖకూ, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్‌టీఎస్)కూ సమర్పించాల్సిందని నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల్లో జాప్యం జరిగితే సంబంధిత నిర్మాణ ఏజెన్సీని బాధ్యులను చేయనున్నారు.
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గౌరవ కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు ఒక పరివర్తన పూర్వక కార్యక్రమమనీ, ఈ కార్యక్రమం ఉద్దేశం గిరిజనుల పిల్లలకు అధిక నాణ్యత కలిగిన ఆశ్రమ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి సాధికారతను కల్పించడమనీ ఆయన వివరించారు.
వికసిత్ భారత్‌ను 2047కల్లా సాధించాలనేదే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కోణమని గౌరవ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దీనిలో సమ్మిళిత అభివృద్ధికీ, సమానావకాశాలను అందించడానికీ విశేష ప్రాధాన్యం ఉందని చెప్పారు. దేశ నిర్మాణంలో గిరిజన యువత చురుకైన భాగస్వామ్యాన్ని పంచుకోవాలంటే గిరిజన ప్రాంతాల్లో విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందనీ, దీంతో అభివృద్ధి చెందిన, స్వయంసమృద్ధ, సాధికార పూర్వక భారత్ దిశగా పయనించగలమనీ మంత్రి అన్నారు.
గిరిజన మంత్రిత్వ శాఖ ప్రధాన పథకాల్లో ఈఎమ్ఆర్ఎస్ ఒకటని ఆ శాఖ కార్యదర్శి శ్రీమతి రంజనా చోప్రా అన్నారు. అప్రోచ్ రోడ్లు, నీటి ఎద్దడి, హెచ్‌టీ, ఎల్‌టీ విద్యుత్తు లైన్లను వేరే ప్రాంతాలకు మార్చాల్సిరావడం వంటివి ఈ ప్రాజెక్టు పురోగతిపై ప్రభావం చూపుతున్న అంశాలనీ, వీటిని అతి త్వరగా పరిష్కరించడంపై శ్రద్ధ తీసుకోవాలనీ ఆమె స్పష్టం చేశారు. ఈ సమస్యల్ని నిర్ణీత కాలంలో పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో, జిల్లా అధికార యంత్రాంగాలతో సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకోవాల్సిందిగా కార్యాచరణ ఏజెన్సీలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈఎమ్ఆర్ఎస్ ప్రాజెక్టుల విషయంలో పీఎమ్ గతి శక్తి పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు.
నిర్మాణ పనుల సమగ్ర స్థితితో పాటు పనులు పూర్తి చేయడానికి సంబంధించిన నిర్ణీత కార్య ప్రణాళికను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్‌టీఎస్) కమిషనరు డాక్టర్ ప్రతిమా వర్మ సమావేశంలో వివరించారు. మంత్రిత్వ శాఖ 728 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలకు ఆమోదం తెలిపిందనీ, వాటిలో 428 పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయిందనీ, 249 పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయనీ సమావేశం దృష్టికి ఆమె తీసుకువచ్చారు. 46 పాఠశాల భవనాలు పూర్వ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వేగవంతమైన కార్యాచరణనీ, నాణ్యతా పూర్వక నిర్మాణాన్నీ నిర్ధారించడానికి ఎన్ఈఎస్‌టీఎస్ తీసుకున్న చర్యల్ని కూడా ఆమె ప్రస్తావించారు.
గిరిజన వ్యవహారాల శాఖలో ఈఎమ్ఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి శ్రీ బి.ఎన్. ప్రసాద్ వందన సమర్పణ చేయడంతో, సమావేశాన్ని ముగించారు.

***
(రిలీజ్ ఐడి: 2258374)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7