హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జ‌న‌గ‌ణ‌న‌లో భాగంగా రేప‌టి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌


ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు ప్ర‌క్రియ‌

ప్ర‌జ‌లు సొంతంగా జ‌న‌గ‌ణ‌న‌లో పాల్గొనేందుకు అవ‌కాశం

జ‌న‌గ‌ణ‌న‌ తెలంగాణ డైరెక్ట‌ర్ శ్రీమ‌తి భార‌తీ హోళికెరి

నాడు పోస్టు చేయడమైనది: 25 APR 2026 4:31PM by PIB Hyderabad

జ‌న‌గ‌ణ‌న‌-2027లో భాగంగా తెలంగాణ రేప‌టి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న‌ట్టు డైరెక్ట‌ర్ ఆఫ్ సెన్స‌స్ ఆప‌రేష‌న్స్‌, తెలంగాణ డైరెక్ట‌ర్ శ్రీమ‌తి భార‌తీ హోళికెరి తెలిపారు. సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ప్ర‌క్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆమె ప‌త్రికా స‌మావేశంలో మాట్లాడారు.

ఈసారి జ‌రుగుతున్న జ‌న‌గ‌ణ‌న ప్రాముఖ్య‌త‌ను శ్రీమతి భార‌తీ హోళికెరి వివ‌రిస్తూ.. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రుగుతున్న మొద‌టి జ‌న‌గ‌ణ‌న అని పేర్కొన్నారు. డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో జరుగుతున్న తొలి జ‌న‌గ‌ణ‌న కూడా ఇదేన‌ని అన్నారు. స్వాతంత్య్రం త‌ర్వాత మొద‌టిసారి కుల‌గ‌ణ‌న జ‌రుగుతుండ‌టం కూడా ఈసారి జ‌న‌గ‌ణ‌న‌లో ప్ర‌త్యేక‌మ‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా మొద‌టిసారిగా జ‌న‌గ‌ణ‌న ప్ర‌క్రియ‌లో ఈసారి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ప్ర‌క్రియ పాటిస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు నేరుగా జ‌న‌గ‌ణ‌న‌లో పాల్గొనేందుకు ఇది ఒక మంచి అవ‌కాశమ‌ని ఆమె చెప్పారు.

ప్ర‌జ‌లు https://se.census.gov.in వెబ్ పోర్ట‌ల్ ద్వారా స్వ‌చ్ఛందంగా, సొంతంగా జ‌న‌గ‌ణ‌న‌కు త‌మ వివ‌రాల‌ను అందించ‌వ‌చ్చ‌ని శ్రీమ‌తి భార‌తీ హోళికెరి తెలిపారు. సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ అనేది త‌ప్ప‌నిస‌రి కాద‌ని, కేవ‌లం ప్ర‌జ‌ల‌కు ఒక సౌల‌భ్యం మాత్ర‌మేన‌ని, దీని వ‌ల్ల జ‌న‌గ‌ణ‌న‌లో డేటా సేక‌ర‌ణ వేగ‌వంత‌మ‌వుతుంద‌ని, క్షేత్ర‌స్థాయిలో ఎన్యుమ‌రేట‌ర్లకు ప‌నిభారం త‌గ్గుతుంద‌ని ఆమె చెప్పారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ స‌హా 16 భాష‌ల్లో పోర్ట‌ల్ ప‌నిచేస్తుంద‌ని, ఈ పోర్ట‌ల్ అత్యంత సుర‌క్షిత‌మైన‌ద‌ని, ఇందులో డేటా సుర‌క్షితంగా ఉంటుంద‌ని తెలిపారు. సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ప్ర‌క్రియ‌కు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా పోర్ట‌ల్‌లో ఉన్న స‌మాచారం నివృత్తి చేస్తుంద‌ని, ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల మ‌ధ్య‌ 1855 హెల్ప్‌లైన్ నెంబ‌రుకు ఫోన్ చేసి కూడా తెలుసుకోవ‌చ్చ‌ని చెప్పారు.

జ‌న‌గ‌ణ‌న‌లోని మొత్తం 33 ప్ర‌శ్న‌ల‌కు గానూ సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ద్వారా 27 ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇవ్వొచ్చ‌ని, మిగ‌తా ఆరు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను జ‌న‌గ‌ణ‌న ఎన్యుమ‌రేట‌ర్ వ‌చ్చి న‌మోదు చేసుకుంటార‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ఎలాంటి డాక్యుమెంట్లు, ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ప్ర‌క్రియ‌లో జియోఫెన్సింగ్ ఉండ‌ద‌ని, ప్ర‌జ‌లు ఎక్క‌డినుంచైనా ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

జ‌న‌గ‌ణ‌న అనేది అన్ని స‌ర్వేల‌కు మాతృస‌ర్వే వంటిద‌ని, జ‌న‌గ‌ణ‌న ద్వారా స‌మ‌గ్ర‌మైన డేటా వ‌స్తుంద‌ని ఆమె పేర్కొన్నారు. స‌రైన విధానాలు, అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు రూపొందించేందుకు జ‌న‌గ‌ణ‌న డేటా అత్యంత కీల‌క‌మ‌ని అన్నారు. మ‌న కోసం, మ‌న పిల్ల‌ల కోసం, భావి త‌రాల కోసం ఈ జ‌న‌గ‌ణ‌న ముఖ్య‌మైన‌ద‌ని, కాబ‌ట్టి, ప్ర‌జ‌లు క‌చ్చిత‌త్వంతో త‌మ వివ‌రాల‌ను ఇవ్వాల‌ని, ఇది ప్ర‌జ‌ల బాధ్య‌త అని ఆమె అన్నారు. జ‌న‌గ‌ణ‌న‌లో వ‌చ్చే డేటా క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబించే అద్దంలా ఉండాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో పాటు కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌(క్యూర్‌)లో జ‌న‌గ‌ణ‌న ప్ర‌క్రియ‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్‌ వివ‌రించారు. ఒక డివిజ‌న్‌ను యూనిట్‌గా తీసుకొని జ‌న‌గ‌ణ‌న జ‌ర‌ప‌నున్న‌ట్టు చెప్పారు. క్యూర్ ప‌రిధిలో 21,866 ఎన్యుమ‌రేట‌ర్లు, 3,652 మంది సూప‌ర్‌వైజ‌ర్లు జ‌న‌గ‌ణ‌న విధుల్లో ఉంటార‌ని, స‌ర్కిల్‌కు ఒక‌రు చొప్పున 60 మంది డిప్యూటీ క‌మిష‌న‌ర్లు ఇన్‌ఛార్జ్‌లుగా ఉంటార‌ని, కంటోన్మెంట్‌కు ఒక‌రు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారని తెలిపారు. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్ ప్ర‌క్రియ‌లో పాల్గొనాల‌ని ఆయ‌న కోరారు.

అనంత‌రం జ‌న‌గ‌ణ‌న‌కు సంబంధించిన పోస్ట‌ర్‌, ప్ర‌చార సామాగ్రిని ఆవిష్క‌రించారు.

***


(రిలీజ్ ఐడి: 2255522) సందర్శకుల సూచీ సంఖ్య : : 202
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English