కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ‘సమృద్ధ్ గ్రామ్’ పథకానికి ‘సానుకూలావరణ సృష్టి’ విభాగంలో ‘డబ్ల్యూఎస్‌ఐఎస్‌-2026’ బహుమతి ప్రతిపాదన


· గ్రామీణ ప్రాంతాల్లో సార్వజనీన వృద్ధి సాధనకు డిజిటల్ మౌలిక సదుపాయాల వినియోగంలో భారత్‌ కృషికి ఇదొక అంతర్జాతీయ గుర్తింపు

· ప్రపంచంలో అతి పెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్ట్ ‘భారత్‌నెట్‌’ ద్వారా గ్రామీణులకు సమీకృత ‘ఫిజిటల్’ సేవల ప్రదానంలో సమృద్ధ్ గ్రామ్ కీలక పాత్ర

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 6:50PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) అమలు చేస్తున్న “సమృద్ధ్ గ్రామ్: భారత్‌నెట్ ద్వారా సమీకృత ఫిజిటల్ సేవల ప్రదానం” పథకం ప్రతిష్టాత్మక ‘డబ్ల్యూఎస్‌ఐఎస్-2026’ (వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ) బహుమతికి పోటీ పడుతోంది. ఈ మేరకు ‘యాక్షన్ లైన్ ఏఎల్‌ సి6: సానుకూలావరణ సృష్టి’ విభాగం కింద ప్రతిపాదిత పథకాల్లో ఇదొకటి కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో సార్వజనీన వృద్ధి సాధనకు డిజిటల్ మౌలిక సదుపాయాల వినియోగంలో భారత్‌ కృషికి లభించిన ఒక ప్రధాన అంతర్జాతీయ గుర్తింపుగా దీన్ని పరిగణించవచ్చు.

‘భారత్‌నెట్’ చట్రం ఆధారంగా రూపొందించిన సమృద్ధి గ్రామ్ పథకం కింద భౌతిక మౌలిక సదుపాయాలను డిజిటల్ వేదికలతో జోడిస్తూ ఏకగవాక్ష “ఫిజిటల్” సేవలందించే సామాజిక కూడళ్లుగా సమృద్ధి కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పరిపాలన, ఆర్థిక సార్వజనీనత, ఇ-కామర్స్ వంటి రంగాల్లో అవసరమైన సేవలన్నీ ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజానీకానికి నిరాటంకంగా లభిస్తాయి. అంతేకాకుండా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, ఎఫ్‌టీటీహెచ్‌ సంధానం, బహిరంగ వైఫై సహా దూర-వైద్యం, అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ పరిపాలన సేవలు, సాంకేతికత ఆధారిత వ్యవసాయం వంటి వాటిలోనూ విప్లవాత్మక మార్పులకు ఇవి దోహదం చేస్తాయి.

అనుసంధానానికి పరిమితం కాకుండా సామాజిక-ఆర్థిక సాధికారత కల్పనలో టెలికాం మౌలిక సదుపాయాలు ఉత్ప్రేరక పాత్ర పోషించే తీరును ఈ పథకం స్పష్టం చేస్తోంది. గ్రామీణులకు మెరుగైన సేవల లభ్యత, ప్రయాణ సమయం ఆదా, వ్యయం తగ్గడం, డిజిటల్ అవగాహన ఇనుమడించడం, జీవనోపాధి అవకాశాలు పెరగడం వంటి సానుకూలతలను తరుణదశ ఫలితాలు సూచిస్తున్నాయి.

విస్తరణీయ, నిర్వహణీయ నమూనాగా రూపొందిన ఈ పథకం సామాజిక ఆధారిత వ్యవస్థాపన చట్రం ద్వారా అమలవుతుంది. అందువల్ల దేశంలోనే కాకుండా భౌగోళికంగా ఎక్కడైనా ఇది అనుకరణ సాధ్యం కాగలదు.

‘డబ్ల్యూఎస్‌ఐఎస్ ప్రైజెస్‌-2026’ కింద పథకాల ఎంపిక కోసం సార్వత్రిక ఓటింగ్ దశ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమాల భాగస్వాములు, సంస్థలు, పౌరులు తమ పూర్తి సమాచారంతో (సంస్థ పేరు, రంగం, దేశం, వినియోగదారు వివరాలు) ‘డబ్ల్యూఎస్‌ఐఎస్’ అభిప్రాయ స్వీకరణ వేదికలో నమోదు చేసుకుని ఈ ప్రాజెక్టుకు మద్దతివ్వాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 2026 మే 3న తుది గడువు ముగిసేలోగా కింది లింకు ద్వారా “ఏఎల్‌ సి6: ఎనేబ్లింగ్ ఎన్విరాన్‌మెంట్” విభాగం కింద సమృద్ధి గ్రామ్ ప్రాజెక్టుకు ఓటు వేయాల్సి ఉంటుంది:

https://www.itu.int/net4/wsis/stocktaking/Prizes/2026/Vote.

‘సమృద్ధ్‌ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్’ పథకం కింద కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం.సింధియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లా ఉమ్రి గ్రామంలో ఇటీవల దేశంలోనే తొలి ‘సమృద్ధి కేంద్రా’నికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ భారత్‌ అంతటా డిజిటల్ సేవల విస్తరణలో ఇదొక కీలక మలుపుగా నిలిచింది.

వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ

‘డబ్ల్యూఎస్‌ఐఎస్’ అనేది డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగమనానికి ఊతమిస్తూ, సార్వజనీన సమాచార సమాజాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించే ప్రపంచవ్యాప్త గుర్తింపుగల బహుళ-భాగస్వామ్య వేదిక. కీలక డిజిటల్ అంశాల్లో పరస్పర సహకారం దిశగా ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థలు సహా ప్రధాన భాగస్వాములను ఇది ఒకే వేదికపైకి తెస్తుంది.

అంతర్జాతీయంగా సుస్థిర ప్రగతికి దోహదం చేసే వినూత్న ‘ఐసీటీ’ ఆధారిత ప్రాజెక్టులకు ‘డబ్ల్యూఎస్‌ఐఎస్’ బహుమతి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని 2026 జూలై 6–10 తేదీలలో జెనీవాలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతికతలు, డిజిటల్ సార్వజనీనత, సైబర్‌ భద్రత, అంతర్జాతీయ డిజిటల్ సహకారం వగైరాలపై చర్చలకు ఇది వేదిక కానుంది.

***


(రిలీజ్ ఐడి: 2253992) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati