నీతి ఆయోగ్
న్యూఢిల్లీలో గట్ మైక్రోబయోటా, ప్రోబయోటిక్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16వ భారత ప్రోబయోటిక్ సదస్సు
నాడు పోస్టు చేయడమైనది:
28 MAR 2026 10:54AM by PIB Hyderabad
గట్ మైక్రోబయోటా, ప్రోబయోటిక్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 27, 28న ‘‘గట్ మైక్రోబయోమ్, ప్రోబయోటిక్స్: పుట్టినప్పటి నుంచి వందేళ్ల వృద్ధుల వరకు ప్రభావం’’ అంశంపై న్యూఢిల్లీలో 16వ భారత ప్రోబయోటిక్ సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నీతి ఆయోగ్ సభ్యులు శ్రీ రాజీవ్ గౌబా ప్రసంగిస్తూ.. రోగనిరోధక శక్తి, జీవక్రియలు, నివారణ ఆరోగ్య సంరక్షణలో గట్ మైక్రోబయోమ్’ (పేగులలోని సూక్ష్మజీవుల వ్యవస్థ) కీలక పాత్రను వివరించారు.
దేశంలో ఆహారపు అలవాట్లలో వేగంగా వస్తున్న మార్పులపై శ్రీ గౌబా ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, సోషల్ మీడియా, ఆన్‌లైన్ డెలివరీ వేదికల ద్వారా అతిగా ప్రాసెస్ చేసిన, శుద్ధి చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం వంటివి ప్రజలను సాంప్రదాయ, పోషక విలువలున్న ఆహారానికి దూరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణులు పేగు ఆరోగ్యంపై తీవ్రమైన దీర్ఘకాలిక పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. దేశంలోని సుమారు 56.4 శాతం వ్యాధుల భారం అనారోగ్యకరమైన లేదా అసమతుల్య ఆహారపు అలవాట్ల వల్లే వస్తోందని గుర్తు చేశారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే, "సూక్ష్మజీవులు స్థూల పరిణామాలకు దారితీస్తాయని’’ హెచ్చరించారు.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్నివిస్తృతమైన కోణంలో విశ్లేషిస్తూ.. వ్యక్తిగత సంక్షేమానికి,ఆర్థిక వృద్ధికి ఆరోగ్య రంగమే అత్యంత కీలకమైనదని శ్రీ గౌబా అభివర్ణించారు. దేశ జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతున్న తరుణంలో ఆరోగ్యవంతమైన శ్రామిక శక్తి, క్రియాశీలకమైన, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం ముందస్తు సన్నద్ధత ఉంటేనే దేశ జనాభా డివిడెండ్ (పనిచేసే యువత వల్ల కలిగే ప్రయోజనం) సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యంపై పెట్టే పెట్టుబడి వికసిత్ భారత్ కోసం పెట్టే పెట్టుబడి అని గౌబా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, పీఎం-జేఏవై, జన్ ఔషధి పరియోజన వంటి పథకాలు ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని గణనీయంగా బలోపేతం చేశాయని తెలిపారు. 2015 నుంచి 2022 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రజలు తమ సొంత జేబుల నుంచి పెట్టే ఆరోగ్య ఖర్చు 62.6 శాతం నుంచి 39.4 శాతానికి తగ్గిందని, దీనివల్ల కుటుంబాలకు దాదాపు రూ. 1.25 లక్షల కోట్ల ఆదా అయ్యిందని చెప్పారు.
ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండటం, సమానత్వం, చౌకగా లభించడం, నాణ్యత, రోగుల భద్రత, నైపుణ్యం కలిగిన ఆరోగ్య నిపుణుల కొరత వంటి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని శ్రీ గౌబా పేర్కొన్నారు.. ఆరోగ్య సేవలు అందడం అనేది ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. ఆరోగ్య నిపుణులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుతూ.. సామాన్యులకు అందుబాటులో ఉండే జెనరిక్ మందులను ఎక్కువగా సూచించాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేని వారికి నిపుణులు గొంతుకగా నిలవాలని సూచించారు. డిజిటల్ ఆరోగ్య సాధనాలు, టెలిమెడిసిన్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాలకు కూడా నిపుణుల చికిత్సను అందించాలని కోరారు.
విస్తరిస్తున్న ప్రోబయోటిక్స్ రంగం గురించి మాట్లాడుతూ.. మైక్రోబయోమ్ సైన్స్ కేవలం వర్ణనాత్మక అధ్యయనాల నుంచి యాంత్రిక, అనువర్తిత పరిశోధనల స్థాయికి చేరుకుందని గౌబా పేర్కొన్నారు. రాబోయే కాలంలో మైక్రోబయోమ్ ఆధారిత చికిత్సలు, సింథటిక్ బయాలజీ, సాంకేతికత ద్వారా ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్‌ను అభివృద్ధి చేయడం వంటి కొత్త పోకడలు వస్తాయని ఆయన వివరించారు. ఇవి ఖచ్చితమైన వైద్యం కోసం వాపు నిరోధక, జీవక్రియ విధులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయని తెలిపారు. అయితే ప్రోబయోటిక్స్, సప్లిమెంట్ల మార్కెట్‌లో పెరుగుతున్న తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రకటనల గురించి హెచ్చరించారు. వైద్యులు, పరిశోధకులు తమకున్న విశ్వసనీయతను ఉపయోగించి సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని తెలిపారు. ఖరీదైన పరీక్షలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండా నివారణాత్మక జీవనశైలిని ప్రచారం చేయాలని కోరారు.
పులియబెట్టిన ఆహారాలు, సాంప్రదాయ ఆహార పద్దతుల్లో దేశానికి ఉన్న గొప్ప వారసత్వాన్ని శ్రీ గౌబా ప్రస్తావించారు. మన సాంప్రదాయ జ్ఞానాన్ని, ఆధునిక జన్యు, మైక్రోబయోమ్ పరిశోధనలతో అనుసంధానం చేయడం ద్వారా.. శాస్త్రీయంగా ధ్రువీకరించిన ప్రోబయోటిక్స్‌ను అభివృద్ధి చేసి, ప్రపంచ ప్రోబయోటిక్ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి దేశానికి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల భారాన్ని తగ్గించడంలో, పోషకాహార లోపాలను సరిదిద్దడంలో, ప్రజల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ప్రోబయోటిక్స్‌కు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఆయన వివరించారు. శాస్త్రీయ పురోగతిని సురక్షితమైన, సమర్థవంతమైన, అందరికీ అందుబాటులో ఉండే ఉత్పత్తులుగా మార్చడానికి.. విద్యాసంస్థలు, పరిశ్రమలు, నియంత్రణ సంస్థల మధ్య బలమైన సహకారం అవసరమని స్పష్టం చేశారు.
యువ పరిశోధకులు, ఆవిష్కర్తల భాగస్వామ్యాన్ని అభినందిస్తూ.. సంక్లిష్టమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి బహుళ విభాగ, సాక్ష్యాధారాలతో కూడిన విధానాలను అవలంబించాలని శ్రీ గౌబా వారిని ప్రోత్సహించారు. ఈ సదస్సు కొత్త భాగస్వామ్యాలకు నాంది పలుకుతుందని, మైక్రోబయోమ్, ప్రోబయోటిక్ శాస్త్ర రంగాల్లో దేశ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2246474)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11