రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళంలోకి అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ‘తారగిరి’ చేరికకు సర్వం సిద్ధం
సముద్ర తీరాన సరికొత్త రక్షక దళం.. భారత నౌకాదళ అగ్రశ్రేణిలో చేరనున్న ‘తారగిరి’
నాడు పోస్టు చేయడమైనది:
21 MAR 2026 1:21PM by PIB Hyderabad
దేశ సముద్ర సార్వభౌమాధికారంలో ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ.. భారత నౌకాదళం తన సరికొత్త స్టెల్త్ ఫ్రిగేట్ తారగిరి (ఎఫ్41)ని 3 ఏప్రిల్ 2026న అధికారికంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. విశాఖపట్నంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. సంపూర్ణ స్వయం సమృద్ధి కలిగిన నౌకాదళ శక్తిగా ఎదిగే దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణానికి ఈ వేడుక ఒక శమంతమైన నిదర్శనంగా నిలవనుంది.
ప్రాజెక్టు 17ఏ తరగతిలో నాలుగో శక్తిమంతమైన నౌకగా వస్తున్న తారగిరి కేవలం ఒక ఓడ మాత్రమే కాదు.. ఇది 6,670 టన్నుల బరువుతో ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తికి, స్వదేశీ నౌకాశ్రయాల అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ప్రతిరూపం.
ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించిన ఈ ఫ్రిగేట్.. పాత డిజైన్ల కంటే ఎంతో ఆధునికమైనది. ఇది మెరుగైన రూపాన్ని, గణనీయంగా తగ్గిన రాడార్ క్రాస్-సెక్షన్‌ను కలిగి ఉంది. దీనివల్ల రాడార్లకు చిక్కకుండా అత్యంత రహస్యంగా శత్రువులపై విరుచుకుపడగలదు. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధనౌక దేశీయ పారిశ్రామిక వ్యవస్థ పరిపక్వతను చాటిచెబుతోంది. ఈ ప్రాజెక్టులో 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వామ్యమయ్యాయి. ఇది భారత ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాలకు మద్దతునిస్తూ వేలాది మంది భారతీయులకు ఉపాధిని కల్పిస్తోంది.
కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ ప్లాంటుతో నడిచే తారగిరి.. అత్యంత వేగంతో పాటు సుదీర్ఘ కాలం ప్రయాణించగల బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుళ స్థాయిలో సముద్ర కార్యకలాపాల కోసం రూపొందించరు. ఈ నౌకలోని ఆయుధ సంపత్తి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనుగుణంగా ఉంది. ఇందులో సూపర్ సోనిక్ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, మధ్య శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, ప్రత్యేకమైన జలాంతర్గామి నిరోధక యుద్ధ సామగ్రి పరికరాలు ఉన్నాయి. అత్యాధునిక యుద్ధ నిర్వహణ వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థలన్నీ అనుసంధానించారు. దీనివల్ల నౌకలోని సిబ్బంది శత్రువుల ముప్పును క్షణాల వ్యవధిలో పసిగట్టి అత్యంత ఖచ్చితత్వంతో స్పందించగలరు.
సముద్ర గర్భంలో శత్రువులను వేటాడటమే కాకుండా, ఆధునిక దౌత్య సంబంధాలు, మానవతా సంక్షోభాల వంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా తారగిరి నిర్మించారు. తీవ్రమైన యుద్ధ పోరాటాల నుంచి మానవతా సాయం, విపత్తు సహాయక చర్యల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు దీని రూపకల్పన ఎంతో అనుకూలమైనది.
భారతీయులే రూపొందించి, భారతీయులే నిర్మించి, భారతీయులే నడిపే ఈ యుద్ధనౌకల రక్షణలో... వికసిత్, సమృద్ధి భారత్ కోసం సముద్రాలను కాపాడుతూ భారత నౌకాదళం ఒక పోరాటానికి సిద్ధంగా ఉన్న, సమన్వయంతో కూడిన, విశ్వసనీయమైన, ఆత్మనిర్భర శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధి చెందుతున్న సముద్ర శక్తికి నిదర్శనంగా, మన నీలి సరిహద్దులకు ఒక ఉక్కు కవచంలా ఉజ్వల భవిష్యత్తుకు తారగిరి సిద్ధంగా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2243351)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31