గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక ఖనిజ బ్లాకులతో పాటు అన్వేషణ కోసం లైసెన్సులు ఇవ్వదలుస్తున్న బ్లాకులపై

గనులశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రేపే రోడ్‌షో

నాడు పోస్టు చేయడమైనది: 12 APR 2026 2:34PM by PIB Hyderabad

కీలక, వ్యూహాత్మక బ్లాకుల 7వ విడత వేలంతో పాటు ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్ (ఈసీ) బ్లాకుల 2వ విడత వేలంపాటకు ఓ రోడ్‌షోను కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ నిర్వహించనుంది. ఈ రోడ్‌షోను హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో 2026 ఏప్రిల్ 13న ఏర్పాటు చేశారు.

 

ఈ రోడ్‌షో కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, గనుల శాఖ సీనియర్ అధికారులు, రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమకు చెందిన ఆసక్తిదారులు, ఔత్సాహిక వేలం దారులు పాల్గొంటారు.

 

ఏడో దఫా వేలంలో టంగ్‌స్టన్, లిథియం, తగరం, రాక్ ఫాస్ఫేట్‌ తదితరాలు సహా 19 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులు భాగంగా ఉన్నాయి. ఈ ఖనిజాలు స్వచ్ఛ ఇంధనం, ఆధునిక సాంకేతికతలు, ఎరువుల వంటి రంగాలకు ఎంతో కీలకం. ఇంతవరకు ఆరు విడతల వేలాన్ని నిర్వహించి, 45 కీలక ఖనిజాల బ్లాకుల వేలంపాటను విజయవంతంగా ముగించారు. ఈ వేలం ప్రక్రియ ఖనిజపరమైన భద్రత సాధనకు, దానితో పాటు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు అద్దం పడుతోంది.

 

అన్వేషణ సంబంధిత లైసెన్స్ (ఈఎల్) బ్లాకుల రెండో దఫా వేలం ఈ రోడ్‌షో కార్యక్రమంలో మరో ముఖ్యాకర్షణగా ఉంది. అన్వేషణ కార్యకలాపాల్లో మరీ ముఖ్యంగా భూమిలో బాగా అడుగున ఉన్న, కీలక ఖనిజాల అన్వేషణలో ప్రయివేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచడమూ ఈ వేలం ముఖ్యోద్దేశం. అన్వేషణ ప్రధాన లైసెన్సుల మంజూరు విధానం భూ పరిశీలన, అవకాశాల సూచక ప్రక్రియకు సువ్యవస్థీకృత ప్రణాళికను అందిస్తూ, తద్వారా దేశంలో అన్వేషణకు సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఖనిజావకాశాలపై సమగ్ర నివేదికలతోపాటు వేలం ప్రణాళికనూ, విధాన సంస్కరణలనూ రోడ్‌షోలో వివరించనున్నారు. సందేహాలను నివృత్తి చేయడానికీ, మరిన్ని ఎక్కువ సంస్థలు భాగస్వామ్యం వహించడానికి ముందుకు వచ్చేలా మార్గాన్ని సుగమం చేయడానికీ ఆసక్తిదారులతో ఒక సమావేశ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

 

స్వచ్ఛ ఇంధన వినియోగం దిశగా, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలను సాధించే మార్గంలో ముందుకు సాగిపోవడానికి సహాయపడుతూ ఖనిజ రంగాన్ని సుదృఢమైందిగానూ, స్వయంసమృద్ధి సహితమైందిగానూ తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ దృష్టికోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2251323) సందర్శకుల సూచీ సంఖ్య : : 66
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English