ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చెన్నైలో స్వదేశీ సిలికాన్ ఫోటోనిక్స్ టెక్నాలజీ ఆవిష్కరణ


'సిలికాన్ ఫోటోనిక్స్ ప్రాసెస్ డిజైన్ కిట్', 'యూనివర్సల్ ప్రోగ్రామబుల్ ఫోటోనిక్ ఐసీ టెస్ట్ ఇంజిన్'లను అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్.. చైన్నైలో జరిగిన ఆవిష్కరణ

సిలికాన్ ఫోటోనిక్స్ సాంకేతికలో భారత్ సార్వభౌమాధికారం సాధించే దిశగా నమోదైన ఒక కీలక ఘట్టం

దేశంలోని ఫోటోనిక్స్ పరిశోధన, అభివృద్ధి వర్గాలకు ఒక ఉమ్మడి జాతీయ కేంద్రంగా ఉపయోగపడనున్న ఈ సౌకర్యం

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 4:39PM by PIB Hyderabad

రెండు సిలికాన్ ఫోటోనిక్స్ సాంకేతిక పరిష్కారాలను కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ఆవిష్కరించారు. ఇందులో ఒకటి ఫోటోనిక్స్ చిప్ తయారీకి సంబంధించిన 'సిలికాన్ ఫోటోనిక్స్ ప్రాసెస్ డిజైన్ కిట్ (పీడేకే)' కాగా.. రెండోది ‘స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'యూనివర్సల్ ప్యాకేజ్డ్ పీపీఐసీ (ప్రోగ్రామబుల్ ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) టెస్ట్ ఇంజిన్'. రెండో దానిని ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) మద్దతుతో నడుస్తోన్న సీఓఈ-సీపీపీఐసీఎస్‌లో [https://cppics.iitm.ac.in/] తయారు చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) సీఈఓ శ్రీ అమితేష్ సిన్హా.. ఐఐటీ మద్రాస్ డీఓఈఈ విభాగం హెచ్‌ఓడి ప్రొఫెసర్ శాంతి భట్టాచార్య.. ఈ కేంద్రానికి సంబంధించిన గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 2026 ఏప్రిల్ 24న శుక్రవారం నాడు ఈ కార్యక్రమం జరిగింది. సిలికాన్ ఫోటోనిక్స్ సాంకేతిక విషయంలో భారత్ సార్వభౌమాధికారం సాధించడంలో ఇది ఒక ప్రధాన ఘట్టంగా ఉంటుంది. ఇది భారతీయ ఫోటోనిక్స్ పరిశోధన- అభివృద్ధి (ఆర్- డీ) వర్గాలకు ఒక ఉమ్మడి జాతీయ కేంద్రంగా సేవలందిస్తుంది.

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సిలికాన్ ఫోటోనిక్స్ ప్రాసెస్ డిజైన్ కిట్ (పీడీకే) 50కి పైగా ధ్రువీకరించిన భాగాలను కలిగి ఉంది. ఈ లైబ్రరీ అత్యాధునిక ఫోటోనిక్ ఐసీలను అభివృద్ధి చేయడానికి భారతదేశంలోని పరిశ్రమలు, అంకురాలు, విద్యాసంస్థలు, రక్షణ రంగ పరిశోధన సంస్థలకు కీలకమైన డిజైన్ సామర్థ్యాన్ని అందిస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'యూనివర్సల్ పీపీఐసీ టెస్ట్ ఇంజిన్'.. వివిధ రకాల అప్లికేషన్ల కోసం ఫోటోనిక్, ఆప్టోఎలక్ట్రానిక్ మాడ్యూళ్లను పరీక్షించే ఒక అత్యాధునిక ఆటోమేటెడ్ క్యారెక్టరైజేషన్ ప్లాట్‌ఫాంగా ఉంటుంది. 

ఈ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టనున్న తదుపరి దశ సాంకేతిక అభివృద్ధిని కూడా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ప్రారంభించారు. సీఓఈ-సీపీపీఐసీఎస్ బృందాన్ని అభినందించిన ఆయన.. భారతదేశంలో సిలికాన్ ఫోటోనిక్స్ సాంకేతికత ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 'సిలికాన్ ఫోటోనిక్స్ ఫ్యాబ్' ఏర్పాటు ద్వారా దీనిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) అదనపు కార్యదర్శి, ఐఎస్ఎం సీఈఓ శ్రీ అమితేష్ సిన్హా మాట్లాడుతూ.. అభివృద్ధి చేసిన అత్యాధునిక సిలికాన్ ఫోటోనిక్స్ సాంకేతికతకు సంప్రదాయ కంప్యూటింగ్, క్వాంటం రంగాలలో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. సరైన పరిశ్రమ భాగస్వామితో తదుపరి సాంకేతిక మెరుగుదలలు, ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఈ రకమైన సాంకేతికతకు రాబోయే 'ఐఎస్ఎం 2.0 (ఆర్- డీ వర్టికల్)' కింద మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. వాణిజ్య సామర్థ్యాలను విజయవంతంగా ప్రదర్శించిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్యాకేజింగ్ సదుపాయాలతో కూడిన సిలికాన్ ఫోటోనిక్స్ ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయొచ్చని ఆయన తెలిపారు.

"ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి మా కేంద్రం సిలికాన్ ఫోటోనిక్స్ ఎంపీడబ్ల్యూ ఫ్యాబ్రికేషన్ రన్‌లను ప్రారంభించనుంది. అదే సమయంలో సమగ్ర పరీక్షలు, ప్యాకేజింగ్, మాడ్యూల్ క్యారెక్టరైజేషన్ సేవలను అందిస్తుంది" అని ప్రధాన పరిశోధకులు ప్రొఫెసర్ బిజోయ్ కృష్ణ దాస్ అన్నారు. "ఇది సాధ్యం కావడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అందిస్తోన్న నిరంతర మద్దతును మేం ఎంతో అభినందిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. 

సిలికాన్ ఫోటోనిక్స్ సీఓఈ-సీపీపీఐసీఎస్.. సీఎంఓఎస్ అనుకూల సిలికాన్ ఫోటోనిక్స్ సాంకేతికతను ఉపయోగించుకుంటూ 'పీఆర్‌డీఎం (ప్రొడక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్)' నమూనాను అనుసరిస్తోంది. ఇందులో ఫౌండ్రీ భాగస్వామిగా సిల్టెర్రా మలేషియా.. ఫోటోనిక్ ఐసీ ప్యాకేజింగ్ భాగస్వామిగా బెంగళూరుకు చెందిన ఇజ్మో మైక్రోసిస్టమ్స్ వ్యవహరిస్తున్నాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2255510) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी