పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న ఇంధనం, ఎల్‌పీజీ సరఫరా: ఓఎంసీలు

నాడు పోస్టు చేయడమైనది: 22 APR 2026 7:11PM by PIB Hyderabad

తెలంగాణలో ప్రస్తుత డిమాండ్‌ను తీర్చేందుకు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లభిస్తోందని రాష్ట్రంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) తెలియజేశాయి. ఈ ఉత్పత్తుల విషయంలో రాష్ట్రంలో కొరత లేదని అవి స్పష్టం చేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని.. .లాజిస్టిక్స్‌ను క్రమబద్ధీకరించటం, పంపిణీని మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఒక పత్రికా ప్రకటనలో ఓఎంసీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ తెలిపారు. ఈ నెల మొదటి 20 రోజుల్లో ఓఎంసీల పెట్రోల్, డీజిల్ సరఫరాలో 7 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది. 

ప్రస్తుతం గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. వినియోగదారుల్లో ఎటువంటి ఆందోళన లేదన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. ఈ నెలలో నిన్నటి వరకు రాష్ట్రంలో మొత్తం 37.77 లక్షల గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్లను పంపిణీ చేశారు. అంటే ఇది సాధారణ స్థాయిలోనే ఉంది. 

ఎల్‌పీజీ వినియోగదారులు ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్స్, ఐవీఆర్ఎస్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫా‌మ్ ల ద్వారా సిలిండర్లను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ తరలింపును అరికట్టడానికి, సరైన లబ్ధిదారులకు సిలిండర్లు అందేలా చూసేందుకు రూపొందించిన ఓటిపీ ఆధారిత డెలివరీ విధానమైన 'డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ)' వ్యవస్థను వినియోగదారులు ఆదరించటంతో పాటు ప్రోత్సహించాలని ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. అంతేకాకుండా వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా కోసం అన్ని ఓఎంసీలు ప్రత్యేక పోర్టల్‌లను ప్రారంభించాయి. తమ అవసరాలను నమోదు చేసుకోవడానికి ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగించాలని వాణిజ్య సంస్థలకు సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ వంట ఇంధనంగా పీఎన్‌జీని ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.03 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, చౌటుప్పల్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, షాద్‌నగర్, రామగుండం, తెలంగాణలోని ఇతర ఎంపిక చేసిన పట్టణాలలో పీఎన్‌జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. పీఎన్‌జీ కనెక్షన్ల కోసం భాగ్యనగర్ గ్యాస్, టొరెంట్ గ్యాస్, మేఘా గ్యాస్ వంటి రాష్ట్రంలోని సీజీడీ సంస్థలను వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు సంప్రదించొచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,942 దాడులను నిర్వహించి 5,388 సిలిండర్లను స్వాధీనం చేసుకుంది.

స్థానిక చిరునామా ధ్రువీకరణ పత్రం లేని వలస కార్మికులు, విద్యార్థుల కోసం అధీకృత ఓఎంసీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందేందుకు చెల్లుబాటయ్యే వ్యక్తిగత ధ్రువీకరణ, డిక్లరేషన్ సమర్పించాలి. హైదరాబాద్‌లో 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధర రూ. 1,547 (కొత్త కనెక్షన్), రీఫిల్ ధర సిలిండర్‌కు రూ. 673గా ఉంది. గ్యాస్ అయిపోయిన తర్వాత అధీకృత డిస్ట్రిబ్యూటర్లు లేదా గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లను ఇచ్చి మళ్లీ గ్యాస్ నింపుకోవచ్చు.

సామాన్య ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని... తప్పుడు వార్తలు, వదంతులను నమ్మి మోసపోవద్దని మరోసారి తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2254707) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English