మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2030 నాటికి 100 శాతం స్థూల నమోదు నిష్పత్తిని సాధించేందుకు ఎన్ఐఓఎస్ ద్వారా సార్వత్రిక విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న డీఓఎస్ఈఎల్
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2026 4:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించిన వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసేందుకు, ఆత్మనిర్భర్ భారత్ ఆశయాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఓఎస్ఈఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పాఠశాలకు వెళ్లని పిల్లలను, మధ్యలోనే చదువు మానేసిన వారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు భారీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.
రాబోయే 2030 నాటికి ప్రీ-స్కూల్ స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు 100 శాతం స్థూల నమోదు నిష్పత్తిని సాధించడమే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 లక్ష్యంగా పెట్టుకుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 వార్షిక నివేదిక ప్రకారం.. 14-18 ఏళ్ల మధ్య వయస్సు గల దాదాపు 2 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని తేలింది. 3 నుంచి 8 తరగతుల మధ్య సుమారు 11 శాతం మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ప్రతి ఏటా 50 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు.
100 శాతం నమోదు లక్ష్యాన్ని సాధించాలంటే ఈ పిల్లలను వీలైనంత త్వరగా తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడం, భవిష్యత్తులో చదువు మధ్యలోనే మానేయడాన్ని నివారించడం అత్యవసరం. ఆర్థిక, సామాజిక, భౌగోళిక ఇబ్బందుల కారణంగా రోజూ పాఠశాలలకు వెళ్లలేని పిల్లలకు ఓపెన్ స్కూలింగ్ (సార్వత్రిక విద్య) ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన జాతీయ సార్వత్రిక విద్య సంస్థ.. దూర విద్యా విధానం ద్వారా నాణ్యమైన పాఠశాల విద్యను, నైపుణ్యాభివృద్ధిని అందిస్తోంది. ఇది అందరికీ సమానమైన విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, సార్వత్రిక విద్యా లక్ష్యాలను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విద్య సంస్థగా పేరొందిన ఎన్ఐఓఎస్.. సులభమైన ప్రవేశ ప్రక్రియ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి బహుళ అవకాశాలు, విద్యార్థి కోరుకున్నప్పుడు పరీక్ష రాసే సౌకర్యం, ఉపాధికి అవసరమైన వృత్తి విద్యా కోర్సులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు, ఇతర జాతీయ, రాష్ట్ర బోర్డులతో సమానమైన గుర్తింపు ఉన్న ధ్రువీకరణ పత్రాన్ని అందించడం వంటి సౌకర్యాలను కల్పిస్తుంది.
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పాఠశాల్లో విద్యార్థుల నమోదును, వారి అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. దీనివల్ల విద్యార్థులు పాఠశాలల్లో కొనసాగుతున్నారా లేదా అని తెలుసుకోవడంతో పాటు, చదువు మధ్యలో ఆపేసిన వారిని తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు సరైన అవకాశాలు కల్పించవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో బడి బయట ఉన్న లేదా చదువు మానేసిన పిల్లలను సంప్రదించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనుంది. సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడానికి, చదువు మానేసిన పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి, దేశవ్యాప్తంగా విశ్వసనీయమైన సార్వత్రిక విద్య వ్యవస్థ ద్వారా ఎన్ఐఓఎస్ అధికారులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పనిచేయనున్నారు.
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల జిల్లా స్థాయి సర్వేల నుంచి సేకరించిన సమాచారం.. రాబోయే నమోదు కార్యక్రమాల కోసం బడి బయట ఉన్న లేదా చదువు మధ్యలో ఆపేసిన పిల్లలను గుర్తించి, వారిని సంప్రదించడంలో ఎన్ఐఓఎస్ కు సహాయపడుతుంది. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ ఈ సౌకర్యం అందేలా చూసేందుకు ఎన్ఐఓఎస్ ‘‘నియోస్ మిత్ర’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇది సమాజాన్ని చైతన్యం చేయడానికి, నమోదును సులభతరం చేయడానికి రూపొందించినన సాంకేతికతతో కూడిన ఒక విస్తృత ప్రచార కార్యక్రమం. శిక్షణ పొందిన సహాయకులు పాఠశాలకు రాని పిల్లలను గుర్తించి, కౌన్సెలింగ్ ఇచ్చి, వారి నమోదుకు మద్దతిస్తారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, వలసదారులు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యాపరమైన మార్గదర్శకత్వం అందిస్తారు. ఈ కార్యక్రమం పారదర్శకమైన, డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించే వ్యవస్థ ద్వారా పనిచేయడం వల్ల జవాబుదారీతనం, ఖచ్చితమైన ఫలితాలు రాబట్టవచ్చు.
పాఠశాల విద్యలో అందుబాటు, నాణ్యత, ప్రామాణీకరణను బలోపేతం చేయడంతోపాటు సార్వత్రిక విద్యా వ్యవస్థల ప్రభావాన్ని మెరుగుపరచడంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోంది. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల వెనుకబడిన భారీ సంఖ్యలో విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలకి తీసుకురావడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 10,800 కంటే ఎక్కువ అధ్యయన, పరీక్షా కేంద్రాలతో ఎన్ఐఓఎస్ ఒక గొప్ప వేదికను అందిస్తోంది. ఈ ప్రయత్నాలను మరింత విస్తరించడానికి, విశ్వసనీయతను, పారదర్శకతను పెంచడానికి, ప్రతి మండలంలో కనీసం ఒక ఎన్ఐఓఎస్ అధ్యయన, పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తుంది.
ప్రణాళికలో ఉన్న కీలక చర్యలు
• కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలతో సహా పీఎం శ్రీ పాఠశాలలను, ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలను ఎన్ఐఓఎస్ అధ్యయన, పరీక్షా కేంద్రాలుగా గుర్తించడం.
• ఎన్ఐఓఎస్ పరీక్షల కోసం ప్రభుత్వ పాఠశాలలను, గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రాలను ఉపయోగించుకునేలా సార్వత్రిక విద్యా సంస్థలను ప్రోత్సహించడం.
• ప్రతి పంచాయతీ, పురపాలక సంఘంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలను ఎన్ఐఓఎస్ అధ్యయన, పరీక్షా కేంద్రాలుగా మారేలా ప్రోత్సహించడం.
అణగారిన వర్గాలకు సమగ్రమైన, సరళమైన, నాణ్యమైన విద్యను అందించడం, సార్వత్రిక పాఠశాల భాగస్వామ్య లక్ష్యాన్ని సాధించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం.
***
(రిలీజ్ ఐడి: 2243231)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15