ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అదనపు కార్యదర్శి (ప్రజా ఆరోగ్యం) మరియు డైరెక్టర్ జనరల్ (నాకో) అధ్యక్షతన జరిగిన రక్త మార్పిడి సేవలపై జాతీయ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ పాల్గొంది

రక్త మార్పిడి సేవలలోని 5 దశలకు సంబంధించి 10 కీలక పనితీరు సూచికల పురోగతిని సమీక్షించేందుకు ఈరోజు ఉదయం 11 గంటలకు జాతీయ స్థాయి వర్చువల్ సమీక్షా సమావేశం జరిగింది. ప్రతి జిల్లాలో సురక్షితమైన రక్తాన్ని అందుబాటులో ఉంచడం, రక్త మార్పిడి ద్వారా సంక్రమించే వ్యాధులను సున్నా స్థాయికి చేర్చాలనే లక్ష్యాన్ని ఇందులో పునరుద్ఘాటించారు

प्रविष्टि तिथि: 22 APR 2026 4:05PM by PIB Vijayawada

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం 11:00 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశ రక్త మార్పిడి సేవలపై ఉన్నత స్థాయి జాతీయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ప్రజారోగ్యం) మరియు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా, ఐఏఎస్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమీక్షలో మొత్తం 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు.  

ఈ సమీక్షలో రక్త మార్పిడి సేవలకు సంబంధించిన ఐదు కీలక దశలను క్షుణ్ణంగా పరిశీలించారు. అవి: లైసెన్సింగ్ మరియు పునరుద్ధరణ, రక్తదాతల స్క్రీనింగ్ మరియు రక్త సేకరణ, రక్తంలో సంక్రమించే వ్యాధుల (TTI) పరీక్షలు - పాజిటివ్ వచ్చిన దాతల రిఫరల్ & అనుసంధానం, రక్తాన్ని శుద్ధి చేయడం - నిల్వ చేయడం, అందజేయడం, అలాగే నివేదికల తయారీ, రికార్డుల నిర్వహణ. ఈ సేవల పనితీరును 10 కీలక సూచికల ఆధారంగా అంచనా వేశారు. ఇందుకోసం ఈ-రక్తకోష్ (eRaktKosh), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) డేటాబేస్, బ్లడ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BBMS), ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీ రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు.

తన అధ్యక్ష ప్రసంగంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ప్రజారోగ్యం) మరియు నాకో (NACO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా, IAS గారు మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి జిల్లాలోనూ సురక్షితమైన రక్తం అందుబాటులో ఉండాలని, రక్త మార్పిడి ద్వారా సంక్రమించే వ్యాధులు (TTI) లేని వ్యవస్థను రూపొందించడమే జాతీయ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2026 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక రక్త నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో రక్త నిధి కేంద్రాల సంఖ్యను పెంచడానికి, అలాగే జాతీయ రోడ్‌మ్యాప్ ప్రకారం లైసెన్స్ ఉన్న అన్ని రక్త నిధి కేంద్రాలను ‘ఈ-రక్తకోష్’ (eRaktKosh) పోర్టల్‌లో చేర్చడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పలు సానుకూల పరిణామాలను ఈ సమీక్షా సమావేశం ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక లైసెన్స్ కలిగిన రక్త నిధి కేంద్రం అందుబాటులో ఉండటంతో, రాష్ట్రం ఇప్పటికే ప్రతి జిల్లాలో రక్త నిధి కేంద్రాల పూర్తి లభ్యతను సాధించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  రక్త నిధి కేంద్రాల్లో సేకరించిన రక్తాన్ని ఎలీసా (ELISA), సిఎల్ఐఏ (CLIA) వంటి ధ్రువీకరణ ప్రోటోకాల్స్ ద్వారా క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్నారని, నైపుణ్య పరీక్షలో చురుగ్గా పాల్గొంటూ సంతృప్తికరమైన ఫలితాలను అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు. జాతీయ రక్త విధానం, రక్త మార్పిడి సేవల కోసం రూపొందించిన 'జాతీయ ముసాయిదా 2026' మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్రంలోని రక్త భద్రతా వ్యవస్థలో ఈ విజయాలు కీలకమైన పునాదులుగా నిలుస్తాయని గుర్తించారు.

భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా, రాబోయే త్రైమాసికాల్లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడిగా బలోపేతం చేయాల్సిన కొన్ని ప్రాధాన్యత అంశాలను ఈ సమీక్ష వివరించింది. ఇందులో భాగంగా.. బ్లడ్ సెంటర్లు మరియు స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణ కోసం నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOPs) నిరంతరం అమలు చేయడం; అన్ని రక్త నిధి కేంద్రాలో రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల (TTIs) స్క్రీనింగ్ కోసం దశలవారీగా 4వ తరం ర్యాపిడ్ టెస్టులు/ELISA/CLIA పద్ధతులను ప్రవేశపెట్టడం; ప్రతి రక్త నిధికేంద్రాలోనూ బ్లడ్ కాంపోనెంట్ సెపరేషన్ యూనిట్ ఉండేలా సామర్థ్యాన్ని పెంచడం; మరియు ఈ-రక్తకోష్, బ్లడ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BBMS) ద్వారా రక్త లభ్యతను ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం వంటివి ఉన్నాయి.

వీటితో పాటు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అనుసంధానిత బయోమెట్రిక్ ద్వారా రక్తదాతలను గుర్తించడం మరియు ప్రతి రక్త నిధి కేంద్రానికి హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR) గుర్తింపును కేటాయించడం వంటి చర్యలు జాతీయ రక్త భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. స్టేట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్ (SBTC), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ జాతీయ ప్రాధాన్యతలపై నిర్ణీత సమయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తాయి. వీటి పురోగతిని తదుపరి త్రైమాసిక సమావేశంలో సమీక్షిస్తారు.

వీడియో కాన్ఫరెన్స్ ముగింపులో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ప్రజారోగ్యం) మరియు నాకో (NACO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా, IAS గారు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు నిర్దిష్టమైన కార్యాచరణ ఆదేశాలను జారీ చేశారు. అవి: ప్రతి రక్త నిధి కేంద్ర లైసెన్స్ స్థితిగతులను స్టేట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్ (SBTC) సమీక్షించడం; SBTC, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS), ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ల సమన్వయంతో ‘ఈ-రక్తకోష్’ మరియు బ్లడ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BBMS)లలో 100 శాతం రియల్ టైమ్ అప్‌డేట్‌లను అమలు చేయడం; రక్త నిధి కేంద్రాలు మరియు స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOPs) కఠినంగా పాటించడం; నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్ (NBTC) మరియు SBTC ల శిక్షణ మాడ్యూల్స్ ప్రకారం సిబ్బందికి శిక్షణ అందేలా చూడటం; అన్ని రక్త నిధి కేంద్రాల్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అనుసంధానిత బయోమెట్రిక్ పరికరాలను అందుబాటులో ఉంచడం; మరియు ప్రతి రక్త నిధి కేంద్రాలకు హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR) ఐడిలను సృష్టించడం. ప్రతి పౌరుడికి సకాలంలో, సులభంగా మరియు సురక్షితమైన రక్తం అందేలా చూడాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని రాష్ట్రం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. 

* * *


(रिलीज़ आईडी: 2254508) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English