గనుల మంత్రిత్వ శాఖ
గనుల కార్యకలాపాల వేగవంతానికి, మైనింగ్ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఖనిజ (వేలం) రెండో సవరణ నియమాలు 2026 ప్రకటించిన గనుల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 4:48PM by PIB Hyderabad
దేశంలోని గనుల కార్యకలాపాలను వేగవంతం చేసే లక్ష్యంతో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 2026 మార్చి 30న ఖనిజ (వేలం) రెండో సవరణ నిబంధనలు 2026ను ప్రకటించింది. గనుల రంగంలో సామర్థ్యం, పారదర్శకత, వ్యాపార సానుకూలతను పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వరుస సంస్కరణల్లో భాగంగా ఈ ముందడుగు పడింది.
గతంలో 17 అక్టోబర్ 2025న ఖనిజ (వేలం) నిబంధనలు 2015ను సవరించారు. ఈ సవరణ ద్వారా లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఉద్దేశ ప్రకటన పత్రం-ఎల్‌ఓఐ) జారీ చేసినప్పటి నుంచి లీజు అమలు అయ్యే వరకు వివిధ దశల్లో పూర్తి చేయాల్సిన పనులకు నిర్దిష్ట గడువులను నిర్ణయించారు. ఒకవేళ బిడ్డర్ (వేలం దారుడు) నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తే ప్రతి నెలకు పనితీరు పూచీకత్తు కింద 1 శాతం కోత విధిస్తారు. గనులను నిర్ణీత సమయం కంటే ముందే కార్యాచరణలోకి తీసుకొచ్చే వారికి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు వేలం ముగియగానే స్వయంచాలకంగా బిడ్డర్‌ను ప్రకటించే నిబంధనలను కూడా గత సవరణలో చేర్చారు. గనుల కార్యకలాపాలు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌ఓఐ జారీ చేయడం అత్యంత కీలకమైన అంశం. బిడ్డర్ పనితీరు పూచీకత్తు లేదా మొదటి విడత ముందస్తు చెల్లింపు చేసిన 30 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఓఐ జారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఆలస్యం చేస్తే వారికి చెల్లించాల్సిన రెండో విడత ముందస్తు మొత్తంలో ప్రతి నెల ఆలస్యానికి 5 శాతం చొప్పున తగ్గింపు వర్తిస్తుంది. గనుల కార్యకలాపాల వేగవంతం, రాష్ట్ర ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిబంధనలను రూపొందించారు.
గనుల నిర్వహణను త్వరితగతిన కార్యాచరణలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పలు కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, గనుల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. అలాగే వేలం వేసిన గనులకు సంబంధించిన పురోగతిని తెలుసుకునేందుకు ‘మైనింగ్ డ్యాష్‌బోర్డ్’ను అమలులోకి తెచ్చింది. దీని ద్వారా వివిధ స్థాయిలలో జరుగుతున్న ఆలస్యాన్ని గుర్తించి సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. వీటితో పాటు ముందస్తు అనుమతులతో కూడిన ఖనిజ బ్లాకుల వేలం, రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం చేపట్టింది.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంఘాలు, సంబంధిత భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే ఖనిజ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి గనుల మంత్రిత్వ శాఖ ఖనిజ (వేలం) నిబంధనల్లో ప్రస్తుత సవరణలు చేసింది.
ఖనిజ (వేలం) రెండో సవరణ నిబంధనలు 2026లోని ముఖ్యాంశాలు
· గనుల తవ్వకానికి వీలులేని ప్రాంతాలను మినహాయించేందుకు అనుమతి: బ్లాకులోని కొన్ని ప్రాంతాల్లో అటవీ భూములు, వన్యప్రాణి కారిడార్లు, నదులు, వాగులు, జనావాసాలు లేదా మౌలిక సదుపాయాల వంటి అడ్డంకుల వల్ల గనుల తవ్వకం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ వనరులు మొత్తం బ్లాకులోని అంచనా నిల్వలలో 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ భాగాన్ని గనుల బ్లాకు నుంచి మినహాయించడానికి ఈ సవరణ నిబంధనలు అనుమతిస్తాయి. దీనివల్ల బ్లాకులోని అతి తక్కువ భాగంలో తలెత్తే వివిధ సమస్యల కారణంగా నిలిచిపోయిన గనులను ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది.
