వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఫార్మా ఎగుమతుల వృద్ధికి ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందని భరోసానిచ్చిన వాణిజ్య శాఖ కార్యదర్శి
హైదరాబాద్ చింతన్ శివిర్‌లో పాల్గొన్న శ్రీ రాజేష్ అగర్వాల్
నాడు పోస్టు చేయడమైనది:
04 APR 2026 4:29PM by PIB Hyderabad
దేశంలో ఫార్మా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన కార్యక్రమం భారత ఫార్మా రాజధాని, అంతర్జాతీయ జీవ సాంకేతికత కేంద్రం అయిన హైదరాబాద్‌లో నేడు ఒక ఉన్నత స్థాయి ‘చింతన్ శివిర్’ నిర్వహించారు. భారత ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సహక మండలి (ఫార్మెక్సిల్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆవిష్కరించిన దార్శనికత నేపథ్యంలో ఈ ‘చింతన్ శివిర్’ ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు, స్వయం సమృద్ధి ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని.. "పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు కొత్త మందులు, వైద్య సాంకేతికతలపై పేటెంట్లను పొందాలి. తద్వారా భారత్ సొంత ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా వైద్య రంగంలో స్వయం సమృద్ధి, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారుతుంది. శాస్త్ర సాంకేతికత, మానవ సంక్షేమంలో ప్రపంచానికి నాయకత్వం వహించగల దేశ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తుంది" అని వ్యాఖ్యానించారు.
ప్రారంభ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి శ్రీ రాజేష్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. ఫార్మెక్సిల్ ఛైర్మన్, ఫార్మాస్యూటికల్స్ శాఖ సంయుక్త కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వాణిజ్య శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. భారత ఫార్మా పరిశ్రమ సాధిస్తున్న బలమైన వృద్ధిని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచ జనాభాలో దాదాపు 18–19 శాతం వాటా కలిగిన మన దేశం స్వయంగా పెద్ద మార్కెట్ అని.. పెరుగుతున్న ఆదాయాలతో ఆరోగ్య సంరక్షణకు డిమాండ్‌ను పెంచే ఒక భారీ మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ పరిశ్రమలో దాదాపు 50 శాతం వాటా ఎగుమతుల నుండే వస్తోందన్న ఆయన.. స్థాయి, ధరల పోటీతత్వం, జెనరిక్ మందులలో ప్రపంచ నాయకత్వం కారణంగా భారత్ ‘ప్రపంచపు ఫార్మసీ’గా అవతరించిందని ఆయన వివరించారు. అనిశ్చితి పెరగటంతో పాటు భౌగోళిక రాజకీయ అస్థిరత కలిగిన ప్రపంచంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. దేశీయ ఫార్మా అవసరాలలో 80–90 శాతం (లేదా అంతకంటే ఎక్కువ) స్వదేశీ ఉత్పత్తి ద్వారానే తీర్చుకోవాలని.. ఏపీఐలు, బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్లలో కీలకమైన వాటి విషయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. భారత్ సుమారు 200 దేశాలకు ఎగుమతులు చేస్తున్నప్పటికీ మార్కెట్ ఉనికిని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎగుమతుల సరఫరా గొలుసును సురక్షితం చేసుకోవడానికి, విస్తరించడానికి ఇంకా గొప్ప అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు.
నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఔషధాలకు భారత్ ప్రపంచ కేంద్రంగా వ్యూహాత్మక పునర్నిర్మాణం చేయవలసిన అవసరాన్ని భారతదేశాన్ని ప్రముఖంగా చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో ‘నాణ్యత’ అనేది ఎప్పటికీ నిర్ణయాత్మక అంశంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ నమ్మకాన్ని పెంపొందించడానికి నాణ్యత విషయంలో ఒక బలమైన వ్యవస్థను తయారు చేయాలని.. అదే సమయంలో బయోలాజిక్స్, బయోసిమిలర్స్ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ పోకడలకు అనుగుణంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమను పరిమాణం ఆధారిత స్థాయి నుంచి విలువ ఆధారిత స్థాయికి మార్చాల్సిన అవసరాన్ని తెలియజేసిన ఆయన.. జెనరిక్స్‌లో కొనసాగుతున్న బలానికి తోడుగా కొత్త పేటెంట్ల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. భౌగోళిక రాజకీయపరంగా విచ్ఛిన్న పరిస్థితులు ఉన్న నేటి ప్రపంచంలో దిగుమతుల సరఫరా గొలుసులను సురక్షితంగా ఉంచే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా చెప్పారు. ఇటువంటి బహిరంగ, సహకార చర్చలు ఈ రంగం నుంచే క్రియాశీల పరిష్కారాలను రూపొందించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. విలువ, నాణ్యత, దృఢత్వం కలిగిన సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ఎగుమతిదారులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన.. వారి ప్రశ్నలు, ఆందోళనలకు సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ చింతన్ శివిర్.. ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలు, స్వయం సమృద్ధి కోసం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును నిజం చేసే దిశగా ఒక కీలక కార్యక్రమంగా ఉంది. ఇది 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ‘బయోఫార్మా శక్తి’ పథకానికి అనుగుణంగా ఉంది. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ కోసం భారతదేశపు పూర్తి వ్యవస్థ (ఎండ్ టూ ఎండ్ ఎకోసిస్టమ్) బలోపేతం చేయడానికి.. దేశాన్ని ప్రపంచ బయోఫార్మా కేంద్రంగా నిలబెట్టడానికి ఐదేళ్ల కాలానికి రూ. 10,000 కోట్ల వ్యయంతో ఈ జాతీయస్థాయి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది ఫార్మా రంగంతో పాటు అందులోని అన్ని భాగస్వామ్య పక్షాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బలమైన, నిరంతర మద్దతును పునరుద్ఘాటిస్తోంది. పరిమాణం పరంగా ఔషధాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా.. విలువ పరంగా 14వ స్థానంలో ఉంది.
ప్రత్యేకంగా నిర్వహించిన సీఈఓ ముఖాముఖి సమావేశం.. మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకోవటం, నియంత్రణ- నిబంధనల అమలు, ఎగుమతుల వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై వాణిజ్య కార్యదర్శి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో నేరుగా చర్చించే అవకాశాన్ని పరిశ్రమ రంగ ప్రముఖులకు కల్పించింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను సమీక్షించడానికి, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి నిరంతర సరఫరా మార్గాలను నిర్వహించే చర్యల గురించి చర్చించడానికి కూడా ఈ చింతన్ శివిర్ భాగస్వామ్య పక్షాలకు ఒక వేదికగా నిలిచింది. ఇందులో ప్రపంచ నియంత్రణల సమన్వయం, విదేశీ వాణిజ్య విధానం, డిజిటల్ వాణిజ్య సౌలభ్యం, ఫార్మా రంగానికి సంబంధించిన నిర్వహణ సామర్థ్యం- స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి కృత్రిమ మేధ అన్వయం వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. 2026 సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న 12వ అంతర్జాతీయ ఫార్మా, హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్ ఐపెక్స్-2026ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ చింతన్ శివిర్ చర్చలు.. కేంద్ర ప్రభుత్వ పూర్తి మద్దతుతో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం, 'ప్రపంచపు ఫార్మసీ'గా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో కూడిన విధానపరమైన చర్యలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
(రిలీజ్ ఐడి: 2248986)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38