రక్షణ మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 14 నుంచి న్యూఢిల్లీలో భారత నౌకాదళం తొలి కమాండర్ల సదస్సు-2026
నాడు పోస్టు చేయడమైనది:
12 APR 2026 11:30AM by PIB Hyderabad
ఏప్రిల్ 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు భారత నౌకాదళ తొలి ద్వైవార్షిక కమాండర్ల సమావేశం-2026 న్యూఢిల్లీలోని నౌసేనా భవన్‌లో నిర్వహిస్తారు. జాతీయ సముద్ర ప్రయోజనాలను కాపాడేందుకు నౌకాదళ సంసిద్ధతను సమగ్రంగా సమీక్షించటం, సామర్థ్య అభివృద్ధి, జాతీయ భద్రతా లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించటంపై ఈ అత్యున్నత స్థాయి సమావేశం దృష్టి సారిస్తుంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అంతర్జాతీయ దళాల మోహరింపు నేపథ్యంలో భారత ఇంధన భద్రతను కాపాడేందుకు చేపట్టిన వేగవంతమైన నౌకాదళ కార్యాచరణ దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నౌకాదళ కార్యాచరణ సిద్ధాంతాన్ని స్పష్టం చేయటానికి, త్రివిధ దళాల మధ్య సమన్వయం, సాంకేతికత ఆధారంగా ప్రతిస్పందన వ్యవస్థలను బలోపేతం చేయటానికి కీలకంగా ఈ సమావేశం నిలుస్తుంది.
ఈ సదస్సులో భాగంగా త్రివిధ దళాధిపతి, హోంశాఖ కార్యదర్శి ప్రసంగాలతో పాటు నౌకాదళం సీనియర్ అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. త్రివిధ దళాల మధ్య పరస్పర సహకారాన్ని, సమగ్రతను పెంపొందించటం ఈ చర్చల ప్రధాన లక్ష్యం. జాతీయ స్థిరత్వం, భద్రతా వ్యవస్థ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనే విధానాలపై విస్తృత అవగాహనను పెంపొందించుకోవటానికి ఈ చర్చలు సహకరిస్తాయి. ఈ సదస్సు జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంభాషణలకు వేదికగా నిలుస్తూ.. నౌకాదళ ప్రణాళికలకు వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది.
ప్రస్తుత భౌగోళిక వ్యూహాత్మక వాతావరణంలోని వివిధ సవాళ్లను ఎదుర్కోవటానికి అవసరమైన ప్రణాళికలను నౌకాదళాధిపతి, కార్యాచరణ కమాండర్లు, సీనియర్ నౌకాదళ నాయకత్వంతో కలిసి రూపొందిస్తారు. భద్రతతో పాటు నిర్ణయాత్మక కార్యాచరణ విజయాన్ని సాధించటం, మహాసముద్రంలో సామర్థ్యాన్ని పెంపొందించటం, శిక్షణ, మానవ వనరుల నిర్వహణ, స్థిర నిర్వహణ పద్ధతులు, మానవ రహిత వ్యవస్థల సమర్థవంతమైన వినియోగం, కార్యాచరణ నిర్వహణ, యుద్ధ సంసిద్ధతను పెంచే కీలక అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. నౌకాదళంలో సమస్యల పరిష్కారానికి ఏఐ రోడ్‌మ్యాప్ అమలు, నిరంతర కార్యకలాపాల కోసం డేటా ఆధారిత సాంకేతికతపైనా చర్చలు జరుగుతాయి.
భారత నౌకాదళ సిద్ధాంతం (ఐఎండీ)లో వివరించిన నావికాదళ నాలుగు కీలక పాత్రలకు అనుగుణంగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు సైనిక విజయాన్ని అందించేందుకు సన్నద్ధతను నౌకాదళ అగ్ర నాయకత్వం సమీక్షిస్తుంది. నిరంతర కార్యకలాపాలు, అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించటం, భారత ప్రభుత్వ విజన్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ ఎక్రాస్ రీజియన్స్ (మహాసాగర్)ను ముందుకు తీసుకెళ్లటం, స్వదేశీ పరిజ్ఞానం, ఆవిష్కరణల వైపు సాగించే ప్రయత్నాలపై దృష్టి సారిస్తుంది. ఐఓఆర్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత గల భద్రతా భాగస్వామిగా భారత నౌకాదళాన్ని నిలబెట్టటమే లక్ష్యంగా ఈ సదస్సులో చర్చలు జరుగుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2251308)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10