· ఏకీకృత గనుల తవ్వకాల వేదిక ప్రారంభం: వేలం కోసం బ్లాకులను గుర్తించడం, సిద్ధం చేయడం, అనుమతులు పొందడం, గనుల నిర్వహణను పర్యవేక్షించడం వంటి ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఒక ఏకీకృత మైనింగ్ వేదికలను అమలు చేస్తారు. దీని ద్వారా పారదర్శకత పెరుగడంతోపాటు ఆలస్యం తగ్గుతుంది. ముఖ్యంగా బిడ్డర్ మొదటి విడత ముందస్తు చెల్లింపు లేదా పనితీరు పూచీకత్తు సమర్పించిన వెంటనే ఈ పోర్టల్ ద్వారా స్వయంచాలకంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అవుతుంది.
· అటవీ ప్రాంతం లేని బ్లాకుల విషయంలో గనుల లీజు అమలుకు అదనపు గడువు కేటాయింపును తగ్గించడం: లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిన మొదటి 3 సంవత్సరాల తర్వాత గనుల లీజు అమలు కోసం ఇచ్చే అదనపు రెండేళ్ల గడువును కేవలం అటవీ భూమితో ముడిపడి ఉన్న బ్లాకులకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించారు. ఒకవేళ ఆ బ్లాకులో అటవీ భూమి లేనట్లయితే 3 ఏళ్ల తర్వాత ఎలాంటి అదనపు గడువు ఇవ్వరు. వేలం వేసిన ఖనిజ బ్లాకులను మరింత వేగంగా నిర్వహణలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సవరణ చేశారు. ఈ నిబంధన 2026 మార్చి 30 తర్వాత వేలం వేసే బ్లాకులకు వర్తిస్తుంది.
· ముందస్తు చెల్లింపు గడువు క్రమబద్ధీకరణ: సవరించిన నిబంధనల ప్రకారం రెండో విడత ముందస్తు చెల్లింపును ఎల్‌ఓఐ జారీ చేసిన తేదీ నుంచి ఒక ఏడాది లోపు జమ చేయాల్సి ఉంటుంది. ఈ సవరణ కూడా 2026 మార్చి 30 తర్వాత వేలం వేసే బ్లాకులకు వర్తిస్తుంది.
· వేలం రద్దు అయిన సందర్భంలో ఉపశమనం: బిడ్డర్ తప్పిదం లేకుండా ఇతర కారణాల వల్ల సదరు బ్లాకులో గనుల తవ్వకం చేయడం అసాధ్యమని తేలి వేలం రద్దు అయితే.. అప్పటికే చెల్లించిన ముందస్తు మొత్తం, పనితీరు పూచీకత్తును తిరిగి చెల్లించే నిబంధనను కూడా ఈ నియమాల్లో పొందుపరిచారు.
· అన్వేషణ సంస్థల భాగస్వామ్యం పెంపు: ఈ సవరణల ద్వారా ప్రకటించిన ప్రైవేటు అన్వేషణ సంస్థలు తాము అన్వేషించిన అన్ని రకాల ఖనిజ బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు ఇప్పుడు అనుమతి లభించింది. గతంలో వీటి భాగస్వామ్యం కేవలం కీలకమైన, వ్యూహాత్మక, భూమిలో లోతుగా ఉండే ఖనిజ బ్లాకులకు మాత్రమే పరిమితమై ఉండేది.
· కీలక, వ్యూహాత్మక ఖనిజాలకు ప్రోత్సాహకాలు: కీలక, వ్యూహాత్మక ఖనిజాల కోసం (గ్రాఫైట్, ఫాస్ఫేట్, పొటాష్ మినహా) వేలం ప్రీమియం నుంచి మినహాయింపును ప్రవేశపెట్టారు. అయితే ఆ బ్లాకులోని మొత్తం అంచనా ఖనిజ నిల్వలలో ఇటువంటి వ్యూహాత్మక ఖనిజాల విలువ 10 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.
ఖనిజ అభివృద్ధిని వేగవంతం చేయడం, గనుల కార్యకలాపాలు సకాలంలో ప్రారంభమయ్యేలా చూడటం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, దేశంలో ఖనిజాల వేలానికి సంబంధించిన నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ సవరణల ప్రధాన లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2249896)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10