పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని ‘ఎన్‌ఐఆర్‌డీ-పీఆర్‌’ ప్రాంగణంలో ‘స్వయంసమృద్ధ పంచాయతీ కార్యక్రమం’పై అవగాహన సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 02 MAY 2026 4:09PM by PIB Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్‌ఐఆర్‌డీ-పీఆర్‌) ప్రాంగణంలో 2026 మే 2న ‘స్వయంసమృద్ధ పంచాయతీ కార్యక్రమం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ సహకారంతో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ నిర్వహించిన ఈ సదస్సులో పలువురు ఉన్నతాధికారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు సహా రాష్ట్రం నలుమూలల నుంచి 400 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో స్వీయ వనరుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచిన 70 మంది పంచాయతీ సర్పంచులు కూడా ఉన్నారు.

   ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రధానోపన్యాసం చేశారు. ‘స్వయంసమృద్ధ భారత్‌, వికసిత భారత్‌’ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధన దిశగా ‘స్వయంసమృద్ధ పంచాయతీ’ల పాత్రను, ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. క్షేత్రస్థాయి పరిపాలనకుగల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ- స్వావలంబన, సాధికారతగల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీలే కీలక ఉపకరణాలని, పౌరులలో చైతన్యం రగిలించడంలో అవి ఎంతగానో తోడ్పడగలవని అన్నారు. అలాగే, స్వావలంబిత సమాజాల రూపకల్పన, సుసంఘటిత సామూహిక కృషికి సారథ్యం వహించగల సామర్థ్యం వాటికున్నాయని ఆయన ఉద్ఘాటించారు.

పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన, శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఒక వ్యక్తి వారసత్వమే అతని వాస్తవిక నాయకత్వ పటిమను నిర్వచిస్తుందని పేర్కొన్నారు. వృద్ధి, ప్రగతి సంబంధిత కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విస్పష్ట దృక్పథానికిగల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేశారు. దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దగల సాధికార, పునరుత్థాన, స్వయంసమృద్ధ పంచాయతీలకు రూపమివ్వాల్సిన ఆవశ్యకతను ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు మార్పు దిశగా తమనుతాము వైతాళికులుగా భావించుకుంటూ ముందడుగు వేయాలని వారిని ప్రోత్సహించారు.

   అనంతరం తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.దానకిషోర్ మాట్లాడారు. ఆర్థికంగా సాధికారత సాధించిన పంచాయతీల ద్వారానే భారత స్వావలంబన ప్రస్థానం వేగం పుంజుకోగలదని చెప్పారు. స్వీయ వనరుల ద్వారా ఆదాయం పెంచుకుంటూ, గ్రాంట్లపై పరాధీనతను తగ్గించుకోవాలని సూచించారు. అదే సమయంలో తమకందే ప్రభుత్వ నిధులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవాలని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించినప్పటికీ వినూత్న ఆవిష్కరణలు, వ్యూహాత్మక ప్రణాళిక, ఉత్తమ విధానాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. స్థానిక యాజమాన్యం, జవాబుదారీతనం, క్రియాశీల సామాజిక భాగస్వామ్యంతోనే సుపరిపాలన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అత్యుత్తమ పనితీరు కనబరిచే పంచాయతీల అనుభవం నుంచి నేర్చుకుంటూ, విజయవంతమైన నమూనాలను అనుకరించాలని సర్పంచులకు సూచించారు.

పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ముక్తా శేఖర్, తెలంగాణ పంచాయతీ రాజ్‌ కమిషనర్ శ్రీమతి డి.దివ్య, హైదరాబాద్ హడ్కో లిమిటెడ్ ప్రాంతీయాధిపతి శ్రీ పి.సుభాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమిషనర్, ‘స్వయంసమృద్ధ పంచాయతీల కార్యక్రమం’ నోడల్ అధికారి శ్రీ పి.జె.వెస్లీ మాట్లాడుతూ- ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. సమర్థ స్థానిక పరిపాలనలో భాగంగా వినూత్న, సుస్థిర విధానాలను అనుసరించాల్సిందిగా పంచాయతీ ప్రతినిధులను కోరారు.

   నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ సింగ్ రావత్ ప్రసంగిస్తూ- జాతీయ పురోగమనంలో అనివార్య భాగస్వాములుగా గ్రామీణ సమాజాలను వికసిత్ భారత్ దృక్కోణం పరిగణిస్తున్నదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణ స్థానిక సంస్థల ద్వారా పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ నిరంతర కృషిని ఆయన ప్రశంసించారు. ఆర్థిక వృద్ధి, స్వావలంబన దిశగా పంచాయతీలను బలమైన చోదకశక్తులుగా రూపుదిద్దడానికి సమన్వయ సహిత సంస్థాగత కృషి అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

స్వయంసమృద్ధ పంచాయత్ పోర్టల్ గురించి పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సాంకేతిక బృందం ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించింది. ఇందులో భాగంగా అప్లికేషన్ వర్క్‌ఫ్లో, డాష్‌బోర్డ్‌ల పూర్తి వివరాలను తెలుపుతూ, డిజిటల్‌ ఉపకరణాల సమర్థ వినియోగంపై కార్యక్రమంలో పాల్గొన్నవారికి ఆచరణాత్మక అవగాహన కల్పించింది.

   ఈ అవగాహన సదస్సులో భాగంగా పరస్పర అవగాహన కల్పించే విధంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ఈ సందర్భంగా ప్రతినిధులందరితో ఇష్టాగోష్ఠిగా సంభాషించారు. వివిధ అంశాలపై సందేహ నివృత్తితోపాటు ప్రతిపాదనలపై చర్చ, నిర్మాణాత్మక సంభాషణ, విజ్ఞాన ఆదానప్రదానం దిశగా ఈ సదస్సు ఒక వేదికగా మారింది.

   దేశవ్యాప్తంగా స్వయంసమృద్ధ, చైతన్యపూరిత, ఆర్థిక సాధికారతగల పంచాయతీలను రూపుదిద్దడంపై చర్చ, విజ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య వికాసం దిశగా ఈ సదస్సు ఉపయోగపడింది.

స్వయంసమృద్ధ పంచాయతీ కార్యక్రమం

   దేశవ్యాప్తంగా అర్హతగల పంచాయతీలు, సమితులకు సొంత ఆదాయ వనరుల బలోపేతం సహా ఆర్థికంగా లాభదాయకమైనవే కాకుండా బ్యాంకు రుణాలు పొందగల ప్రాజెక్టుల రూపకల్పన-అమలులో మద్దతివ్వడమే ‘స్వయంసమృద్ధ పంచాయతీ కార్యక్రమం’ లక్ష్యం. ఈ మేరకు జాతీయ స్థాయిలో పారదర్శక పోటీ ప్రక్రియ ద్వారా ఎంపికైన పంచాయతీల ప్రతిపాదనల అమలులో ప్రాజెక్టు రూపకల్పన నుంచి ఆర్థిక వ్యవహారాల ముగింపు దాకా ప్రత్యేక సాంకేతిక సహాయం లభిస్తుంది. ఇందులో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటివి అంతర్భాగంగా ఉంటాయి. సామాజిక భాగస్వామ్యం విషయంలో గ్రామసభ ఆమోదం తప్పనిసరి. పంచాయతీల స్థాయిలోని ఆలోచనలు ఆలంబనగా, అనుమతి పొందిన ప్రతిపాదనలు సాంకేతిక సహాయంతో ఆచరణీయ ప్రాజెక్టులు కాగలవు. స్వావలంబన, ఆర్థిక ఆత్మవిశ్వాసం గల నవ తరం పంచాయతీలకు రూపమివ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నాలుగేళ్ల నుంచీ అమలవుతోంది. ఆర్థిక స్వాతంత్ర్యం, స్థానిక సుపరిపాలన పరస్పర ఆధారితాలనడానికి ప్రతి పంచాయతీ ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తోంది.

****


(రిలీజ్ ఐడి: 2257518) సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी