పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండో దశ ఎఫ్‌టీవో ర్యాంకింగ్‌ను విడుదల చేసిన


పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

దేశ విమానాయాన శిక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఎఫ్‌టీవో ర్యాంకింగ్ విధానం

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 3:45PM by PIB Hyderabad

డీజీసీఏ ఆమోదం పొందిన విమానయాన శిక్షణ సంస్థల (ఎఫ్‌టీవోలు) రెండో దశ (2026 ఏప్రిల్) ర్యాంకింగ్‌లను.. మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మంత్రి మార్గనిర్దేశంలో ఈ ర్యాంకింగ్ వ్యవస్థను రూపొందించగా.. 2025 అక్టోబరు 1న మొదటి దశ ర్యాంకింగ్‌లు ప్రచురితమయ్యాయి.

 

డీజీసీఏ ఆమోదం పొందిన విమానయాన శిక్షణ సంస్థల్లో ప్రమాణాలను పెంచడం, భద్రతను మెరుగుపరచడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం లక్ష్యంగా.. ఈ కీలక సంస్కరణను డీజీసీఏ చేపట్టింది. విమానయాన శిక్షణ సంస్థల పనితీరును నిష్పాక్షికంగా పోల్చడానికి, వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి ఈ డేటా ఆధారిత విధానం దోహదపడుతుంది.

 

ఈ సందర్భంగా మంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘పైలట్ శిక్షణలో పారదర్శకతను పెంచడం, యువతకు విమానయాన రంగాన్ని ఒక ఆకర్షణీయమైన వృత్తి మార్గంగా నిలపడమే.. ఈ ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక నా ముఖ్యోద్దేశం. పైలట్లు కావాలనుకుంటున్న ఆశావహులు, వారి కుటుంబ సభ్యులతో జరిగిన నా చర్చల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. వారు సరైన నిర్ణయం తీసుకునేలా స్పష్టతను, నమ్మకాన్ని కలిగించే ఓ వ్యవస్థను సంస్థాగతం చేయాలన్నదే నా ఆలోచన’’ అని ఆయన వెల్లడించారు.

 

ఈ రంగంలో అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘‘ప్రాంతీయ విమానయాన అనుసంధానంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విప్లవాత్మక దృక్పథంతో.. భారతీయ గగనతలం నేడు సరికొత్త అవకాశాలతో కళకళలాడుతోంది. మరో 50 విమానాశ్రయాల ఏర్పాటు, దేశ విమానయాన సంస్థలు మరో 500 విమానాలను సమకూర్చుకోవడం, హబ్ అండ్ స్పోక్ విధానంతో ప్రధాన భారతీయ విమానాశ్రయాలు రవాణా కేంద్రాలుగా రూపుదిద్దుకోవడం ద్వారా.. వచ్చే అయిదేళ్లలో దేశ వైమానిక రంగం భారీగా పురోగమించబోతున్నది. వీటికితోడు సవరించిన ఉడాన్ పథకం ద్వారా, మునుపెన్నడూ లేనివిధంగా కేటాయించిన రూ. 29,000 కోట్లతో ప్రాంతీయ అనుసంధానానికి కూడా భారీగా వెసులుబాటు కలుగుతుంది. దాంతో విమానయాన రంగంపై ఆసక్తి ఉన్న భారతీయ యువతకు వృత్తిపరంగా గొప్ప అవకాశాలు లభిస్తాయి. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో దాదాపు మరో 30,000 మంది పైలట్ల అవసరం ఉంటుందని అంచనా” అని ఆయన వివరించారు.

 

ఎఫ్‌టీవో ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి.. భారత విమానయాన శిక్షణ రంగంలో పలు సానుకూల పరిణామాలను గమనించవచ్చు. శిక్షణ నిమిత్తం విమానాలు గాల్లో ప్రయాణించే సమయం 32 శాతం నుంచి 50 శాతానికి పెరగడం, వివిధ శిక్షణ సంస్థల్లో విమానాల సంఖ్య పెరగడం, శిక్షణ సామర్థ్యం మెరుగుపడడం వంటివి ఇందులో ముఖ్యమైనవి. ఫలితంగా అభ్యర్థులు సీపీఎల్‌ను పొందేందుకు అవసరమైన ఫ్లయింగ్ నిబంధనలను పూర్తి చేయడానికి పట్టే సమయం తగ్గింది.

అంతేకాకుండా నిష్పాక్షికమైన పనితీరు సూచికల ఆధారంగా, పైలట్ ఆశావహులు తెలివైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ర్యాంకింగ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ విమానయాన కేంద్రంగా నిలవాలన్న దేశ లక్ష్యానికి అనుగుణంగా.. భారత్‌లో పైలట్ శిక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక ముందడుగు.

 

‘‘ఉన్నతమైన మా ఆశయం రెండు విధాలుగా ఉంది. మొదటిది- అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునేలా భారతీయ ఎఫ్‌టీవోలను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయంగా వాటి పోటీతత్వాన్ని పెంచడం. రెండోది- ‘ట్రైన్ ఇన్ ఇండియా, ఫ్లై ఇన్ ఇండియా’ నినాదంతో పైలట్ శిక్షణలో స్వావలంబనను సాధించడం. ఎఫ్‌టీవో విధానాన్ని సరళీకరించడం, విమానాశ్రయ రాయల్టీలను రద్దు చేయడం, భూమి అద్దెలను క్రమబద్ధీకరించడం సహా.. ఈ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక చర్యలు తీసుకున్నాం. అలాగే, సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం.. సీపీఎల్ పరీక్షల ప్రక్రియను డీజీసీఏ పూర్తిగా డిజిటలీకరించింది. చరిత్రాత్మక భారతీయ వాయుయాన్ అధినియమం ప్రకారం.. ఇప్పుడు సీపీఎల్, ఆర్టీఆర్ లైసెన్సుల కోసం ఒకే విండో విధానం అందుబాటులోకి వచ్చింది’’ అంటూ దేశంలో పైలట్ శిక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన విస్తృతమైన చర్యలను మంత్రి వెల్లడించారు.

 

‘‘విమానయాన శిక్షణలో అనేక ప్రోత్సాహకరమైన చర్యల ఫలితంగా.. గత ఎనిమిదేళ్లలో జారీ చేసిన సీపీఎల్‌ల సంఖ్య 2.5 రెట్లకు పైగా పెరిగింది. 2024, 2025 సంవత్సరాల్లో ఈ సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గత 18 నెలల్లో ఆరు కొత్త ఎఫ్‌టీవోలకు అనుమతి లభించింది. మరో ఆరు సంస్థలు అనుమతి పొందే ప్రక్రియలో ఉన్నాయి’’ అని ఈ రంగంలో పురోగతిని మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు వివరించారు.

దేశంలో పైలట్ శిక్షణ కోసం పారదర్శకమైన, పనితీరే ప్రమాణంగా, నాణ్యత ప్రాతిపదికగా ఉన్న వ్యవస్థను నెలకొల్పాలన్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లక్ష్యానికి ఈ రోజు విడుదల చేసిన రెండో దశ ఎఫ్‌టీవో ర్యాంకింగ్ నిదర్శనం. ఎఫ్‌టీవోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా, అన్ని అంశాలనూ పరిగణిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని విద్యార్థులకు అందిచేలా.. ఈ వ్యవస్థను మరింత బలంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

ఎఫ్‌టీవో ర్యాంకింగ్ (2026 ఏప్రిల్) ముఖ్యాంశాలు:

ఒ క ఎఫ్‌టీవో ‘A’ కేటగిరీలో స్థానం సాధించింది. గత దశలో ఏ సంస్థ కూడా ఈ కేటగిరీకి అర్హత సాధించలేదు. దానితో పోలిస్తే విశేషమైన మెరుగుదలగా దీన్ని పేర్కొనవచ్చు.

‘ C’ కేటగిరీలోని ఎఫ్‌టీవోల సంఖ్య తగ్గడం, ‘B’ కేటగిరీలోని ఎఫ్‌టీవోల సంఖ్య పెరగడం.. మొత్తంగా వాటి పనితీరు ప్రమాణాల్లో మెరుగుదలను సూచిస్తుంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీ (ఐజీయూఆర్ఏ) ఈ ర్యాంకింగ్‌లో విశేష పురోగతి సాధించింది.

కార్యాచరణ సామర్థ్యం, భద్రతా నిబంధనలను పాటించడం, శిక్షణ ఫలితాల్లో.. పలు ఇతర ఎఫ్‌టీవోలు విశేష పురోగతిని కనబరిచాయి.

డీజీసీఏ ఆమోదం పొందిన పైలట్ శిక్షణ సంస్థల (2026 ఏప్రిల్) ర్యాంకింగులు కింది విధంగా ఉన్నాయి:


(రిలీజ్ ఐడి: 2255370) సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी